లారీ బోల్తా ఘటనలో ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2021-07-08T07:23:16+05:30 IST
మరికొద్ది సేపటిలో గమ్యానికి చేర తామనుకున్న బతుకులు అంతలోనే తెల్లారిపోయాయి. తెల్లవారుజామున లారీపై ప్రయాణిస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు అక్కున చేర్చుకుంటుందని వారు ఊహించలేక పోయారు.

ఏలేశ్వరంలో విషాదఛాయలు
ఏలేశ్వరం, జూలై 7: మరికొద్ది సేపటిలో గమ్యానికి చేర తామనుకున్న బతుకులు అంతలోనే తెల్లారిపోయాయి. తెల్లవారుజామున లారీపై ప్రయాణిస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు అక్కున చేర్చుకుంటుందని వారు ఊహించలేక పోయారు. లారీ బోల్తా కొట్టడంతో ఒకే కుటుంబానికి చెంది న ముగ్గురు మృత్యువు ఒడిలోకి జారిపోయారు. భార్య, భర్త తోపాటు రెండేళ్ల బాబు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టించింది. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులు సైతం బాలుడి మృతదేహాన్ని చూసి చలించిపోయారు. లారీ బోల్తా సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బుధవారం తెల్లవారుఝామున జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన కోమటి శ్రీనివాస్, రెండేళ్ల బిడ్డ రోహిత్, భార్య రాజ్యలక్ష్మితో కలిసి ఆమె పుట్టినిల్లు అయిన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వెళ్లారు. తిరిగి గుంటూరు వచ్చేందుకు మంగళవారం రాత్రి జార్ఖాండ్ నుంచి బెంగళూరు వెళ్లే నూక లారీ ఎక్కారు. కేసరపల్లి దగ్గరకు వచ్చిన తరువాత లారీ అదుపు తప్పి పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ (28), రాజ్యలక్ష్మి (27), రోహిత్ (2) ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కరోనా కర్ప్యూ కారణంగా ఉపాధిలేక గుంటూరు జిల్లా నుంచి విచ్చేసిన వీరు గత రెండు నెలలుగా ఏలేశ్వరంలోనే ఉంటున్నారు. చిలకలూరిపేటలో తిరిగి ఉపాధి దొరకడంతో బయలుదేరి వెళ్లారు. లారీ బోల్తా పడడంతో ముగ్గురు మరణం చెందారన్న విషయం తెలియగానే మృతురాలు రాజ్యలక్ష్మి తల్లి, సోదరుడు లక్ష్మీనారాయణ, సోదరి దుర్గలు శోకసంద్రంలో మునిగిపోయారు.