ఇన్‌చార్జి మేయర్‌గా సత్యప్రసాద్‌

ABN , First Publish Date - 2021-10-15T05:18:19+05:30 IST

కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ కాల సత్తిబాబులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 129 ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో కార్పొరేషన్‌లో చకచకా మార్పులు జరిగిపోతున్నాయి.

ఇన్‌చార్జి మేయర్‌గా సత్యప్రసాద్‌

ఆ నిబంధన ఉందంటున్న పాలకవర్గ సభ్యులు
 కార్యక్రమానికి దూరంగా అధికారులు

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు14: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌  సుంకర పావని, డిప్యూటీ మేయర్‌  కాల సత్తిబాబులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 129 ద్వారా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో కార్పొరేషన్‌లో చకచకా మార్పులు జరిగిపోతున్నాయి. చట్టంలోని నిబంధన లను పరిగణలోకి తీసుకుంటూ డిప్యూటీ మేయర్‌-2 చోడిపల్లి సత్యప్రసాద్‌ ఇన్‌చార్జి మేయర్‌గా గురువారం బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటికే ప్రస్తుత మేయర్‌ పావని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ 21971/2021 దాఖలు చేయడంతో ఇన్‌చార్జి మేయర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కానీ, మున్సిపల్‌ అధికారులు కానీ హాజరు కాలేదు. వైసీపీ అనుకూల టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్‌ హాజరయ్యారు. మేయర్‌ అవిశ్వాస తీర్మాన అంశంపై కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించినా తదుపరి విచారణ తేదీ వరకు ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు పేర్కొంది. కాగా మేయర్‌ చాంబర్‌లో ఇన్‌చార్జి మేయర్‌గా సత్యప్రసాద్‌ బాధ్యతలు చేపట్టడంతో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయడానికి మేయర్‌ సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం కోర్టు పరిఽధిలో ఉండటంతో అధికారులు ఇన్‌చార్జి మేయర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అయితే సెక్షన్‌ 91/1 ప్రకారం మేయర్‌ లేకుంటే నూతన మేయర్‌ పదవీ బాధ్యతలు చేపట్టేవరకు డిప్యూటీ మేయర్‌ ఆ బాధ్యతలు చేపట్టవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన రెండో డిప్యూటీ మేయర్‌ విధానంలో ఆ విధివిధానాలు స్పష్టంగా తెలియజేయలేదని చెబుతున్నారు. దీంతో అధికారులు ఎటువంటి నియామక పత్రం ఇవ్వలేదు.

Updated Date - 2021-10-15T05:18:19+05:30 IST