నీట మునిగిన వరిచేలు

ABN , First Publish Date - 2021-11-03T05:00:44+05:30 IST

ఆరు గాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు కుదేలయ్యారు.

నీట మునిగిన వరిచేలు
బిక్కవోలులో నీట మునిగిన వరి పొలం

  • పలుచోట్ల అకాల వర్షాలు.. కోత దశకు చేరుకున్న వరి
  • మరో రెండురోజులపాటు వర్షాలు.. రైతుల్లో ఆందోళన

 బిక్కవోలు, నవంబరు 2: ఆరు గాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు కుదేలయ్యారు. మండలంలో 15వేల 571 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరి పంట నీట మునిగింది. ఇంకా రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభిద్దామనుకున్న తరుణలో ఇలా వర్షాలు కురవడంతో రైతులు కుదేలయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఈసందర్భంగా కోరుతున్నారు.

తడిసిన ధాన్యం

రంగంపేట, నవంబరు 2: పండిన ధాన్యాన్ని ఆరబెడితేకాని మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనతో ధాన్యాన్ని ఆర బోయగా వరణుడు తీవ్ర ప్రభావం చూపడంతో పూర్తిగా ధాన్యం తడిచిపోయింది. వడిశలేరు- రంగంపేట గ్రామాల మధ్య ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించిన రోడ్డులో వడిశలేరు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. దాదాపు 39.2 మీమీ వర్షం కురవడంతో  రైతులు ధాన్యంలో ఉన్న నీటిని తీసి తిరిగి ఆరబెట్టారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం రాకపోవడంతో ధాన్యంపై ప్లాస్టిక్‌ బరకాలను కప్పి ఉంచారు. అకాలవర్షానికి ధాన్యం తడిచి పోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-03T05:00:44+05:30 IST