అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం.. బిల్లులు ఇప్పించండి!

ABN , First Publish Date - 2021-12-15T07:05:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ పనులు చేసే వారికి చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు కాకినాడలో మంగళవారం పాదయాత్ర చేశారు.

అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం.. బిల్లులు ఇప్పించండి!
పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ కాకినాడ ధర్నాచౌక్‌ వద్ద మంగళవారం నాడు ధర్నా నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు

బకాయిల చెల్లించాలంటూ కాకినాడలో కాంట్రాక్టర్ల పాదయాత్ర

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 14 : రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ పనులు చేసే వారికి చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు కాకినాడలో మంగళవారం పాదయాత్ర చేశారు. అనంతరం ఇంద్రపాలెం లాకుల వద్ద గల ధర్నా చౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి, కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌  అసోసియేషన్‌ (సబ్కా) రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రాజు మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులపై చర్చించేందుకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని, బిల్లులను కనీసం విడతల వారీగానైనా మంజూరు చేసి కాంట్రాక్టర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ శాంతారామ్‌, కార్యదర్శి టీవీవీ సత్యనారాయణలు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి పని కల్పిస్తూ వారితోపాటు తాము కూడా ఉపాధి పొందుతున్నామన్నారు. పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక, అటు బ్యాంకు అకౌంట్‌లు ఎన్‌పీఏగా మారి జీవించ డం దుర్భరమైందన్నారు. జిల్లాలో 200 మంది కాంట్రాక్లర్లకు రూ.1200 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడ్వయిజర్‌ శివకుమార్‌, ఏఎస్‌ భాస్కరరాజు, నల్లా సురేష్‌, కే బాలకృష్ణ, వై ప్రకాష్‌రావు, ఎన్‌  ప్రసాదరావు, ఎన్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం, వీ కాళేశ్వరరావు, ధూళిపూడి రాజేష్‌, బలిరెడ్డి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-15T07:05:26+05:30 IST