నూతన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-07-09T05:16:00+05:30 IST

రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కలిపి కొత్త జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని, ఎన్నికలకు ముందు జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ప్రకటించిన 1.83 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని యువజన, విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నూతన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి

రాజమహేంద్రవరం అర్బన్‌, జులై 8: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కలిపి కొత్త జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని, ఎన్నికలకు ముందు జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ప్రకటించిన 1.83 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని యువజన, విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు వద్ద గోలి ప్లాజాలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.పవన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు బి.రాజులోవ, ఎన్‌.రాజా, ఎన్‌ఎస్‌యూఐ, ఐవైఎం రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమాకాంత్‌, ఎండీ కరీముల్లాఖాన్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాజమహేంద్రవరం కార్యదర్శి టి.సాయి దీపక్‌, ఎస్‌ఐవో రాజమహేంద్రవరం అధ్యక్ష కార్యదర్శులు ఎండీ నయీమ్‌, ఎండీ షఫీ, సీఐటీయూ జిల్లా  ఉపాధ్యక్షుడు బి.పూర్ణిమరాజు మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ వల్ల నిరుద్యోగులకు ఏమాత్రం ఫలితం లేదన్నారు. టీచర్‌, పోలీస్‌, లైబ్రరీ, సచివాలయం, ఇంజనీరింగ్‌తో పాటు ఇతర శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా పోస్టులు లేని ఖాళీ జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకని ప్రశ్నించారు.   కొత్త జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చే వరకూ దశలవారీగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. జాబులు లేని క్యాలెండర్‌ ఎవరికి ఉపయోగమని ఎద్దేవా చేశారు.  పోరాటంలో భాగస్వాములవుతామని ఏఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు టి.విజయ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు బి.రవి, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కిరణ్‌ చెప్పారు.

Updated Date - 2021-07-09T05:16:00+05:30 IST