కొత్త కలెక్టర్ హరికిరణ్
ABN , First Publish Date - 2021-07-24T06:52:36+05:30 IST
జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన్ను అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీగా ప్రభుత్వం నియమించింది.

- ప్రస్తుత కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అమరావతికి బదిలీ
- ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు
- కడప కలెక్టర్‌గా ఉన్న హరికిరణ్ జిల్లాకు నియామకం
- చిత్తూరు జేసీగా కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్
- బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తికావడంతో కలెక్టర్ బదిలీ
- ఈ రెండేళ్లలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న మురళీధర్‌రెడ్డి
- కాకినాడ కీలక నేత ఆర్థికంగా ఎదగడానికి ఇతోధిక సహకారం
- పేదల ఇళ్ల స్థలాల భూసేకరణలోనూ అనేక ఆరోపణలు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన్ను అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఈయన స్థానంలో కడప కలెక్టర్‌గా పనిచేస్తున్న చేవూరి హరికిరణ్‌ను కొత్త కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. కలెక్టర్‌గా మురళీధర్‌రెడ్డి జిల్లాలో బాధ్యతలు చేపట్టి రెండేళ్లుపైనే అవుతోంది. ఈకాలంలో ఈయన అడుగడుగునా పలు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. కలెక్టర్‌గాకంటే ఓ వైసీపీ నేతగా వ్యవహరించారనే ఆరోపణలూ వినిపించాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఈయన తీరుపై ఆది నుంచీ గుర్రుగా ఉన్నారు. కాకినాడకు చెందిన మంత్రి కన్నబాబుతోనూ ఈయనకు సత్సంబంధాలు లేవు. కలెక్టర్‌గా వివాదాలకు తావులేకుండా సమదృష్టితో పాలన సాగించకుండా తన సామాజికవర్గ నేతలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు అధికార పార్టీ నుంచి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడకు చెందిన ఓ కీలక నేతతో అతిచనువుగా వ్యవహరించడంతోపాటు సదరు నేత ఆర్థిక ఎదుగుదలకు సహాయ సహకారాలు అందించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పేదల ఇళ్ల స్థలాల చదును విషయంలో సదరు నేతకు అన్ని రకాల మట్టి, గ్రావెల్ అనుమతులు అడ్డ గోలుగా ఇచ్చి అండదండలు అందించారని విమర్శలు ఉన్నాయి. అలాగే కాకినాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాలకు ఏకంగా మడ అడవులను నరికి వేసి చదును చేయించిన విషయంలో తీవ్ర విమర్శల పాలయ్యారు. చివరకు ఈ వ్యవహారం జాతీయ హరిత ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. దీంతో కలెక్టర్ సంజాయిషీ ఇచ్చుకునే వరకు వెళ్లింది. అలాగే రాజమహేంద్రవరంలో ఆవ భూముల విషయంలోనూ కలెక్టర్ పాత్రపై వివాదాలు చుట్టుముట్టాయి. కారుచౌక భూములకు రూ.45 లక్షల వరకు కొన్ని కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. దీనివెనుక కొందరు సర్కారు పెద్దల పాత్ర కూడా ఉందనేది బయటకు వచ్చింది. ఈ వ్యవహారం కూడా హైకోర్టు వరకు వెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అలాగే అనేక నియోకవర్గాల్లో పేదల ఇళ్ల స్థలాలు అనువైనవి కాకుండా అధికార పార్టీ నేతలు చూపించిన వాటినే సేక రించారనే విమర్శలున్నాయి. అటు తాజాగా విశాఖ లేటరైట్‌ను రౌతులపూడి మీదుగా సర్కారు పెద్దలు తరలించడానికి రిజర్వుఫారెస్టు మీదుగా నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్డు వేశారు. దీనికీ అనుమతులు ఇవ్వడంలో కలెక్టర్ కీలకంగా వ్యవ హరించారు. అలాగే జిల్లాలో తొలి, రెండో విడత కొవిడ్ కేసులు దేశవ్యాప్తంగా జిల్లాలో అత్యధింగా నమోదయ్యాయి. రాష్ట్రస్థాయిలోను నిత్యం అత్యధిక కేసులతో జిల్లా తొలిస్థానంలో నిలిచింది. దీనికి కారణం కలెక్టర్ వైఫల్యమేనని ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రెండో విడత కొవిడ్‌లో వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. వీరికి పడకలు ముందుగానే అందుబాటులోకి తేవడంలో ముందు చూపుతో వ్యవహరించలేకపోయారు. నియోజకవర్గాల్లో సమస్యల పట్ల ప్రతిపక్షాల నుంచి వచ్చే వినతులు, అభ్యంతరాలు కనీసం పట్టించుకోకపోవడం, కొందరు నేతల ఫోన్లను తీయకుండా రెండేళ్లపాటు వారితో వివాదాలు కొనసాగించారు. ఇటీవల జ్యోతుల నెహ్రూ ఏకంగా కలెక్టర్ తన నెంబర్ బ్లాక్‌లో పెట్టారని ఆరోపించారు.
కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ జేసీగా బదిలీ
కాగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం తిరగకుండానే బదిలీ అయింది. ఈయన స్థానంలో ఇంకా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. కాగా కొత్త కలెక్టర్ చేవూరి హరికిరణ్ 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం ఆయన కడప కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఈయన విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కర్నూలు జేసీగా, తుడా వైస్ చైౖర్మన్‌గా పనిచేశారు. 1982 ఏప్రిల్ 29న జన్మించిన ఈయన 2006లో ముంబై ఐఐటీలో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 2009లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో 18వ ర్యాంకు సాధించారు. 2010-11లో కృష్ణా జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా, 2011-12లో భద్రాచలం, 2012-13లో మదనపల్లిలలో సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరికిరణ్ విశాఖ జిల్లా గాజువాకలో స్థిరపడ్డారు.