కాసులిస్తేనే వారసత్వం

ABN , First Publish Date - 2021-07-24T06:56:09+05:30 IST

జిల్లాలో వారసత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో అడ్డగోలు వసూళ్లు ఆకాశాన్నంటుతున్నాయి.వీటి జారీ పేరుతో పలు తహశీల్దార్‌ కార్యాలయాల్లో బొక్కుడుకు అంతులేకుండా పోతోంది. లక్షల్లో కాసులు ముట్టజెబితే ఇట్టే వీటిని జారీచేసేస్తున్నారు. కాదంటే కొర్రీలతో కాళ్లరిగేలా తిప్పిస్తున్నారు.

కాసులిస్తేనే వారసత్వం

  • వారసత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో అధికారుల కాసుల కక్కుర్తి
  • జిల్లాలో పలు తహశీల్దార్‌ కార్యాలయాల్లో లక్షల్లో అమ్యామ్యాల వసూళ్లు
  • కాకినాడలో అయితే రూ.2 లక్షల వరకు ముట్టజెబితేనే పని పూర్తి.. లేదంటే కొర్రీలు
  • సెకండ్‌వేవ్‌ కొవిడ్‌ మృతుల కుటుంబాల నుంచి జిల్లావ్యాప్తంగా వందల్లో అర్జీలు
  • ఇదే అదనుగా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు పిండేస్తున్న రాబందులు
  • ఎఫ్‌ఎంసీ ఉంటేనే మృతుడి తాలుకూ బ్యాంకు డబ్బు, బీమా, ఆస్తులూ సంక్రమణ
  • అడిగినంత ఇస్తే విచారణ లేకుండానే కొన్ని తహశీల్దార్‌ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ 
  • వెనుకాముందు చూడకుండా ఇస్తున్న కొన్ని ఎఫ్‌ఎంసీలు ఏకంగా వివాదాస్పదం

