విగ్రహాన్ని ధ్వంసం చేసింది పూజారే

ABN , First Publish Date - 2021-02-01T06:14:56+05:30 IST

నగరంలోని శ్రీరామ్‌నగర్‌లో సంకటహర వరసిద్ధి..

విగ్రహాన్ని ధ్వంసం చేసింది పూజారే
వివరాలు వెల్లడిస్తున్న అశోక్‌కుమార్‌

ఆయనతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశాం

సీఐడీ డీఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడి


రాజమహేంద్రవరం: నగరంలోని శ్రీరామ్‌నగర్‌లో సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఆ ఆలయ పూజారేనని సీఐడీ డీఐజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. దిశ పోలీస్‌స్టేషనలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విగ్రహాన్ని పూజారి మరల వెంకట మురళీకృష్ణ ధ్వంసం చేయడమే కాక పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించాడని చెప్పారు. అనంతరం రాజమహేంద్రవరం అర్బన ఎస్పీ షెముషి బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ పూజారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు చెప్పాడన్నారు. సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం పెట్టిన నాటి నుంచీ ఆలయంలో పరిస్థితులు బాగోలేదు. తన ఆర్థిక స్థితి కూడా బాగోక ఇబ్బందులు పడుతున్న తరుణంలో టీడీపీ మాజీ కార్పొరేటర్‌ భర్త మళ్ళ వెంకట్రాజు, టీఎన్టీయూసీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి వెంకటపతిరాజు రూ.30వేలు ఇచ్చి ఈ పని చేయించారని పూజారి అంగీకరించాడని చెప్పారు. ఈ కేసులో పై ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇంకా మరికొంత మందిని విచారించాల్సి వుందన్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ లతామాధురి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T06:14:56+05:30 IST