ప్యాకేజీ ఇచ్చేవరకు పోలవరం ఆపాలి

ABN , First Publish Date - 2021-01-13T05:51:35+05:30 IST

ముంపు గ్రామాలైన 276 గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేవరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని ఆదివాసీ మహాసభ డిమాండ్‌ చేసింది.

ప్యాకేజీ ఇచ్చేవరకు పోలవరం ఆపాలి

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 12: ముంపు గ్రామాలైన 276 గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేవరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని ఆదివాసీ మహాసభ డిమాండ్‌ చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడారు. ముప్పాళ్ల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తొలుత 45 మీటర్ల ఎత్తు అని ఇప్పుడు 41 మీటర్లకు నిర్మిస్తున్నట్టు తెలిసిందన్నారు. 2020 జులైలో వచ్చిన వరదలకే ఇంజనీర్ల అంచనాలు తారుమారు అయ్యాయని, 35 మీటర్ల నీటికే దేవీపట్నంలోని ఆరు గ్రామాలు మునిగిపోయాయన్నారు.  సూర్యనారాయణ మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో 2014లో ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసి ఎకరానికి రూ.6,30,000 పరిహారం ఇవ్వాలని, ఆదివాసీలకు భూమికి భూమి ఇవ్వాలని పేర్కొన్నారన్నారు. అయితే 2020లో ప్రభుత్వం అదే రేట్లతో ఎలాంటి మార్పు లేకుండా మరో జీవోను విడుదల చేశారని చెప్పారు. ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో పాత ధరలతో ఇచ్చిన జీవోతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉన్నందున ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆదివాసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కారం వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గిడుతూరి చిన్నారావు, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:51:35+05:30 IST