ఆర్డినెన్సుతో బడ్జెట్ నడపటం ఏంటి?: గోరంట్ల

ABN , First Publish Date - 2021-05-20T16:47:54+05:30 IST

అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం వల్ల బడ్జెట్ సమావేశాలు బహిష్కరించామని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

ఆర్డినెన్సుతో బడ్జెట్ నడపటం ఏంటి?: గోరంట్ల

రాజమండ్రి: అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం వల్ల బడ్జెట్ సమావేశాలు బహిష్కరించామని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగటం లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం 15 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు నడపలేదని.. అసెంబ్లీ సమావేశాలు కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా సెకెండ్ వేవ్‌పై ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. రెండు లక్షల యాక్టివ్ కేసులుంటే ఎన్ని బెడ్లు ఏర్పాటు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఆర్డినెన్సుతో బడ్జెట్ నడపటం ఏంటని ప్రశ్నించారు. ధాన్యం ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు.


ఇసుక విధానం సరిగ్గా లేక భవన కార్మికులు రోడ్డున పడ్డారని, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడానికి మైక్ ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల నుంచి బయటపడటానికి రాష్ట్ర సంపదను గుజరాత్‌కు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. బలహీన, దళిత వర్గాల వారికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెంటిలేటర్లు, బెడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజు ఐదు గంటల సేపు మాత్రమే ఉంటుందని...ఈ ఐదు గంటల సమయంలో మాట్లాడానికి అవకాశం ఇవ్వరని, అందుకే బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.


ధాన్యంకు సంబంధించిన రైతులకు డబ్బులు ఇవ్వలేదన్నారు. అందరికీ మాస్క్‌లు ఎప్పుడు పంపిణీ చేస్తారని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా పోలీస్ వ్యవస్థ అప్రతిష్ట పాలు అవుతుందన్నారు. చట్ట సభలను చెత్త సభలుగా మార్చారన్నారు. నయా హిట్లర్ జగన్ ప్రజలపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని అన్నారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోతారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కూడా సభ్యులపై అరుస్తున్నారన్నారు. మాక్ అసెంబ్లీ ద్వారా ప్రజా సమస్యలపై చర్చిస్తామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

Updated Date - 2021-05-20T16:47:54+05:30 IST