సచివాలయ ‘చిచ్చు’
ABN , First Publish Date - 2021-03-28T07:00:35+05:30 IST
సచివాలయ ‘చిచ్చు’ సచివాలయ ‘చిచ్చు’ జిల్లా అధికారుల్లో ఆధిపత్య పోరు మొదలైంది. సాధారణంగా రెవెన్యూశాఖ ఇతర అధికార శాఖలపై పెద్దన్నయ్య పెత్తనం చేస్తుంటుంది.
రెవెన్యూ వర్సెస్ పంచాయతీరాజ్
వీఆర్వోలకు డీడీఓ పవర్
సచివాలయాల పర్యవేక్షణ తహశీల్దార్, ఆర్డీవోలదే..
పంచాయతీ సెక్రటరీల పవర్ కట్..
ఇక ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవో, జడ్పీ సీఈవో ఉత్సవ విగ్రహాలేనా?
కొత్తగా వచ్చిన డీడీవో వ్యవస్థ కూడా రద్దేనా..
ఉన్నత విద్యావంతులైన సచివాలయ సెక్రటరీలపై ఇంటర్ క్వాలిఫైడ్‌తో వచ్చిన వీఆర్వోల పెత్తనమా?
సచివాలయాలపై సర్పంచ్‌కూ పెత్తనం లేనట్టే..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): జిల్లా అధికారుల్లో ఆధిపత్య పోరు మొదలైంది. సాధారణంగా రెవెన్యూశాఖ ఇతర అధికార శాఖలపై పెద్దన్నయ్య పెత్తనం చేస్తుంటుంది. ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యత రెవెన్యూకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడంతో జిల్లాలో రెవెన్యూ వర్సెస్ పంచాయతీరాజ్‌గా మారింది. సచివాలయ వ్యవస్థ ఏర్పడిప్పుడే గ్రామ పంచాయతీలు ఏమైపోతాయోననే అనుమానం వ్యక్తమైంది. కొన్ని గ్రామ పంచాయతీలనే సచివాలయాలుగా మార్చేశారు. ఇవాళ చాలాచోట్ల కొత్తవి కడుతున్నారు. కానీ అప్పట్లో సచివాలయం మీద పెత్తనమంతా గ్రామ పంచాయతీ సెక్రటరీదే. జీతాలు ఇచ్చే అధికారిగా (డీడీవో)గా సెక్రటరీ ఉండేవారు. సచివాలయ కార్యదర్శులకు సెలవులు ఇచ్చే అధికారం కూడా సెక్రటరీకే ఉండేది. సెక్రటరీ పైఅధికారిగా సచివాలయానికి సంబంధించి ఎంపీడీవో ఉండేవారు. జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో ఉండేవారు. తర్వాత జేసీ-2కు సచివాలయ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవస్థలో కొత్త మార్పుల కోసం ఎంపీడీవోకి పైన డివిజన్ స్థాయిలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీవో) పోస్టును సృష్టించారు. అదింకా పూర్తిగా అమలులోకి రాకుండానే అది రద్దయిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరిదే పెత్తనంగా ఉండేది. ఇవాళ సచివాలయ డీడీవో బాధ్యతలు వీఆర్వోకు అప్పగించడంతో అంతర్గతంగా ఆధిపత్యపోరు కోసం వివాదం మొదలైంది. పంచాయతీ సెక్రటరీకి కేవలం తన జీతంతోపాటు, సచివాలయం అడ్మిన్లుగా ఉన్న గ్రేడ్ -5 సెక్రటరీల జీతం, పంచాయతీ సిబ్బంది జీతం ఇచ్చే అధికారమే ఉంటుంది. ఇంతవరకూ సచివాలయాలకు హెడ్‌గా ఎడ్మిన్ ఉండేవారు. ఇక ఆ అధికారి పంచాయతీ సెక్రటరీ పరిధిలో ఉండేవారు. ఇప్పుడు సచివాలయానికి వీఆర్‌వో హెడ్ అవుతారు. సచివాలయ కార్యదర్శుల సెలవులు వీఆర్వో ద్వారా మండల స్థాయి అధికారి మంజూరు చేయాల్సి ఉంది. అంటే తహశీల్దార్ కానీ, ఆ ఆఫీసుకు చెందిన మరో అధికారికి కానీ ఈ బాధ్యతలు అప్పగించవచ్చు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిస్థితిలో మార్పు ప్రస్తావన లేదు. బహుశా కమిషనరే డీడీవోగా ఉండవచ్చు.
