రూ.144కోట్ల ధాన్యం కమీషన్‌ పెండింగ్‌

ABN , First Publish Date - 2021-11-21T06:58:46+05:30 IST

ప్రతిఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్న జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌)లకు ప్రభుత్వం ఏకంగా రూ.144కోట్లు బకాయి పడింది.

రూ.144కోట్ల ధాన్యం కమీషన్‌ పెండింగ్‌

 డబ్బు రాక సొసైటీలు గగ్గోలు 8 మూడు సీజన్ల నుంచి పేరుకుపోయిన బకాయిలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ప్రతిఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్న జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌)లకు ప్రభుత్వం ఏకంగా రూ.144కోట్లు బకాయి పడింది. పౌరసరఫరా సంస్థ ద్వారా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఈ సొసైటీల ద్వారా కూడా కొనుగోలు చేయించేవారు. ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కానీ మొన్నటివరకూ సొసైటీలు కూడా కొనుగోలు చేసేవి. ఇవి కూడా రైతులకు సంబంధించినవే కాబట్టి, కమీషన్‌వల్ల రైతుల సంక్షేమానికి ఉపయోగపడుతుందనేది గత ఆలోచన. ఒక క్వింటాల్‌(100కిలోల) ధాన్యం కొనుగోలు చేస్తే రూ.31.70 కమీషన్‌ ఇస్తారు. ప్రతిఏటా కొనుగోలు సీజన్‌ అయిపోయిన వెంటనే సొసైటీలకు కమీషన్‌ వచ్చేది. జిల్లాలో 300 సొసైటీలు ఉన్నాయి. వీటిలో 250 సొసైటీల వరకూ ధాన్యం కొనుగోలు చేస్తాయి. కానీ 2020 రబీ, ఖరీఫ్‌, 2021 రబీకి కూడా కమీషన్‌ రావాల్సిఉంది. చిన్నసొసైటీలకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకూ కమీషన్‌ రావాల్సి ఉండగా, పెద్ద సొసైటీలకు రూ.కోట్లలోనే బకాయి ఉంది. ఎందువల్లనో ఎవరూ ఈకమిషన్‌ గురించి మాట్లాడడం లేదు. జాయింట్‌ కలెక్టర్‌, సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ బాధ్యత వహించేవారు. దీనితో సహకార సంఘాల ప్రతినిఽధులు, వాటి పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న సొసైటీలకు ఏకంగా ఇన్ని కోట్లు బకాయిలు ఉండడం సమస్యగా మారింది. ప్రభుత్వంవద్ద డబ్బులేని కారణంగా ఈ సొమ్మును కూడా నిలిపివేసిందని అనుమానిస్తున్నారు. అసలు ప్రభుత్వం తమ బకాయిలు ఇస్తుందా, ఇవ్వదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందుముందు సొసైటీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాక అధికారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ముందు తమ బకాయిలు తమకు ఇచ్చేయాలని సొసైటీలు కోరుతున్నాయి. ఎంతో శ్రమకోర్చి ధాన్యం కొనుగోలు చేసి, నిల్వ చేసి, సివిల్‌ సప్లయిస్‌ సంస్థకు సహకరిస్తే ఏకంగా రూ.144కోట్లు పెండింగ్‌ పెట్టడంవల్ల సొసైటీలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.



Updated Date - 2021-11-21T06:58:46+05:30 IST