రెండోస్సారి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-05-30T05:48:02+05:30 IST

మండపేట, మే 29: చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒక్కసారి మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ మండపేట మునిసిపాలిటీ ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లకు రెండుసార్లు ప్రమాణం చేసే అదృష్టం కలిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.... మండపేట

రెండోస్సారి ప్రమాణస్వీకారం
ప్రమాణ స్వీకారం చేస్తున్న టీడీపీ సభ్యులు

ఒకే కౌన్సిల్‌లో రెండుసార్లు ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ కౌన్సిలర్లు

మండపేట మునిసిపాలిటీ చరిత్రలో అరుదైన ఘట్టం

మండపేట, మే 29: చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు  ఎవరైనా ఒక్కసారి మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ  మండపేట మునిసిపాలిటీ ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లకు రెండుసార్లు ప్రమాణం చేసే అదృష్టం కలిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.... మండపేట కౌన్సిల్‌ ప్రమాణస్వీకారం మార్చి 18న జరిగింది. ఆ రోజున టీడీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. అదే నెల 29వ తేదీన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో వారితో ప్రమాణం చేయించారు. ఏప్రిల్‌ నెలలో జరిగిన సమావేశంలోనూ వారు పాల్గొన్నారు. అయితే 29న హోలీ పబ్లిక్‌ హాలిడే కావడంతో తమ సభ్యుల ప్రమాణం చెల్లదని ఎక్స్‌అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలుపుతూ వివరణ ఇవ్వాలని కమిషనరును కోరారు. ఈ అంశంపై ఆయన మునిసిపల్‌ డీఎంఈకి ఫిర్యాదు చేశారు. 1965 మునిసిపల్‌ చట్టం ప్రకారం సెలవు రోజున సమావేశం చెల్లదని, కౌన్సిలర్లు రెండోసారి ప్రమాణం చేయాలని డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ సభ్యులు ఏడుగురితో చైర్‌పర్సన్‌ పతివాడ నూకదుర్గారాణి ప్రమాణం చేయించారు. అధికారుల తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. గతంలో చేసిన ప్రమాణస్వీకారానికి చట్టబద్ధత ఉందని కమిషనరు చెప్పడం, దానికి ఎమ్మెల్యే వేగుళ్ల   వివరణ కోరడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కాగా సభ్యుల కోరిక మేరకే వారితో ప్రమాణం చేయించానని చైర్‌పర్సన్‌ చెప్పడం కొసమెరుపు.

Updated Date - 2021-05-30T05:48:02+05:30 IST