వీఆర్వోల పెత్తనంపై సచివాలయ సెక్రటరీల్లో చర్చ
సచివాలయ కార్యదర్శులంతా ఉన్నత విద్యావంతులు. వీరి కనీస విద్యార్హత డిగ్రీ. పీజీలు, ఇంజనీరింగ్‌లు, ఎంబిఏలు చదివిన వారు కూడా ఉన్నారు. కానీ వీఆర్వో ఉద్యోగ నియామకాల్లో విద్యార్హత ఇంటర్మీడియట్. అందులో కూడా డిగ్రీ వంటి ఉన్నత చదవులు చదివిన వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువమంది పంచాయతీల్లో టెన్త్‌లోపు విద్యార్హతతో వీఆర్‌ఏగా పనిచేసి ప్రమోషన్ పొంది వీఆర్వోలు అయినవారే. వారిని ఇప్పుడు సచివాలయాల మీద పెత్తందారీగా పెట్టడంతో కార్యదర్శులు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏజెన్సీలో ఈ విషయంలో నిరసన చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. ఇంతవరకూ వీఆర్వోలను సచివాలయం పరిధిలోనే ఉంచారు. కానీ జీతం రెవెన్యూ శాఖ ఇచ్చేది.
మరో సర్వేతో అభిప్రాయాల సేకరణ
ఇటీవల ఈ వివాదం పరిష్కరించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల్లో అధికారికంగా ఒక సర్వే చేశారు. సచివాలయ డీడీవోగా ఎవరుంటే బావుంటుందనేది ఈ సర్వే. ఇందులో ప్రస్తుతం అన్ని పథకాల మీద పట్టు ఉండి, కంప్యూటర్ నాలెడ్జి ఉన్న డిజిటల్ అసిస్టెంట్‌కు ఇస్తే బావుంటుందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైనట్టు సమాచారం. కొందరు పంచాయతీ సెక్రటరీలకే పవర్ ఇవ్వమని సూచించినట్టు, వీఆర్వోలైనా బానే ఉంటుందని మరికొందరు అభిప్రాయపడినట్టు సమాచారం.
వారు ఉత్సవ విగ్రహాలేనా..
ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పాలన సెక్రటరీ, ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో స్థాయిల్లో ఉంటుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాలు, ఇతర పౌర సేవలన్నీ సచివాలయానికి దఖలైపోయాయి. అభివృద్ధి పనులు మాత్రమే ఉంటాయి. దీనిపై గ్రామ స్థాయిలో సర్పంచ్ పాలకవర్గం అజమాయిషీ కూడా ఉంటుంది. ఇక వీరి బాధ్యతలు, అధికారాలు అంతంత మాత్రమే. సర్పంచ్‌కు కూడా సచివాలయం మీద పెత్తనం ఉండే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈఓపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో ఆఫీసుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెమ్మదిగా ఈ పోస్టులు ఉత్సవ విగ్రహాలుగా మారే అవకాశం ఉన్నట్టు అధికారులే అనుమానిస్తున్నారు. ఇక మండల స్థాయిలో ఎంపీడీవో, జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవోలు కూడా గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా పనులు చేస్తుంటారు. ఇంతవరకూ పంచాయతీ సెక్రటరీకి జీతం ఇచ్చే అధికారం ఎంపీడీవోకి ఉండేది. త్వరలో ఈ అధికారం సెక్రటరీకే ఇచ్చి, అతనిని పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అప్పుడు ఎంపీడీవోకి కూడా పెద్దగా పని ఉండదు. పైన జడ్పీ సీఈవో కూడా ఖాళీ అయిపోతారు.
సర్పంచ్‌లూ నామమాత్రమే
సర్పంచుల అధికారం కూడా నామమాత్రం అవుతుందనే ప్రచారం ఉంది. సంక్షేమ, పౌర సేవలకు కేంద్రంగా మారిన సచివాలయం మీద వారికి పెత్తనం లేదు. అది రెవెన్యూ పరిధిలో ఉండడంతో రిక్వెస్ట్ చేయగలరేకానీ పర్యవేక్షణ చేయలేరు. పైగా ప్రజలు నేరుగా వచ్చి దరఖాస్తు పెట్టుకుంటే సచివాలయం నుంచి ఏ పథకమైనా అమలవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా సర్పంచులను పట్టించుకునే అవ కాశం ఉండదు. ఏప్రిల్ 3న పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతల స్వీకరించనున్నాయి. గెలిచిన సర్పంచ్‌లు ఇప్పటికే సచివాలయాలపై పెత్తనం మొదలుపెట్టారు. వీఆర్వోకు అధికారం ఇవ్వడంతో నీరసపడ్డారు.