భూమాయ

ABN , First Publish Date - 2021-10-07T05:47:03+05:30 IST

నకిలీ డాక్యుమెంట్ల ముఠా రెచ్చిపోతోంది. భూమి విలువ బాగా పెరగడంతో అక్రమార్జన పరులకు ఇది వరంగా మారింది. భూమి ఎక్కడ దొరికితే అక్కడ ఆక్రమించే ముఠాలు తయారయ్యాయి.

భూమాయ

 దివాన్‌చెరువులో 14.54  ఎకరాలకు తప్పుడు రిజిస్ట్రేషన్‌
  భూ యజమాని ఫిర్యాదుతో మహిళ అరెస్ట్‌

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి):
నకిలీ డాక్యుమెంట్ల ముఠా రెచ్చిపోతోంది. భూమి విలువ బాగా పెరగడంతో అక్రమార్జన పరులకు ఇది వరంగా మారింది.  భూమి ఎక్కడ దొరికితే అక్కడ ఆక్రమించే ముఠాలు తయారయ్యాయి. గతంలో మోరంపూడి,  హుకుంపేట, ఇవాళ దివాన్‌చెరువు. ఇలా ఎన్నో కేసులు వెలుగుచూస్తున్నాయి. హకుంపేటలో నకిలీ డాక్యుమెంట్లతో తప్పుడు రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న కుటుంబంలోని ఒకరు ఇటీవల జైలు పాలయ్యారు. మిగతా వారిమీద కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా  రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో ఇలా నకిలీ డాక్యుమెంట్ల ముఠా గుట్టు రట్టయింది. దివాన్‌చెరువులోని డాక్టర్‌ గూడూరి శ్రీనివాసరావు ఆసుపత్రికి సమీపంలో 14.50 ఎకరాల మామిడితోట ఉంది. రూ.కోట్ల విలువ చేసే భూమి ఇది. బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి కథనం ప్రకారం దివాన్‌చెరువులో పుట్టి సత్యనారాయణ సన్‌ ఆఫ్‌ వెంకట్రాజు అనే వ్యక్తికి చెందిన ఈ భూమిని పాలచర్లకు చెందిన కొందరు,  పశ్చిమగోదావరి జిల్ల ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కొందరు కలిసి తప్పుడు డాక్యుమెంట్లతో తాడేపల్లిగూడెంలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. ఉండ్రావరం గ్రామానికి చెందిన  బాలాజీ  తన తల్లి నాగరత్నం పేరిట ఈ స్థలం రిజిస్ర్టేషన్‌ చేయించాడు. నాగరత్నం పుట్టి వెంకట్రాజు కూతురినని చెప్పి, తన తల్లి తనకు వీలునామా రాసిందని డాక్యుమెంట్లు క్రియేట్‌ చేసి, వాటి ఆధారంగా రిజిస్ర్టేషన్‌  చేయించుకున్నట్టు చెప్పారు. ఇందులో పాలచర్లకు చెందిన కొందరు కీలక పాత్ర పోషించారు. ఇటీవల పుట్టి సత్యనారాయణ తన భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారని బొమ్మూరు పోలీసులకు మేనెలలో ఫిర్యాదు చేయగా, అందులో దేవాని నాగరత్నం అనే మహిళను  అరెస్ట్‌ చేసినట్టు సీఐ తెలిపారు. మిగతా వారిని అరెస్ట్‌ చేస్తామన్నారు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన బాలాజీ మొదట కోళ్ల వ్యాపారం చేసుకునేవాడు. తర్వాత  నకిలీ డాక్యుమెంట్లతో అప్పులు తేవడం మొదలు పెట్టి, చివరకు భూములు రిజిస్ర్టేషన్‌ చేయించుకునే స్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-07T05:47:03+05:30 IST