ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు కుట్ర

ABN , First Publish Date - 2021-10-22T05:24:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ విమర్శించారు.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు కుట్ర

  • జనాగ్రహదీక్షలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌
  • మాజీ సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని సర్వమత ప్రార్థనలు

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 21: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ విమర్శించారు. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ లోకేష్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఏమిటో ఆయనకే అర్థం కావాలని పేర్కొన్నారు. జిల్లాలో పలుచోట్ల వైసీపీ నాయకులు గురువారం జనాగ్రహదీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో నిర్వహించిన జనాగ్రహదీక్ష శిబిరం వద్ద ఎంపీ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయం, నాయకుల ఇళ్లపై దాడి జరిగిందని బంద్‌కు పిలుపునిచ్చినా ఒక్కరూ స్పందించలేదని, చివరకు హెరిటేజ్‌ కంపెనీ కూడా పదినిమిషాలు మూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన చెంచాలతో సీఎం ప్రజలు వినలేని విధంగా మాట్లాడిస్తున్నారని, మొన్న అయ్యన్నపాత్రుడితో మందు కొట్టించి మాట్లాడించి, ఇవాళ పనికిరాని పట్టాభితో విమర్శలు చేయించారని విమర్శించారు. లోకేశ్‌ను సీఎం చేయలేకపోతున్నాననే ఒత్తిడితోనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకుడు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బర్రే కొండబాబు, గుర్రం గౌతమ్‌, పిల్లి నిర్మల, గుడాల ఆదిలక్ష్మి, హసీనా, ఉల్లూరి రాజు, గారా చంటిబాబు, కొత్త విజయరాజ్యలక్ష్మి పాలొన్నారు. కాగా, చంద్రబాబుకు మంచిబుద్ధి ప్రసాదించాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతోను, కర్రలతోను కొట్టి అగౌరవపరిచారు. 

Updated Date - 2021-10-22T05:24:45+05:30 IST