2న అర్హత పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-28T06:43:25+05:30 IST

ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌-2) పోస్టులకు నియామకానికి కాల్‌లెటరు పొందిన అభ్యర్థులకు నవంబరు 2వ తేదీన అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం పర్యవేక్షక ఇంజనీరు టీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

2న అర్హత పరీక్షలు

రాజమహేంద్రవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌-2) పోస్టులకు నియామకానికి కాల్‌లెటరు పొందిన అభ్యర్థులకు నవంబరు 2వ తేదీన అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం పర్యవేక్షక ఇంజనీరు టీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లాలాచెరువులోని జాతీయ రహదారిలో ఆప్కో చేనేత కార్యాలయం వెనుకన గల33/11 కేవీ విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌ (పోలీసు క్వార్టర్స్‌కు సమీపంలో) 2న ఉదయం 8 గంటల నుంచి అర్హత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఏపీఈపీడీసీఎల్‌  వెబ్‌సైట్‌లో డౌన్‌లోడు చేసుకున్న తమ కాల్‌లెటర్‌లో ఉదహరించిన  నియమ నిబంధనలు పూర్తిగా చదువుకుని, తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తీసుకుని అర్హత పరీక్షలకు హాజరు కావాలన్నారు. సర్టిఫికెట్లు అన్నీ సరిపోయినట్టు పరిశీలించిన తర్వాత పోల్‌ టెస్ట్‌కు పంపిస్తామన్నారు.  పరిశీలకుల సమక్షంలో, నిర్ణయించిన పోల్‌ ఎక్కి పై భాగమును ముట్టుకుని, యధావిధిగా కిందకు దిగాలని, ఇదంతా 15 నిమిషాలలో పూర్తి కావాలన్నారు. ఇక్కడ ఉత్తీర్ణులైతే మీటరు రీడింగ్‌కు హాజరుకావాలని, సింగిల్‌ఫేస్‌, డబుల్‌ ఫేస్‌ల ఐఆర్‌డీఎ మీటరులో  రీడింగ్‌ బిగ్గరగా చదివి వినిపించి నమోదు చేయాలని, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, సైకిల్‌ అర్హత పరీక్షలకు హాజరవుతారని ఆయన వివరించారు. నిర్దేశించిన దూరాన్ని కాలు కింద పెట్టకుండా  సైకిల్‌ తొక్కాలన్నారు. ఈ మూడు పరీక్షలు వరస క్రమంలో పాసైన వారిని మాత్రమే తర్వాత ఉద్యోగ అర్హతకు  పరిశీలన నోటిఫికేషన్‌ ద్వారా  నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు దళారులను ఆశ్రయించవద్దని, ఈ ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఆయన  తెలిపారు.

Updated Date - 2021-10-28T06:43:25+05:30 IST