YSRCP ప్రలోభాల వల.. టీడీపీకి షాక్‌!

ABN , First Publish Date - 2021-11-09T07:00:38+05:30 IST

టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారు....

YSRCP ప్రలోభాల వల.. టీడీపీకి షాక్‌!

  • కాకినాడ కార్పొరేషన్‌ మూడో డివిజన్‌లో..
  • తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్‌
  • ఉపసంహరణ.. డమ్మీ అభ్యర్థీ అతని బాటలోనే..
  •  అధికార పార్టీ ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గిన వైనం


సర్పవరం జంక్షన్‌, నవంబరు 8: అధికార పార్టీ ప్రలోభాల నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఒకరు చిక్కుకుని పోటీ నుంచి జారుకున్నారు. కాకినాడ కార్పొరేషన్‌లో 3వ డివిజన్‌ కార్పొరేటర్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున దివంగత కార్పొరేటర్‌ గుత్తుల అచ్చియమ్మ కుమారుడు వీరబాబుకు టీడీపీ టిక్కెట్టు ఖరా రు చేసింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఉపఎన్నికల్లో పోటీకి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేయడమే కాకుండా ఇంటింట ప్రచారం చేపట్టారు. గొడారిగుంటలో టీడీపీకి మంచి పట్టు ఉండడంతో అధికార వైసీపీ ప్రలోభాల వల విసిరింది. ఏంజరిగిందో గాని టీడీపీ అభ్యర్థి వీరబాబు ఆ వలకు చిక్కారు. ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం చివరిరోజు కావడంతో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి, ప్రలోభాలకు లొంగిపోయిన అభ్యర్థి పార్టీ అధిష్ఠానాన్ని సైతం తప్పుదారి పట్టించి, బీఫారమ్‌ కోసం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వద్దకు వెళుతున్నానని చెప్పి 10.30 గంటలకు వెళ్లిన వీరబాబు ఎవరికీ చెప్పకుండా గొడారిగుంటలోని మదర్‌ థెరిసా మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారి వద్ద నామినేషన్‌ ఉపసంహరించుకుని, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకోవడంతో టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారు. 


తొలుత బీఫారమ్‌ కోసం వెళ్లిన అభ్యర్థి ఎంతకీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు వద్దకు వెళ్లకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి సూచన మేరకు కొండబాబు 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ రమే్‌ష్‌తో గొడారిగుంట పంపించారు. అక్కడ అభ్యర్థి కోసం మధ్యాహ్నం 3 గంటలకు వరకు వేచిచూసినా రాకపోవడం, ఈలోపు నామినేషన్ల ఉపసంహరణ జాబితా బయట ప్రదర్శించడంతో అభ్యర్థి వీరబాబు పోటీ నుంచి వైదొలిగినట్టు ప్రకటించడంతోపాటు డమ్మీ అభ్యర్థి కూడా నామినేషన్‌ విత్‌డ్రా కావడంతో పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఉపఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థి వడ్డి మణికుమార్‌, బీజేపీ అభ్యర్థి పక్కి మణిబాల ఉన్నట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పొన్నమండ శ్రీనివాసరావు ప్రకటించారు. ఎన్నికల బరి నుంచి తప్పు కున్నందుకు ప్రతిఫలంగా భారీ స్థాయిలో సొమ్ములు చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. కాగా నగరపా లక సంస్థ పరిధిలోని నాలుగు డివిజన్లకు సంబంధించి దాఖలైన నామినేషన్లలో సోమవారం గడువు ముగిసేనాటికి ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. 

Updated Date - 2021-11-09T07:00:38+05:30 IST