ఒక్క చాన్స్‌ ప్లీజ్‌..!

ABN , First Publish Date - 2021-08-20T07:17:36+05:30 IST

తమ ప్రభుత్వం..

ఒక్క చాన్స్‌ ప్లీజ్‌..!

జిల్లా మంత్రులకు ముంచుకొస్తున్న రెండున్నరేళ్ల ఫార్ములా ముప్పు

ముగ్గురికీ ఉద్వాసన పలికి కొత్త వాళ్లతో మంత్రివర్గం భర్తీ చేస్తారని ప్రచారం

ఈ నేపథ్యంలో అమాత్య పదవి కోసం ఆశావహ ఎమ్మెల్యేలు జోరుగా ప్రయత్నాలు

ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ సీఎం జగన్‌ను కలిసేందుకు ఎవరికివారే తెరవెనుక మంత్రాంగం

కన్నబాబు స్థానంలో పదవి కోసం పెండెం దొరబాబు, దాడిశెట్టి, జక్కంపూడి రాజా పోటీ

విశ్వరూప్‌ను తప్పిస్తే ఎస్సీ సామాజికవర్గం తరపున విశాఖ నుంచి గొల్ల బాబురావుకు చాన్స్‌

అత్యధిక సామాజికవర్గం ఉన్న కోనసీమ నుంచి ప్రాతినిధ్యం తప్పించరనే వాదన కూడా

మధ్యలో మంత్రి పదవి దక్కించుకున్న వేణుకి కొలువు కొనసాగింపుపై రకరకాల ప్రచారం

ఒకవేళ తప్పిస్తే బీసీ కోటాలో మత్స్యకారులకు పదవి కేటాయించే చాన్స్‌

ఇటు సామాజికవర్గాల సర్దుబాటులో జిల్లాకు రెండు పదవులతో సరిపెడతారని విశ్లేషణలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీలో అమాత్య పదవి కోసం ఆశావహుల రాజకీయాలు ఊపందుకున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడున్న మంత్రులను తీసేసి కొత్తవారికి అవకాశం ఇస్తామని అధినేత చెప్పిన గడువు ఎట్టకేలకు సమీపించడంతో ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ సీఎం జగన్‌ను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే ఇప్పటికే కలిసి కర్చీఫ్‌ కూడా వేసేశారు. అత్యధికంగా కన్నబాబు స్థానంలో పదవి కోసం పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా తీవ్రంగా పోటీ పడుతున్నారు. విశ్వరూప్‌ స్థానంలో పోటీకి ఒకరిద్దరు ప్రయత్నిస్తున్నా పక్కనున్న విశాఖ నుంచి గొల్ల బాబురావుకు కొలువు ఖాయం అని ప్రచారం జరుగుతోంది. మధ్యలో మంత్రి అయిన వేణును తప్పిస్తే ఆ సామాజిక వర్గం బదులు మత్స్యకారులతో భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే తనకు అవకాశం ఉంటుందని పొన్నాడ భావిస్తున్నారు. అయితే అనుకున్నట్టు ముగ్గురినీ తప్పిస్తారా? లేదా? తప్పిస్తే తిరిగి జిల్లాకు మూడు మంత్రి పదవులు కాకుండా రెండింటికే పరిమితం చేస్తారా? అనేదానిపైనా చర్చ జరుగుతోంది. 


