ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.10.30 లక్షల దోపిడీ

ABN , First Publish Date - 2021-12-25T05:54:10+05:30 IST

ఉద్యోగ వేటలో ఉన్న ఓ మహిళ తన ఫోన్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్‌ చేసి డబ్బు పోగొట్టుకుంది. ఆన్‌లైన్‌లో ఉద్యోగం పేరుతో లింక్‌ పంపిన మోసగాళ్లు ఆమెకు బెట్టింగ్‌ ఎరవేశారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.10.30 లక్షల దోపిడీ

బొమ్మూరు పోలీసులను ఆశయ్రించిన మహిళ
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 24: ఉద్యోగ వేటలో ఉన్న ఓ మహిళ తన ఫోన్‌కు వచ్చిన ఒక లింక్‌ను క్లిక్‌ చేసి డబ్బు పోగొట్టుకుంది. ఆన్‌లైన్‌లో ఉద్యోగం పేరుతో లింక్‌ పంపిన మోసగాళ్లు ఆమెకు బెట్టింగ్‌ ఎరవేశారు. ఆ మాయలో పడిన మహిళ తెలిసి రూ.1.50 లక్షలు, తెలియకుండా మరో రూ.8.80 లక్షలు నష్టపోయింది. ఈ సంఘటన రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌ సిటీ ఎ-బ్లాక్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాటిలైట్‌సిటీ ఎ-బ్లాక్‌కు చెందిన డి.అనుప్రియాంక టైలరింగ్‌ చేస్తుంటుంది. ఆమె తమ్ముడు జేసీబీ కొనుగోలు చేసేందుకు నగదు సమకూర్చుకుని తన అక్క ప్రియాంక బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.10.30 లక్షలు వేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 6న ప్రియాంక సెల్‌ఫోన్‌కు ఉద్యోగం కావాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండని ఓ సందేశం వచ్చింది. దానిని ఆమె క్లిక్‌ చేసింది. అటుపై ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాక ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పెట్టుబడి పెడితే లక్షల్లో నగదు మీ సొంతం అవుతుందని అక్కడ ఒక యాప్‌లో సందేశం కనిపించింది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసిన ప్రియాంక తన బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేసింది. ప్రియాంక తొలుత రూ. 1000 పెట్టుబడి పెట్టగా వెంటనే తిరిగి రూ.1300 ఆమె ఖాతాలో జమకావడంతో ఆశపడిన ప్రియాంక తన ఖాతాలో ఉన్న తమ్ముడు నగదులోంచి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టింది. అయితే తిరిగి రూ.50 వేలు మాత్రమే జమ కావడంతో డబ్బులు పోతున్నాయని గ్రహించి ఆ బెట్టింగ్‌ను నిలుపుదల చేసింది. అయితే అప్పటికే ఆమె డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ వల్ల ఆమె బ్యాంక్‌ డిటైల్స్‌ మొత్తం ఆన్‌లైన్‌ మోసగాళ్లు హ్యాక్‌ చేసి నాలుగు రోజుల్లో ఆమె ఖాతాలో ఉన్న మిగిలిన నగదు రూ.8.80 లక్షలు కాజేశారు. ఇది తెలియని ప్రియాంక ఇటీవల బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు చూసుకుంటే ఖాతాలో నగదు లేదు. దీంతో కంగుతిని శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ లక్ష్మణ్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-12-25T05:54:10+05:30 IST