జిల్లాలో వారసత్వ ధ్రువీకరణ పత్రాల జారీలో   అడ్డగోలు వసూళ్లు ఆకాశాన్నంటుతున్నాయి.వీటి జారీ పేరుతో పలు తహశీల్దార్‌ కార్యాలయాల్లో బొక్కుడుకు అంతులేకుండా పోతోంది. లక్షల్లో కాసులు ముట్టజెబితే ఇట్టే వీటిని జారీచేసేస్తున్నారు. కాదంటే కొర్రీలతో కాళ్లరిగేలా తిప్పిస్తున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఏకంగా ఓ రేటు కట్టి పిండేస్తున్నారు. అడిగినంత ఇస్తే వారసులు కాకున్నా ధ్రువీకరణ పత్రం చేతిలో పెట్టేస్తున్నారు. చివరికి ఇవి వివాదాస్పదం అవుతుండడంతో గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తీసుకుంటున్నారు. సెకెండ్‌ వేవ్‌లో జిల్లాలో వేలాది మంది కొవిడ్‌తో కన్నుమూశారు. వీరికి సంబంధించిన ఆస్తులకు తామే వారసులమని నిరూపించుకునేందుకు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసీ)కు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇవి వేలల్లో వస్తున్నాయి. తీరా వీటి జారీ వెనుక  మామూళ్లు భారీగా చేతులు మారుతున్నాయి. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాను కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ కుదిపేసింది. గడచిన ఏప్రిల్‌ నెలాఖరు నుంచి ఇప్పటివరకు 1.49 లక్షల పాజిటివ్‌లు నమోదవగా, వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరు చనిపోతే, మరికొన్ని కుటుంబాలు ఇంటి పెద్దదిక్కు కోల్పోయాయి. కొన్ని కుటుంబాల్లో అన్న, తమ్ముడు మృత్యువాత పడ్డారు. అయితే చనిపోయిన వ్యక్తులకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మొదలు బీమా వరకు, ఉద్యోగస్తులైతే ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందాలంటే కచ్చితంగా సం బంధిత కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసీ) అందించాలి. మృతుడి పేరుపై ఉన్న ఆస్తు లు అమ్మాలన్నా, తమపేరుపై రాయించుకోవాలన్నా ఎఫ్‌ ఎంసీ తప్పనిసరి. దీంతో జిల్లాలో వేలాది కుటుంబాలు ఇప్పుడు వారసత్వ ధ్రువీకరణ పత్రం కోసం సంబంధిత మండలాల్లోని తహశీల్దార్‌ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించి కుటుంబ సభ్యులందరి నుంచి లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌లు సేకరించి విచారణ చేపట్టిన తర్వాత వీటిని తహశీల్దార్‌ జారీ చేయాలి. అయితే ఇప్పుడు ఎఫ్‌ఎంసీలకు భారీగా డిమాండ్‌ నెలకొనడంతో ఇదే అదనుగా ఆయా కార్యాలయాల్లో వేల నుంచి లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ నగరంలో ఇప్పటివరకు 547 ఎఫ్‌ ఎంసీ అర్జీలు తహశీల్దార్‌ కార్యాలయానికి అందాయి. అనపర్తిలో 91, యు.కొత్తపల్లి 92, గండేపల్లి 72, ప్రత్తిపాడు 130, పెద్దాపురం 154, మండపేట 25, రాజోలు 129, కాట్రేనికోన 44, రాయవరం 91, ఏలేశ్వరం 14, తొండంగి 64, రాజమహేంద్రవరం రూరల్‌ 276, కడియం 105, గన్నవరం 57, రామచంద్రపురం 147, ఆత్రేయపురం 73, ముమ్మిడివరం 90, బిక్కవోలు 30, సామర్లకోట 85, రావులపాలెం 40, కరప 108, తుని 169 చొప్పున అర్జీలు వచ్చాయి. అయితే ఇప్పుడు వీటి జారీ పేరుతో లక్ష ల్లో చేతులు మారుతున్నాయి. బాధితుల అవసరాలను అడ్డంపెట్టుకుని కొందరు అధికారులు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు మామూళ్లు పిండుతున్నారు. ముఖ్యంగా కాకినాడ నగరంలో కొవిడ్‌ మృతుల సంఖ్య వేలల్లో ఉండడంతో వారి కుటుంబ సభ్యుల నుంచి ఎఫ్‌ఎంసీ కోసం పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని అడ్డంపెట్టుకుని లక్షలకు లక్షలు పిండేస్తున్నారు. ముఖ్యంగా మృతుడి తాలుకా స్థిరాస్తులు, బ్యాంకులో నగదుకు ఎంత అని ఆరా తీస్తూ లెక్కలు వేసి మరీ డబ్బులు గుంజుతున్నారు. ఈ సర్టిఫికెట్‌ ఉంటేనే ఆస్తులు తమ పేరున రాయించుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో బాధిత కుటుంబ సభ్యులు సైతం అధికారులు అడిగిన లక్షల మొత్తం ముట్టజెబుతున్నారు. నగరంలో పలు పెద్ద కుటుంబాల్లో వివాదాలుండడంతో ఎఫ్‌ఎంసీ కోసం డబ్బుకు వెనుకాడడం లేదు. దీన్ని అదనుగా చేసుకుని కొన్ని కేసుల్లో రూ.4 లక్షల వరకు దండేస్తున్నారు. గడచిన రెండు నెలల్లో రూ.25 లక్షల వరకు సదర కీలక అధికారి దండేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇదేకాదు నగరాలు, పట్టణాల పరిధిలోని తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఎఫ్‌ఎంసీ డిమాండ్‌ ఆధారంగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే విచార ణ చేపట్టాల్సి ఉందని, ఫలానా పత్రాలు కావాలంటూ రకరకాల కొర్రీలతో కాలక్షేపం చేస్తున్నారు. తీరా చేతిలో బరువు పడితే ఎఫ్‌ఎంసీ అందిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్ల పరిధిలో ఈ తరహా అమ్యామ్యాలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. ఇక్కడ రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ మండలాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పిండుతున్నారు. ఇందుకు తహశీల్దార్‌ కార్యాలయాల్లో కొందరు సిబ్బందే దళారుల అవ తారం ఎత్తారు. ఎఫ్‌ఎంసీ ఆలస్యమైతే అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం అవుతాయనే భయంతో చాలామంది అడిగినంత ముట్టజెబుతున్నారు. మరోపక్క కాసుల కక్కుర్తితో విచారణ చేపట్టకుండా జారీచేస్తున్న ధ్రువపత్రాలు వివాదాలకూ దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యుల పేరుతో వేరొకరు దరఖాస్తు చేసుకోవడం ఒకె త్తయితే వివాహితుల విషయంలో మృతుడైన భర్తకు సంబంధించి వారసత్వ ధ్రువీకరణ పత్రం కోసం భార్య, అటు అత్తింటి వారు దరఖాస్తు చేస్తున్నారు. ముందుగా కాసులు ముట్టజెప్పిన వారికి ఎఫ్‌ఎంసీ ఇస్తుండడంతో మరో వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాకినాడలో ఈ తరహా కేసులు అధికంగా వస్తున్నా యి. కాకినాడకు చెందని వ్యక్తులకు కూడా ఇక్కడ ఎఫ్‌ఎంసీలు డబ్బులు తీసుకుని జారీచేసేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తీరా గొడవ జరుగుతుండడంతో వీటిని రద్దుచేసే అధికారం లేక తహశీల్దార్లు కొందరు జుట్టుపీక్కుంటున్నారు. ఈ బండారం బయటకు వస్తుందేమోనని గుట్టుగా వ్యవహారం నడుపుతున్నారు. 

Updated Date - 2021-07-24T06:56:09+05:30 IST