పెరిగిన ధరలను నిరసిస్తూ వామపక్షాల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-10-29T05:15:55+05:30 IST

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు.

పెరిగిన ధరలను నిరసిస్తూ వామపక్షాల రాస్తారోకో

అమలాపురంటౌన్‌, అక్టోబరు 28: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఎం డివిజన్‌ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొప్పుల సత్తిబాబు, మండల కార్యదర్శి కామిరెడ్డి చంద్రరావు తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెట్రో ధరలతో పాటు వంటగ్యాస్‌, వంట నూనెలు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలను  వెంటనే తగ్గిం చాలని డిమాండ్‌ చేశారు. ప్రదర్శనలో వామపక్ష నాయకులు కుడుపూడి సత్యనారాయణ, నిమ్మకాయల సురేష్‌, బొలిశెట్టి శంకర్‌, మట్టపర్తి నారాయణ, మట్టపర్తి ప్రసాద్‌, కాళ్ల భీమరాజు,  తదితరులు పాల్గొన్నారు. 

లారీ ఓనర్స్‌ నిరసన 

పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే  తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ది సెంట్రల్‌ డెల్టా లారీ ఓనర్స్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సంఘ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని, రోడ్డు సెస్‌ రద్దు చేయాలని, టోల్‌గేట్లు ఎత్తివేయాలని, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్సు ప్రీమియం తగ్గించాలని, రాష్ట్రంలో రోడ్డు సెస్‌తో యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో అసోసియేషన్‌ అధ్యక్షుడు వాకపల్లి స్వామినాయుడు, సంఘ సభ్యులు పాల్గొన్నారు

 సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

ముమ్మిడివరం: పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ముమ్మిడివరంలో రాస్తారోకో, ధర్నా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఎం పార్టీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తహశీల్దార్‌ కార్యాలయానికి తరలివచ్చి రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్‌ ఎస్‌. పోతురాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జి.దుర్గాప్రసాద్‌, సకిలే సూర్యనారాయణ, పాము బాలయ్య, జగడం నాగేశ్వరరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలి

రామచంద్రపురం: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని వామపక్ష నాయకులు, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఆర్డీవో కార్యాలయం ఎదురుగా గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహిం చారు. సీపీఐ నాయకుడు పి.రాము, సీపీఎం నాయకులు ఎంవీ రమణ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు జి.సూరిబాబు, పట్టణ లారీ యూనియన్‌ అధ్యక్షుడు చక్రవర్తి, ఎస్‌.శారదాదేవి, ప్రేమానందం, భగవాన్‌, పి.సత్యవతి, కె.వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ సిద్ధు, జి.కుమారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:15:55+05:30 IST