చీకట్‌లు!

ABN , First Publish Date - 2021-07-08T07:18:01+05:30 IST

జిల్లాలో విద్యుత్‌ వినియోగం రాత్రివేళలో అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతోంది. కానీ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు అమాంతం పెరిగిపోయాయి.

చీకట్‌లు!
అప్రకటిత కరెంటు కోతపై కొత్తపల్లి సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన వ్యక్తంచేస్తున్న జనం

జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎడాపెడా విద్యుత్‌ కోతలు

నిత్యం రాత్రి వేళల్లో నాలుగు నుంచి అయిదు గంటలు సరఫరా బంద్‌

ఒకపక్క ఉక్కబోత, మరోపక్క దోమలతో జనం నరకయాతన

సరఫరా వచ్చినా ఏ అర్ధరాత్రో చడీచప్పుడు లేకుండా గంటల తరబడి  కోతలు

15 రోజులుగా ఇదే తంతు.. నగరాలు, పట్టణాల్లోనూ పన్నెండు తర్వాత అంతరాయం

ఆగ్రహంతో యు.కొత్తపల్లిలో సబ్‌ స్టేషన్‌ వద్ద జనం ఆందోళన బాట

జిల్లాలో 800 మెగావాట్లకు దాటిపోయిన రోజువారీ విద్యుత్‌ వినియోగ డిమాండ్‌

అటు లోయర్‌ సీలేరుతోపాటు పడిపోయిన పవన, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో విద్యుత్‌ వినియోగం రాత్రివేళలో అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతోంది. కానీ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు అమాంతం పెరిగిపోయాయి. గడచిన పదిహేను రోజులుగా రాత్రివేళల్లో ఎడాపెడా అధికారులు సరఫరా నిలిపివేస్తున్నారు. నగరాలు,పట్టణాలు,మండల కేంద్రాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో రాత్రి ఏడు నుంచి తెల్లవారు వరకు దఫదఫాలుగా కోతలు విధిస్తున్నారు. ఫలితంగా జనం అల్లాడిపోతున్నారు. ఒకపక్క విపరీతమైన ఉక్కబోత, మరోపక్క దోమల బెడదతో కంటినిండా నిద్రపోలేని పరిస్థితితో అసహనానికి గురవుతున్నారు. వాస్తవానికి గడచిన కొద్ది  రోజులుగా ఎండల తీవ్రత కొంత తగ్గినా ఉక్కబోత మాత్రం పెరిగింది. రాత్రివేళల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా గాలిలేక అల్లాడిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఎండ తీవ్రత నలభై డిగ్రీల నుంచి దిగువకు పడిపోయినా చెమటలు పడుతున్నాయి. దీంతో రాత్రివేళల్లో జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ 800 మెగావాట్లకు పైనే పెరిగిపోయింది. గతనెల వరకు రాత్రివేళ ల్లో విద్యుత్‌ డిమాండ్‌ 890 మెగావాట్ల వరకు వెళ్లింది. దీంతో రాత్రివేళల్లో అనుహ్యంగా పెరిగిపోతున్న డిమాండ్‌లోడ్‌ను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్‌కో అధికారులు కోతలు విధిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో సరఫరాకు పెద్దగా సమస్య లేకుండా ఈ ప్రాంతాల నుంచి రాత్రి విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకోవడానికి పల్లెల్లో కోతలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు కొన్ని చోట్ల కోత కోసి ఆ తర్వాత సరఫరా పునరుద్ధరిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఎనిమిది నుంచి పది వరకు, పన్నెండు నుంచి తెల్లవా రు రెండు గంటల వరకు కోత కోస్తున్నారు. అసలే బయట ఉక్క బోత, మరోపక్క వర్షాల వలన దోమల బెడదతో గ్రామీణ జనం అల్లాడుతున్నారు. కంటినిండా నిద్రకూడా పోలేని పరిస్థితితో భగ్గుమంటున్నారు. గడచిన పదిహేను రోజులుగా జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. అసలు ఎప్పుడు విద్యుత్‌ ఉం టుందో.. ఎప్పుడు కోత కోస్తారో తెలియక జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ రాత్రి ఏ పదికో విద్యుత్‌ ఇచ్చారని సంతోషపడితే తిరిగి లోడ్‌ రిలీఫ్‌ పేరుతో మళ్లీ తెల్లవారు నాలుగు గంటల నుంచి కూడా విద్యుత్‌ నిలిపివేస్తున్నా రు. దీంతో గ్రామీణప్రాంతాల జనం ట్రాన్స్‌కో తీరుపై మండిపడుతున్నారు. అందులోభాగంగా వరుసగా కొన్ని వారాలుగా అప్రకటి త కోతలతో విసిగిపోయామంటూ ట్రాన్స్‌కో అధికారుల తీరుపై యు.