సంప్రదాయాలకు ప్రతీక దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-14T06:30:36+05:30 IST

దసరా పండుగ వచ్చిందంటే చాలు..అమలాపురంలో జరిగే శరన్న వరాత్రుల సంబరాలు ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చెడీతాలింఖానా సంబరాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అశేష ప్రజానీకం తరలివస్తుంది.

సంప్రదాయాలకు ప్రతీక దసరా ఉత్సవాలు

ప్రత్యేక ఆకర్షణగా చెడీతాలింఖానా 

ఈనెల16న దేవీశరన్నవరాత్రుల ఉత్సవ ప్రదర్శనలు

పోలీసులతో పటిష్ట బందోబస్తు 

ఉభయ రాష్ట్రాల నుంచి తరలిరానున్న వీక్షకులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

దసరా పండుగ వచ్చిందంటే చాలు..అమలాపురంలో జరిగే శరన్న వరాత్రుల సంబరాలు ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చెడీతాలింఖానా సంబరాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అశేష ప్రజానీకం తరలివస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో కర్ర, కత్తి సాములతో పాటు అగ్గిబరాటాలు తిప్పడం ఈఉత్సవాల్లో ప్రత్యేకత. దసరా పండుగలకు కోనసీమలోని వివిధ గ్రామాలతోపాటు అమలాపురంలో శనివారం జరిగే ఊరేగింపులు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

రాష్ట్రంలోనే కోనసీమ కేంద్రమైన అమలాపురంలో జరిగే శరన్న వరాత్రులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 186ఏళ్లపైనే ఈఉత్సవాలకు చారిత్రాత్మక చరిత్ర ఉంది. వంశపారంపర్యంగా పట్టణ పురవీధుల్లో వివిధ ప్రాంతాల వారు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రధానంగా ఈఊరేగింపులో ప్రాచీన సాంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిం పచేసే చెడీ తాలింఖానా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పురవీధుల్లోని ఉత్సవ కమిటీలు ఆయా వీధుల్లో ప్రసిద్ధి చెందిన వాహనాల్లో దేవతా మూర్తులను అలంకరించి ఊరేగిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్ర మాలు, బ్యాండు మేళాలు, గారడీలు, కోయడాన్సులు వంటి ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలను ఈ ఊరేగింపుల్లో అందర్నీ అలరిస్తాయి. అయితే వీటికి ఎంతమేర పోలీసులు అనుమతిస్తారో తెలియాల్సి ఉంది. వాస్తవానికి విజయదశమి రోజున చెడీతాలింఖానాలో భాగంగా జమ్మికొట్టే కార్యక్రమం శుక్రవారం కావడం వల్ల చేసే అవకాశం లేకపోవడంతో ఈఉత్సవాలను 16తేదీ శనివారం నిర్వహించడానికి పట్టణ కమిటీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం భారీ పోలీసు బందోబస్తు నడుమ కరోనా ఆంక్షల నేపథ్యంలో నిర్ధేశిత ప్రాంతంలోనే ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా చెడీ తాలింఖానా: 

అమలాపురంలోని వివిధ పురవీధుల్లో శరన్నవరాత్రి సందర్భంగా జరిగే ఊరేగింపులో ఒక్కొక్కవీధికి ఒక్కో ప్రత్యేక చరిత్ర ఉంది. ప్రధానంగా కొన్ని వీధుల్లో వాహనాలు ఊరేగించడం, మరికొన్ని వీధుల్లో వీరత్వానికి ప్రతీకగా నిలిచే చెడీ తాలింఖానా నిర్వహిస్తారు. ముఖ్యంగా పట్టణంలోని కొంకాపల్లి, మహీపాల వీధి, నల్లావీధి, గండువీధి, రవణం వీధి, రవణం మల్లయ్యవీధి, శ్రీరామపురం వీధుల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏటా దసరా ఉత్సవాల ముగింపు రోజున భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న మైసూర్‌ తరహాలో జరిగే దసరా ఉత్సవాలను తిలకించేందుకు రెండు కళ్లు చాలవంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కర్రలు, కత్తులు, పటాకత్తులు, బళ్లాలు, లేడి కొమ్ములు, అగ్గి బరాటాలు, సరిగమలు, బంతుల తాళ్లు, కత్తి-డాలు, అగ్గి తాళ్లు వంటి వాటితో ఒళ్లు గగుర్పాటు కలిగించే విన్యాసాలను చెడీ తాలింఖానాలో ప్రధానంగా నిర్వహిస్తారు. మహిపాల వీధి, కొంకాపల్లి, గండువీధులు ఈకార్యక్రమానికి ప్రత్యేక వేదికలుగా నిలుస్తాయి. ప్రధానంగా ఈ చెడీతాలింఖానాలో కళ్లకు గంతలు కట్టుకుని పొట్టలపై కూరగాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు వంటివి కత్తులతో ఒక్క వేటుకు నరకడం ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాలను తిలకించేందుకు కోనసీమతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అశేష ప్రజానీకం తరలివస్తుంది. ఆయా వీధుల్లో ఉండే వాహనాలను అంగరంగవైభవంగా అలంకరించి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే విధంగా వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారు. వృద్ధుల నుంచి మూడేళ్ల బాలుడు వరకు ఈచెడీతాలింఖానాలో పాల్గొని కర్రలు, కత్తులతో చేసే విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. అమలాపురంలో జరిగే శరన్నవరాత్రుల ఊరేగింపునకు భారీ భద్రత చర్యలు చేపట్టారు. వందలమంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు, కమిటీలు సహకరించాల్సిందిగా డీఎస్పీ కోరారు. Updated Date - 2021-10-14T06:30:36+05:30 IST