ఎవరిచ్చారు మీకీ అధికారం

ABN , First Publish Date - 2021-10-21T06:49:37+05:30 IST

కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో బుధవారం అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం రసవత్తరంగా సాగింది.

ఎవరిచ్చారు మీకీ అధికారం
కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం

ఇన్‌చార్జి మేయర్‌ను ప్రశ్నించిన కార్పొరేటర్‌
కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 20: కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో బుధవారం  అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం రసవత్తరంగా సాగింది. పార్టీ నుంచి గెలిచిన వారికి కాకుండా వేరే పార్టీ వారికి పదవులు కట్టబెట్టడంతో కార్పొరేటర్ల మధ్య విద్వేషాలు బయటపడ్డాయి. కాకినాడ నగరపాలక సంస్థ అత్యవసర సమావేశాన్ని ఇన్‌చార్జ్‌ మేయర్‌ హోదాలో డిప్యూటీ మేయర్‌-2 చోడిపల్లి సత్యప్రసాద్‌ నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది.  22వ వార్డు కార్పొరేటర్‌ ఎమ్‌జీవీ కిశోర్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన సమావేశ అజెండా రాత్రికి రాత్రి వాట్సాప్‌లో పంపించడమేంటన్నారు. జూలై 7న చివరి మీటింగ్‌ జరిగిందని, రూల్‌ ప్రకారం  అక్టోబరు 7న సమావేశం జరగాలని, అత్యవసర సమావేశ మంటున్నారని కానీ    కార్పొరేటర్‌ రాజీనామా అజెండా తప్ప ముఖ్యమైన అంశాలు లేవన్నారు.  రెండో  డిప్యూటీ మేయర్‌కు మేయర్‌ బాధ్యతలు ఇమ్మని మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. ఇది నాయకుడు నిర్ణయమని మిగిలిన కార్పొరేటర్లు చెప్పగా నాయకుడు అంటే ఎవరని కిశోర్‌ ప్రశ్నించారు.  ఇన్‌చార్జ్‌ మేయర్‌ చోడిపల్లి సత్యప్రసాద్‌ కలగజేసుకుని అన్నింటికీ సమాధానం చెప్పగలిగేశక్తి తనకుందని అంటుండగా మీరు చెప్పాల్సిన అవసరం లేదని,  అర్గనైజింగ్‌ సెక్రటరీ, కమిషనర్‌ దీనికి సమాధానం చెప్పాలని కిశోర్‌ అన్నారు. అయితే అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. కార్పొరేటర్‌ మీసాల ఉదయ్‌కుమార్‌,  కిశోర్‌ కుమార్‌ మధ్య మాటల యుద్ధం జరగడంతో మిగతా కార్పొరేటర్లు సర్దిచెప్పగా సమావేశం నుంచి కిశోర్‌ బయటకు వెళ్లిపోయారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కౌన్సిల్‌ సమావేశానికి వచ్చి కిశోర్‌ ఒక్కడినే ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి మంతనాలు జరిపారు. ఇదిలాఉంటే ఇన్‌చార్జ్‌ మేయర్‌గా బాధ్యతలు తీసుకున్న చోడిపల్లి సత్యప్రసాద్‌ను అభినందించేందుకు పోడియం పైకి బయట వ్యక్తులు వచ్చినా అధికారులు కానీ పాలకవర్గ సభ్యులు కానీ పట్టించుకోకపోవడం విశేషం..

Updated Date - 2021-10-21T06:49:37+05:30 IST