తమ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న వెంటనే మంత్రుల్లో తొంభైశాతం మందిని తప్పించి కొత్త వాళ్లకు అవకాశం ఇస్తానని అధికారం చేపట్టిన కొత్తలో సీఎం జగన్‌ ప్రకటించారు. ఆ సమయం ఇప్పుడు దగ్గరపడడంతో వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. కొత్తగా మంత్రి అవ్వాలనే కలతో అనేకమంది ఎమ్మెల్యేలు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క చాన్స్‌ ఇవ్వండి అంటూ అధినేతను కలిసేందుకు పావులు కదుపుతున్నారు. మరోపక్కేమో మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇన్నాళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తూ అధినేత వద్ద మంచి మార్కులు వేయించుకున్నందున తమను తప్పించకపోవచ్చని ప్రస్తుత మంత్రులు ఎవరికివారే ధైర్యం చెప్పుకుంటున్నారు. ఒకవేళ చెప్పినట్టే కొలువు తీసేస్తే ఇన్నాళ్లు మంత్రిగా పనిచేసే ఆ తర్వాత ఏం చేయాలి? అనే నిరాశావాదంతోనూ కలవరపడుతున్నారు. వీరి భయం ఒకపక్క అయితే.. మరోపక్క జిల్లాలో ముగ్గురు మంత్రులను తీసేసి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారని పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో కన్నబాబును స్థానంలో పదవి కోసం పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా పోటీ పడుతున్నారు. తమ సీనియార్టీ, కుటుంబ నేపథ్యం చూసి కొలువు కట్టబెట్టాలని కోరుకుంటున్నారు. ఈ విషయం అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యే అప్పుడే జగన్‌ను కలిసి కర్చీఫ్‌ వేశారు. మరో ఎమ్మెల్యే తనకున్న విప్‌ పదవి తీసేసి మంత్రి పదవి ఇవ్వాలని అధినేతను కోరుతున్నారు. ఇందుకోసం కాకినాడ కీలక నేత ద్వారా రాయబారాలు నడుపుతున్నారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పించినందున బదులుగా తమ కుటుంబ నేపథ్యం చూసి అమాత్య పదవి కట్టబెడతారని భావిస్తూ రాజా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఎవరి స్థాయిలో వాళ్లు గాడ్‌ఫాదర్‌లు, సలహాదారుల ద్వారా ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఇటీవల ఎమ్మెల్సీ దక్కించుకున్న తోట త్రిమూర్తులు కూడా కుదిరితే చాన్స్‌ ఇవ్వాలంటూ అధిష్ఠానం వద్ద ఓ రాయి వేసి ఉంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


కోనసీమ నుంచి మంత్రి విశ్వరూప్‌ను తప్పిస్తే ఆ స్థానంలో జిల్లా నుంచి ఎవరికీ పదవి ఇవ్వకుండా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావును కుర్చీ ఎక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే అత్యధిక ఎస్సీ సామాజికవర్గం ఉన్న కోనసీమ నుంచి విశ్వరూప్‌ను తప్పించకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ తప్పిస్తే తనకు అవకాశం పరిశీలించాలని ఇటీవల ఎమ్మెల్సీ దక్కించుకున్న పండుల రవీంద్రబాబు అధిష్ఠానం చెవిన వేసినట్టు సమాచారం. ఇదిలాఉంటే మధ్యలో మంత్రి అయిన వేణుకు రెండున్నరేళ్ల నిబంధన వర్తించకపోవచ్చని ఆయన అనుచరులు లెక్కలేస్తున్నారు. కానీ ఆయన్ను కూడా పక్కనపెడతారని వైసీపీ కీలక నేతల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పిస్తే ఆ స్థానం నుంచి కృష్ణా జిల్లా నుంచి మరొకరికి ఛాన్స్‌ ఇవ్వవచ్చని చెబుతున్నారు. దీంతో బీసీ కోటాలో శెట్టిబలిజ వర్గం కాకుండా మత్స్యకార వర్గంతో భర్తీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే తనకు అమాత్య అవకాశం దొరుకుతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఆశపడుతున్నారు.


అయితే ముగ్గురు మంత్రులను తొలగించి మరో ముగ్గురికి అవకాశం ఇస్తారా? లేదంటే ముగ్గురి స్థానంలో రెండు అమాత్య పదవులనే జిల్లాకు సరిపెడతారా? అలా చేస్తే ఎస్సీ, శెట్టిబలిజ సామాజికవర్గాల్లో ఏదొక వర్గానికి జిల్లా నుంచి కోటా కోసేసి ఇతర జిల్లా నుంచి భర్తీ చేస్తారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే తమ అత్యుత్తమ పనితీరు, అధినేతకు బాగా దగ్గరగా మెలుగుతున్నందున తమ వరకు మంత్రి పదవి తీసేయకుండా కొనసాగిస్తారని ముగ్గురు మంత్రులు ఎవ రికివారే లోలోపల సర్దిచెప్పుకుంటూ కొన్ని రోజులుగా అనుచరులకు ధైర్యం చెబుతుండడం విశేషం. కేడర్‌లో మాత్రం ఎవరు ఉంటారో, ఎవరు ఊడతారో అనే కోణంలో చర్చ సాగుతోంది.

Updated Date - 2021-08-20T07:17:36+05:30 IST