ఊరిలో పరువు పోయందని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-10-07T05:50:56+05:30 IST

వేధింపులు తాళలేక, మరోవైపున కుటుంబం పరువు పోయిందని భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఊరిలో పరువు పోయందని ఆత్మహత్యాయత్నం

భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
అమలాపురం టౌన్‌, అక్టోబరు 6: వేధింపులు తాళలేక, మరోవైపున కుటుంబం పరువు  పోయిందని భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపారు. అమలాపురం రవణంమల్లవీధిలో పలచోళ్ల సూర్య కొండలరావు, సంధ్యాకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. కొండలరావు ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలోని చమురు సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సంధ్యాకుమారి ఆ వీధిలోనే నివాసం ఉంటున్న గండు సుబ్బారావుతో   గతంలో ఫోన్‌లో మాట్లాడేది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లను బయటపెడతానని సుబ్బారావు బెదిరించాడు. తనకు రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. సంధ్యాకుమారి అతనికి రూ.40 వేలు ఇచ్చింది. అయినప్పటికీ సుబ్బారావు వేధింపులు ఆపకపోవడంతో సంధ్యాకుమారి అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పెద్దల దగ్గర ఈ వ్యవహారంపై పంచాయితీ కూడా జరిగింది. ఈ సంఘటనలతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఊరిలో పరువు పోయిందని భావించి    ఈనెల 4వ తేదీ సాయంత్రం బోడసకుర్రు వంతెన వద్దకు వెళ్లారు. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే వారిని స్థానికులు అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పలచోళ్ల సూర్యకొండలరావు (45) బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇదిలా ఉండగా సంధ్యాకుమారి వల్ల తన కుటుంబం పరువు పోయిందని గండు సుబ్బారావు అలియాస్‌ చిన్నా భార్య నాగలక్ష్మి ఈనెల4న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ముగ్గురిపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-07T05:50:56+05:30 IST