శిబిరంలో సందడి
ABN , First Publish Date - 2021-10-04T06:36:11+05:30 IST
విశాఖపట్నంలోని ప్రముఖ స్టార్ హోటల్‌లో కాకినాడ కార్పొరేటర్లు సేద తీరుతున్నారు. ఉదయం సమావేశాలు, మిగతా సమయం నగరంలో తిరుగుతూ ఆనందంగా గడుపుతున్నారు. వైసీపీ అనుకూల టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు కూడా శిబిరంలో ఉన్నారు.
- ఉదయం సమావేశాలు, సాయంత్రం నగర సందర్శన
- విశాఖ శిబిరంలో రెండో రోజు కాకినాడ కార్పొరేటర్లు
కార్పొరేషన (కాకినాడ), అక్టోబరు 3: విశాఖపట్నంలోని ప్రముఖ స్టార్ హోటల్‌లో కాకినాడ కార్పొరేటర్లు సేద తీరుతున్నారు. ఉదయం సమావేశాలు, మిగతా సమయం నగరంలో తిరుగుతూ ఆనందంగా గడుపుతున్నారు. వైసీపీ అనుకూల టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు కూడా శిబిరంలో ఉన్నారు. మహిళా కార్పొరేటర్లతో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. మంగళవారం జరిగే అవిశ్వాస తీర్మాన సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రముఖ హోటల్లోని కాన్ఫరెన్స హాలులో ఆదివారం సమావేశం నిర్వహించి కార్పొరేటర్లకు సూచనలిచ్చినట్టు సమాచారం. కాకినాడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కార్పొరేటర్లను శిబిరాలకు తరలించి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. సోమవారం రాత్రి కార్పొరేటర్లు కాకినాడ చేరుకుని మంగళవారం సమావేశానికి హజరు కానున్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణుల, కార్పొరేషన కార్యాలయానికి తరలిరానున్నారు. వైసీపీ అనుకూల టీడీపీ, బీజేపీ, వైసీపీ కార్పొరేటర్లు మొత్తంగా 35 మంది మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ఇదే సమయంలో టీడీపీకి కట్టుబడిన 9 మంది కార్పొరేటర్లు ఏ విధంగా వ్యవరిస్తారనేది గోప్యంగా ఉంది. ఇదిలా ఉండగా మేయర్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని తదపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గోప్యంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కేసును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.