బాగున్న రహదారిపై సీసీరోడ్డు నిర్మాణమా
ABN , First Publish Date - 2021-10-30T05:11:47+05:30 IST
పిఠాపురం, అక్టోబరు 29: అధ్వానంగా ఉన్న వాటికి నిధులు కేటాయించకుండా బాగున్న సిమ్మెంట్ రహదారిపైనే సీసీరోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించడంపై తెలుగుదేశం కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి తదితర పత్రిల్లో వచ్చిన కథనాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పిఠాపురం
పిఠాపురం కౌన్సిల్ సమావేశంలో టీడీపీ అభ్యంతరం
ప్రజా సమస్యలపై అడగనివ్వడం లేదని ఆవేదన
పిఠాపురం, అక్టోబరు 29: అధ్వానంగా ఉన్న వాటికి నిధులు కేటాయించకుండా బాగున్న సిమ్మెంట్ రహదారిపైనే సీసీరోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించడంపై తెలుగుదేశం కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి తదితర పత్రిల్లో వచ్చిన కథనాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో చైర్‌పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన శుక్రవారం కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో 28వ వార్డులో ప్రస్తుతం ఉన్న సీసీరోడ్డుపైనే మళ్లీ సిమ్మెంట్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అంశం చర్చకు రాగా టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, పంపనబోయి అన్నపూర్ణ, రేవతి రాంబాబు, నల్లా రమణమ్మ అభ్యంతరం తెలిపారు. బాగున్న రోడ్డుపైనే మళ్లీ సీసీరోడ్డు వేయడం ఏంటని ప్రశ్నించా రు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించి సభలో ప్రదర్శించారు. ఆ ప్రాంతం ఏలేరు కాలువలో నుంచి నీరు వచ్చినప్పుడు ముంపునకు గురవుతున్నదని, అందుకే రోడ్డు ఎత్తు చేస్తున్నారని 28వ వార్డు కౌన్సిలరు రాయపురెడ్డి పావని, తలిశెట్టి వెంకటేశ్వరరావు, డీఈఈ హుస్సేన్ తెలిపారు. అనంతరం ఈ అంశాన్ని ఆమోదించారు. దీనిపై తాము డీసెంట్ తెలియజేస్తున్నట్టు టీడీపీ కౌన్సిలర్లు చెప్పారు. కౌన్సిల్ హాలులో 19 ఫ్యాన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపామని, కాని 16 ఫ్యాన్లే ఏర్పాటు చేశారని, 2400 మీటర్ల వైరు వినియోగిస్తున్నట్లు చెప్పారని, ఎక్కడ వినియోగించారో తెలపాలని కౌన్సిలరు బొజ్జా జగదీశ్వరీ ప్రశ్నించారు. అందుకు సంబంధించి వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. రేవితి రాంబాబు మాట్లాడుతూ 7నెలలుగా తమ వార్డులో లైట్లు సక్రమంగా వెలగడం లేదని, శానిటేషన్ సరిగా చేయడం లేదన్నారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని రాయుడు శ్రీను తెలిపారు. అజెండాలో అంశాలు ఆమోదిస్తున్నామని తలిశెట్టి వెంకటేశ్వరరావు తెలపగా, మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారంటూ నగేష్ అభ్యంతరం తెలియజేశారు. సమావేశంలో ప్రజాసమస్యలపై అడగనివ్వడం లేదని పంపనబోయిన అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌టీఐ ద్వారా అడిగిన వాటికి సమాచారం ఇవ్వడం లేదని నగేష్, జగదీశ్వరీ తెలిపారు. సమావేశం లో వైస్‌చైర్మన్‌లు పచ్చిమళ్ల జ్యోతి, కొత్తపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.