సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశమేది?

ABN , First Publish Date - 2021-12-30T06:40:46+05:30 IST

పిఠాపురం, డిసెంబరు 29: సమస్యలు ప్రస్తావించేందుకు కౌన్సిల్‌ సమావేశంలో అవకాశం ఇవ్వడం లేదని, పరిష్కారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. పిఠాపురం పురపాలకసంఘ కార్యాలయంలో బుధవారం జరగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి

సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశమేది?
పిఠాపురం సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌

పిఠాపురం కౌన్సిల్‌ సమావేశంలో సభ్యుల మండిపాటు

పిఠాపురం, డిసెంబరు 29: సమస్యలు ప్రస్తావించేందుకు కౌన్సిల్‌ సమావేశంలో అవకాశం ఇవ్వడం లేదని, పరిష్కారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. పిఠాపురం పురపాలకసంఘ కార్యాలయంలో బుధవారం జరగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి చైర్‌పర్సన్‌ గండేపల్లి సూర్యావతి అధ్యక్షత వహించారు. సమావేశాన్ని కేవలం 50 నిమిషాల్లోనే ముగించడంపై సభ్యులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని పాతబస్టాండు వద్ద గల రాజీవ్‌గాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్‌బాల్‌ కోర్టు పనులకు ఏడాది క్రితం శంకుస్థాపన చేసి నేటివరకూ ఎందుకు ప్రారంభించలేదని కౌన్సిలర్‌ బొజ్జా జగదీశ్వరి ప్రశ్నించారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు పిఠాపురం నుంచి పదిమంది క్రీడాకారులు వరకూ ఎంపికయ్యారని, వారికి శిక్షణ పొందేందుకు ఇప్పుడు కోర్టు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పనులు ప్రారంభించకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. కౌన్సిలర్లు బోను దేవ, పెదపాటి రాజేష్‌, రాయుడు శ్రీను తదితరులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తక్షణం పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌కు బిల్లుల బకాయి ఉండటంతో పనులు చేయడం లేదని, అతనితో మాట్లాడి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మునిసిపల్‌ కమిషనరు ఎం.రామ్మోహన్‌, ఏఈ వంశీ అభిషేక్‌లు తెలిపారు. 

కార్తీకమాసంలో పారిశుధ్య నిర్వహణ నిమిత్తం నియమించిన అదనపు కార్మికుల వివరాలను ఆధార్‌ నెంబర్లుతో ఇవ్వాలని టీడీపీ కౌన్సిలరు అల్లవరపు నగేష్‌ కోరారు. కుంతీమాధవస్వామి గుడి వీధిలో కల్వర్టు కుంగిపోయిందని, రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని కౌన్సిలరు పంపనబోయిన అన్నపూర్ణ, కోళ్ల బంగారుబాబులు తెలిపారు. ఊరచెరువు ప్రాంతంలో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతున్నాయని, వాటిని సరిచేయాలని సూరవరపు సుజాత కోరారు. మున్సిపల్‌ షాపులకు సంబంధించి మూడేళ్లుగా అద్దెలు చెల్లించకుంటే అధికారులు ఏం చేస్తున్నారని బొజ్జా జగదీశ్వరీ ప్రశ్నించారు. వార్డుల్లో సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వకుండా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించడం ఏమిటని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇటువంటప్పుడు కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించడం ఎందుకుని వారు నిలదీశారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్లు పచ్చిమళ్ల జ్యోతి, కొత్తపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T06:40:46+05:30 IST