అవమానంపై నిరసన
ABN , First Publish Date - 2021-05-20T05:32:12+05:30 IST
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు వ్యతిరేకంగా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వ్యాఖ్యలపై మండిపడ్డ వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు
ఐదు రోజులు కొనసాగించాలని నిర్ణయం
కాకినాడ, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు వ్యతిరేకంగా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఎక్కడికక్కడ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో బ్యాడ్జీలు ధరించి బుధవారం విధులు నిర్వర్తించారు. కొవిడ్ కేంద్రాలు, పీహెచ్‌సీల్లో నల్లబ్యాడ్జీలతోనే టెస్టులు, ఇతర వైద్య సేవలు అందించారు. తమను అవమానపరిచేలా కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడడంపై వీరంతా ఈ నిరసన చేపట్టారు. ఈ నెల 14న వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తూర్పు గోదావరి జిల్లా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అనేక మంది వైద్య సిబ్బంది అసలు పని చేయకుండా, కాలక్షేపం చేస్తూ జీతాలు తీసుకుంటున్నారని, వీరి పనితీరుపై ఐవీఆర్‌ఎస్ సర్వే జరిపి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని ఆ సమావేశంలో తమను హెచ్చరించారని వైద్యులు మండిపడుతున్నారు. కొవిడ్ ముప్పు ఉన్నా అనేక అసౌకర్యాల మధ్య పనిచేస్తుంటే అసలేమాత్రం పనిచేయడం లేదన్న రీతిలో తమను కించపరిచేలా మాట్లాడడంపై అదేరోజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ భాస్కర్ మాట తీరు, వ్యవహారంపై ప్రభుత్వం దృష్టికి తమ ఆవేదన తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అదే రోజు జిల్లా వైద్యాధికారుల సంఘం కీలక నాయకులు జూమ్ యాప్‌లో అంతర్గతంగా చర్చించుకున్నారు. కొవిడ్ మరణాలకు, కేసులకు తామే కారణమని కమిషనర్ మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి విపత్తులోనూ మాస్కులు, గ్లౌజులు లేకుండా కష్టపడి పనిచేస్తుంటే నిందలు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వ్యవహారాన్ని సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా వైద్యాధికారుల అసోసియేషన్ ఇటీవల తీర్మానించింది. అందులో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఈలోగా ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే తదుపరి కార్యాచరణ జేఏసీగా ఏర్పడి ఆందోళనను ఉధృతం చేయాలని ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.