‘వడ్డీ’ంపు

ABN , First Publish Date - 2021-10-25T05:56:47+05:30 IST

జిల్లా గృహ సంస్థ వద్ద రుణాలు తీసుకున్న లబ్ధిదారుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 1983 నుంచి 2013 వరకు గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్ల కోసం రుణం పొందిన వారి పేర్లతో పాటు వారు తనఖా పెట్టిన పట్టాలను కూడా వెలికితీశారు.

‘వడ్డీ’ంపు

  • 1983 నుంచి 2013 వరకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకున్న లబ్ధిదారులకు వడ్డీ చెల్లించాలని నోటీసులు
  • ఓటీఎస్‌ పేరిట వసూలుకు రంగం సిద్ధం
  • జిల్లాలో జోరుగా సాగుతున్న ఇళ్ల సర్వే

ప్రభుత్వం నిధుల వేటలో నిమగ్నమైంది. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఓటీఎస్‌ పేరిట పన్ను వడ్డించి ఖజానా నింపుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎడాపెడా పన్నులు వేస్తూ సామాన్యుల నడ్డివిరుస్తోంది. తాజాగా ప్రభుత్వం నుంచి గృహ రుణం తీసుకున్న లబ్ధిదారుల నుంచి రుణాన్ని వడ్డీతో వసూలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులు జాబితాలను సిద్ధం చేసింది. ప్రస్తుతం జిల్లా గృహ నిర్మాణ శాఖ ఓటీఎస్‌ (ఏకకాల చెల్లింపు పథకం)పై దృష్టి కేంద్రీకరించింది.  దీనిపై ఆ శాఖ అధికారులు సిబ్బంది సహకారంతో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ఆదాయం లేక ఇబ్బందిపడుతున్న సమయంలో ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరిట తాము గతంలో నిర్మించుకున్న ఇంటి పట్టా కోసం ఇబ్బంది పెట్టడం సరికాదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్న చాలా మంది వద్ద పట్టాలు లేవు. పట్టా స్థలాలు కొనగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారికి మాత్రం కొంతమేర ఊరటే.

(మండపేట)

జిల్లా గృహ సంస్థ వద్ద రుణాలు తీసుకున్న లబ్ధిదారుల జాబితాలను అధికారులు సిద్ధం చేశారు.  జిల్లావ్యాప్తంగా 1983 నుంచి 2013 వరకు గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్ల కోసం రుణం పొందిన వారి పేర్లతో పాటు వారు తనఖా పెట్టిన పట్టాలను కూడా వెలికితీశారు. లబ్ధిదారుని పేరు, సర్వే నెంబరు, ఏ పథకం ద్వారా లబ్ధి పొందారు, ఎన్ని సెంట్ల స్థలం తదితర అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఈ 30 ఏళ్లలో వివిధ పథకాల్లో లబ్ధి పొందిన 4,45,980 మందిని గుర్తించారు. వారిలో 3,54,039 మంది రుణం చెల్లించాలని తేల్చారు. వారిలో ఇప్పటివరకు 3,00517 మందిని ఆన్‌లైన్‌ చేశారు. వారందరికీ ఓటీఎస్‌ వర్తింపజేస్తారు. 1983లో ఇంటిని నిర్మించుకున్న వారికి రూ.6వేలు ఇచ్చేవారు. అందులో రూ.3వేలు రాయితీ పోను మిగిలిన రూ.3వేలు రుణం. తాజా లెక్కలను పరిశీలిస్తే యూనిట్‌ విలువకంటే వడ్డీయే ఎక్కువ. వారంతా కేటగిరీలను బట్టి నగదు చెల్లించాల్సి ఉంటుంది. మూడు రెట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అయితే ఓటీఎస్‌ చెల్లించినవారికే ఇళ్లు సొంతమవుతాయని వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి మాత్రం ఇంటి రుణం తీసుకున్న లబ్ధిదారులు ఇక చెల్లించనవసరం లేదని చెప్పడంతో వారు కాస్తంత ఊరట చెందుతున్నారు. 

కేటగిరీ-ఎ: గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఉంటే ప్రస్తుతం వారి వారసుల పేరు మీద ఇంటి పట్టా ఇస్తారు. గ్రామాల్లో రూ.10వేలు, మునిసిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు వంతున చెల్లించాల్సి ఉంటుంది.

కేటగిరీ-బి: రుణం తీసుకుని ప్రస్తుతం ఆ ఇంట్లో ఇతరులు ఉంటే గ్రామాల్లో రూ.20వేలు, మునిసిపాలిటీల్లో రూ.30వేలు, నగరపాలక సంస్థల్లో రూ.40వేలు చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి.

కేటగిరీ-సి: రుణం తీసుకోకుండా ఉండి వారి వారుసుల పేరుమీద పట్టా మార్చాల్సి వస్తే రూ.10వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

గృహ నిర్మాణ సంస్థ నుంచి గ్రామాలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ఆయా సచివాలయాలు, పంచాయతీలకు పంపించారు. సచివాలయాల్లో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల జాబితాను ప్రాథమికంగా సర్వే చేస్తారు. ఆ తర్వాత డిజిటల్‌ ఆసిస్టెంట్లు ఆన్‌లైన్‌లో నమెదు చేస్తారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తారు. తర్వాత లబ్ధిదారులు ఏఏ కేటగిరీల్లో ఉన్నారో తెలుస్తుంది. దాని ద్వారా లబ్ధిదారుడు నగదును చెల్లించాలి. అనంతరం పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయాలకు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం కల్పించనున్నారు.

తక్షణం సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశాం

విశ్వేశ్వర ప్రసాద్‌, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకుడు

1983 నుంచి 2013 వరకు జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం వనటైం సెటిల్‌మెంట్‌ అవకాశం కల్పించింది. అప్పటి నుంచీ ఉన్న లబ్ధిదారుల  జాబితాలను సచివాలయాలకు పంపించాం. క్షేత్రస్థాయిలో సర్వేను తక్షణం పూర్తి చెయ్యాలని ఆదేశాలిచ్చాము. తర్వాత రిజిసే్ట్రషన ప్రక్రియ పూర్తి చేస్తాం.

Updated Date - 2021-10-25T05:56:47+05:30 IST