కొత్తపల్లిలో జనం రోడ్డెక్కారు. విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడేకాదు దాదాపు గ్రామీణ జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ కోతలతో జనం కన్నెర్ర చేస్తున్నారు. ఉదయం వేళల్లో ను మూడు నుంచి నాలుగు గంటలు కోత విధిస్తూ రాత్రివేళల్లోను విద్యుత్‌ తీసేస్తే ఎలాగంటూ మండిపడుతున్నారు. నగరాలు, పట్టణాల్లోను తెలియకుండా కోతలు విధిస్తూ జనం సహనాన్ని ట్రాన్స్‌ కో పరీక్షిస్తోంది. నగరాల్లోను డిమాండ్‌కు సరిపడా లభ్యత లేదనే సాకుతో అర్ధరాత్రి రెండు నుంచి మూడు వరకు కూడా సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో వేసవి తగ్గిన తర్వాత కూడా కోతలేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ట్రాన్స్‌కో ఎస్‌ఈతో మాట్లాడగా, జిల్లాలో రాత్రివేళ విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, అందుకు తగ్గ సరఫరా లేకే కోతలు విధిస్తున్నట్టు వివరించారు. అయితే సరఫరా నిలిపివేత విజయవాడ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నుంచే అమలవుతుందని తెలిపారు. కాగా గ్రిడ్‌ద్వారా రాష్ట్రానికి, జిల్లాకు రావలసిన విద్యుత్‌లో కోత పడుతుండడం వల్ల కూడా కోతలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా పవన విద్యుత్‌కు సం బంధించి రాష్ట్రవ్యాప్తంగా 600 మెగావాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. జలవిద్యుత్‌ ఉత్పత్తి జరిగే లోయర్‌ సీలేరులోను నిర్వహణ, ఇతర కారణాలతో 200 మెగావాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి జరగడం లేదు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలోను కోత పడింది. పెరిగిన డిమాండ్‌కు తగ్గ లభ్యత లేక కొన్నిరోజులుగా ఎడాపెడా కోతలు కోస్తున్నారు. బయట నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌కు సమస్యలు ఎదురవుతుండడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా అందు బాటులోకి రావడం లేదు. కొద్దిరోజుల్లో విద్యుత్‌ లభ్యత పెరగనుందని, తద్వారా కోతలుండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

అప్రకటిత కరెంటు కోతపై జనాగ్రహం

అర్ధరాత్రిపూట కొత్తపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా

కొత్తపల్లి, జూలై 7: మండలంలో గత నాలుగైదు రోజుల నుంచి రాత్రి సమయాల్లో అప్రకటితంగా కరెంటు కోత విధించడం పట్ల స్ధానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. రాత్రి  10 గంట నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా అర్ధరాత్రి 1గంట నుంచి 3 గంటల వరకు కరెంటు కోత విధిస్తుండడంపై కొత్తపల్లి, వాకతిప్ప, కుతుకుడుమిల్లి గ్రామాలకు చెందిన ప్రజలు విసుగెత్తి సబ్‌స్టేషన్‌వద్ద ఆందోళన చేపట్టారు. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోత విధిస్తున్నామని అధికారులు చెప్పారు.

 


Updated Date - 2021-07-08T07:18:01+05:30 IST