నిలువుదోపిడీ

ABN , First Publish Date - 2021-05-21T06:22:59+05:30 IST

కొవిడ్‌ బాధితుల భయాన్ని, కొవిడ్‌ బారి నుంచి బయటపడాలనే ఆశను కొందరు ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. వైద్యం దగ్గర నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లే అంబులెన్స్‌లు, అంత్యక్రియల వరకు అన్నిచోట్లా దోపిడీ చేస్తూనే ఉన్నారు. రోగం కంటే డబ్బు లేనితనం మరింత బాధపెడుతోంది.

నిలువుదోపిడీ
రాజమహేంద్రవరంలో గురువారం స్వాధీనం చేసుకున్న రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు

  • రాజమహేంద్రవరం కేంద్రంగా రెమ్‌డెసివిర్‌ ముఠా
  • కొవిడ్‌ బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్న వైనం
  • ఇంజక్షన ఒక్కటీ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయం
  • ఔషధ నియంత్రణ తనిఖీ అధికారుల స్టింగ్‌ ఆపరేషన
  • ఇప్పటివరకు 59 ఇంజక్షన్లు స్వాధీనం
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరత 
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ బాధితుల భయాన్ని, కొవిడ్‌ బారి నుంచి బయటపడాలనే ఆశను కొందరు ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. వైద్యం దగ్గర నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లే అంబులెన్స్‌లు, అంత్యక్రియల వరకు అన్నిచోట్లా దోపిడీ చేస్తూనే ఉన్నారు. రోగం కంటే డబ్బు లేనితనం మరింత బాధపెడుతోంది. కొవిడ్‌ బాధితులైన వారిలో వైరస్‌ ప్రభావం తగ్గించడానికి ఉపయోగపడుతున్న రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ బ్లాక్‌మార్కెటర్లకు మంచి ఆయుధంగా మారింది. ఈ ఇంజక్షనను అడ్డుపెట్టుకుని కోట్లు గడిస్తున్నారు. ఒక్కో ఇంజక్షనకు రూ.30 వేల  నుంచి రూ.50 వేల వరకు లాగేస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరితే డబ్బు పెట్టుకుని కొనుక్కోవలసిందే. డబ్బున్నవాళ్లు అధికంగా వీటిని వాడుతున్నారు. వాస్తవానికి ఈ ఇంజక్షన ఎమ్మార్పీ రూ.3వేలు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.2,500 వరకు మాత్రమే అమ్మాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఎక్కడా రూ.30వేలకు తక్కువకు దొరకట్లేదు. అంతేకాక అర్జెంట్‌గా కావాలంటే రూ.50 వేలు వరకు గుంజుతున్నారు. హైదరాబాద్‌, చెన్నెకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఈ బ్లాక్‌ మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో డ్రగ్స్‌ అధికారులు ఇప్పటికే మూడుసార్లు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి 59 ఇంజక్షన్లు స్వాఽధీనం చేసుకున్నారు.

ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌ కుకట్‌పల్లిలో శానిటైజర్ల మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నిర్వహించే అనిల్‌కుమార్‌రెడ్డి రాజమహేంద్రవరానికి చెందిన సుధాకర్‌రెడ్డితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఉభయ తెలుగు రాషా్ట్రల్లో రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతకు ముందు చెన్నై నుంచి తెచ్చి, కొందరు బ్లాక్‌ మార్కెట్‌ నిర్వహించారు.  హైదరాబాద్‌ ముఠా నుంచి 28 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు, కొవిడ్‌ చికిత్సకు వాడే 17 రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం జిల్లా మేజిసే్ట్రట్‌ కోర్టులో కేసు నమోదు చేశారు. గత శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీనివాసానగర్‌లో ఆర్కే ఫార్మాలో ఈ ఇంజక్షన్లను ఒక్కొక్కటి రూ.30వేలకు విక్రయిస్తున్నారని తెలిసి ఒక బాధితుడిని పంపించారు. కొనుగోలు చేసే సమయంలో డ్రగ్స్‌ అధికారులు దాడి చేసి అమ్మేవారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నల్లమిల్లి రంజిత్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి తన తండ్రి పేరిట ఈ ఫార్మా కంపెనీ నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను బిల్లులు లేకుండా తెచ్చి ఒక్కోటి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. అతని నుంచి  12 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.17,140 విలువైన రెండు కాలం చెల్లిన మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిసే్ట్రట్‌ కోర్టులో కేసు నమోదు చేశారు. 

అంతకు ముందు సన్‌స్టార్‌ ఆసుపత్రిలో తనిఖీల సమయంలో బిల్లులు లేని 17 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చాలా మంది బ్లాక్‌మార్కెట్‌ నిర్వహిస్తూ  కొందరు ప్రైవేట్‌ వైద్యులతో కుమ్మక్కై ఓ పఽథకం ప్రకారం ఈ బ్లాక్‌మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉంది. వీటిని జిల్లా కలెక్టర్‌ కేటాయిస్తుంటారు. ఇండెంట్‌ పెట్టిన దానిలో కొన్నే కేటాయించడం వల్ల అందరికీ ఇంజక్షన ఇవ్వలేకపోతున్నారు. రాజానగరం గ్రామానికి చెందిన దంపతులు ఇటీవల రూ.50 వేలు పెట్టి చేయించుకున్నారు. అయినా వారు  ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-05-21T06:22:59+05:30 IST