విశాఖపట్నం రూటులో ఆర్టీసీ కిటకిట

ABN , First Publish Date - 2021-01-12T06:23:23+05:30 IST

విశాఖపట్నం రూటులో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరం డిపో నుంచి ఆదివారం 16 స్పెషల్స్‌ నడిపారు.

విశాఖపట్నం రూటులో ఆర్టీసీ కిటకిట

రాజమహేంద్రవరం నుంచి విశాఖకు 20 స్పెషల్‌ బస్సులు 

ఆర్టీసీలో సంక్రాంతి రద్దీ అంతా ఈ రూటులోనే

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 11: విశాఖపట్నం రూటులో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరం డిపో నుంచి ఆదివారం 16 స్పెషల్స్‌ నడిపారు. సోమవారం 20 నడిపారు. విశాఖపట్నం రూటుతో పోల్చితే హైదరాబాద్‌, విజయవాడ రూట్లలో రద్దీ తక్కువగానే ఉంది. సోమవారం హైదరాబాద్‌కు నాలుగు, విజయవాడకు మూడు స్పెషల్స్‌ వెళ్లాయి.  ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌కు విశాఖపట్నం రూటు కీలకంగా మారింది. జిల్లాలోని కాకినాడ, అమలాపురం, తుని తదితర డిపోల నుంచి కూడా విశాఖపట్నం రూటులోనే ఎక్కువ స్పెషల్స్‌ నడుపుతున్నారని సమాచారం. రాజమహేంద్రవరంతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల వారు ఎక్కువగా ఉంటారు. వీరంతా ఇక్కడ వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతారు. ఏటా పెద్దపండక్కి సొంతూళ్లు వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏడాది కరోనా కారణంగా చాలా రైళ్లు రద్దు కావడంతో వారంతా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖపట్నం రూటులో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక విజయవాడ రూటులో సాధారణం కంటే కాస్త ఎక్కువ మాత్రమే ట్రాఫిక్‌ ఉంది. హైదరాబాద్‌కు కూడా స్పెషల్స్‌ తక్కువగానే వెళుతున్నాయి. అయితే, భోగి సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీ పెరగవచ్చని ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


 


Updated Date - 2021-01-12T06:23:23+05:30 IST