ధాన్యం మాయం!

ABN , First Publish Date - 2021-08-03T06:00:18+05:30 IST

గొల్లప్రోలు రూరల్‌, ఆగస్టు 2: ప్రభుత్వానికి చేరాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పక్కదారి పట్టింది. ఏకంగా ఒక మిల్లు నిర్వాహకులు రూ.7.92 కోట్ల మేర టోకరా వేశారు. మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలు కనబడకపోవడంతో జిల్లా జాయింట్‌ కలెక్టరు లక్ష్మీశ గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి రైతుభరోసా కేంద్రాలు,

ధాన్యం మాయం!

చేబ్రోలు రైసుమిల్లులో రూ.7.92 కోట్ల 

విలువైన సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి

ప్రభుత్వానికి భారీగా టోకరా

పోలీసులకు జాయింట్‌ కలెక్టరు లక్ష్మీశ ఫిర్యాదు

బ్యాంకు గ్యారంటీకి మించి భారీగా ధాన్యం కేటాయింపు


గొల్లప్రోలు రూరల్‌, ఆగస్టు 2: ప్రభుత్వానికి చేరాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పక్కదారి పట్టింది. ఏకంగా ఒక మిల్లు నిర్వాహకులు రూ.7.92 కోట్ల మేర టోకరా వేశారు. మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలు కనబడకపోవడంతో జిల్లా జాయింట్‌ కలెక్టరు లక్ష్మీశ గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి రైతుభరోసా కేంద్రాలు, మహిళాశక్తి గ్రూపులు, సొసైటీల్లోని రైతు భరోసా కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైసుమిల్లుల ద్వారా ఆడించి నాణ్యమైన బియ్యాన్ని సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు సరఫరా చేసే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఈ విధంగా ధాన్యాన్ని మర ఆడించి నాణ్యమైన బియ్యాన్ని అందించినందుకుగానూ రైసుమిల్లులకు ప్రభుత్వం నిర్ణీత మొత్తంలో కమిషన్‌ చెల్లిస్తోంది. ఇందులో భాగంగా రబీ 2021 సీజన్‌లో గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని గౌతమి సురేష్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌కు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) నిమిత్తం రైతు భరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా సేకరించిన 3805.68 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పంపారు. ఇందులో పది శాతం ధాన్యాన్ని కూడా ఆడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకు అందజేయకపోవడంతో అనుమానం వచ్చిన ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.


మిల్లులో కిలో ధాన్యంగాని, బియ్యంగాని లేకపోవడాన్ని గుర్తించారు. ఇచ్చిన ధాన్యంలో 215.90 టన్నులను సీఎంఆర్‌కు ఇవ్వగా, మిల్లులో 3589.78 టన్నుల ధాన్యం నిల్వలు ఉండాలి. ఈ ధాన్యం ఆడితే 2405.15 టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. రూ7.92 కోట్ల విలువైన ఈ నిల్వలు మిల్లు నుంచి పక్కదారి పట్టినట్టు గుర్తించి అధికారులు జేసీకి నివేదించారు. ప్రభుత్వం వద్ద రూ.1.40 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు ఉండడంతో మిగిలిన రూ.6.52 కోట్లు దుర్వినియోగమయ్యాయని, ఇందుకు బాధ్యులైన గౌతమి సురేష్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జేసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ 420,406,409 సెక్షన్లు, ఈసీ యాక్ట్‌ 7(1)ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం జిల్లా అధికారవర్గాల్లో సంచలనంగా మారింది. వినియోగంలో లేని ఈ మిల్లుకు బ్యాంకు గ్యారంటీలకు మించి భారీ మొత్తంలో ధాన్యం నిల్వల కేటాయింపు వెనుక పౌరసరఫరాలశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు సమాచారం.

Updated Date - 2021-08-03T06:00:18+05:30 IST