వ్రతాలు, దర్శనాలు, ప్రసాదాల టిక్కెట్లన్నీ ఒకేసారి విక్రయించాలి

ABN , First Publish Date - 2021-12-28T05:33:29+05:30 IST

సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులు వ్రతం టిక్కెట్లకు, దర్శనాల టిక్కెట్లకు, ప్రసాదం కొనుగోలుకు మూడుసార్లు క్యూలైన్లో వేచిఉండాల్సి వస్తోందని, ఈ మూడు ఒకేసారి భక్తులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మండపేటకు చెందిన సూర్యనారాయణమూర్తి అనే భక్తుడు ఈవోకు సూచన చేశారు.

వ్రతాలు, దర్శనాలు, ప్రసాదాల టిక్కెట్లన్నీ ఒకేసారి విక్రయించాలి

 అన్నవరం, డిసెంబరు 27: సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులు వ్రతం టిక్కెట్లకు, దర్శనాల టిక్కెట్లకు, ప్రసాదం కొనుగోలుకు మూడుసార్లు క్యూలైన్లో వేచిఉండాల్సి వస్తోందని, ఈ మూడు ఒకేసారి భక్తులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మండపేటకు చెందిన సూర్యనారాయణమూర్తి అనే భక్తుడు ఈవోకు సూచన చేశారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం సోమవారం పునఃప్రారంభం కాగా 13 మంది నుంచి కాల్స్‌ వచ్చాయి. వ్రత మండపాలలో వ్రత పురోహితులు వ్రతకథకు ఎంత సమయం తీసుకుంటున్నారో వారి సంభావనకు అలానే తీసుకుంటున్నారని మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. బంగీ ప్రసాదం పూర్తిగా అందుబాటులో ఉంచాలని, గోధుమరవ్వ ప్రసాదం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూడాలని, అన్నదానం సమాచారం విరాళం ఇచ్చే భక్తులకు ఉండడం లేదని, దర్శన సమయంలో వికలాంగ భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించి ఆ సమయంలో ఎవరిని సంప్రదించాలో ఫ్లెక్సీ బోర్డులు ఉండేలా చూడాలని భక్తులు కోరారు. కోరుకొండ లక్ష్మీనారాయణ దేవస్థానంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, తరచూ శుభ్రపరిచేలా చూడాలని మరో భక్తుడు కోరారు. ఈ ఏడాది సత్యదీక్షల ప్రచారం విస్తృతంగా చేపట్టలేదని ఓ భక్తుడు అడగ్గా కొవిడ్‌ ఆంక్షల కారణంగా పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేదని, పరిస్థితులు సద్దుమణిగితే అన్ని సేవలకు విస్తృత ప్రచారం చేస్తామని ఈవో తెలిపారు. ప్రతినెలా మొదటి, ఆఖరి సోమవారాల్లో భక్తులు తమ సలహాలు, సూచనలు, సమస్యలను ఫోన్‌ద్వారా తెలియజేయవచ్చునని ఈవో తెలిపారు.

Updated Date - 2021-12-28T05:33:29+05:30 IST