ప్రభుత్వ పథకాల అమలులో అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-01-13T06:06:43+05:30 IST

ప్రభుత్వ పథకాల అమలులో అర్హులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో అర్హులకు అన్యాయం

  • సచివాలయ కార్యదర్శులు, వలంటీర్ల ఇష్టారాజ్యం
  • తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం తప్పదు
  • మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 12: ప్రభుత్వ పథకాల అమలులో అర్హులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పోల్చితే వైసీపీ ప్రభుత్వం కనీసం 30 శాతం ప్రజా సంక్షేమం కూడా చూడలేదన్నారు. నవరత్నాలు పాలీస్‌ చేసిన గులక రాళ్ళు అయిపోయాయన్నారు. చంద్రబాబు పేదల సంక్షేమానికి పాటుపడ్డారని, విదేశాల్లో చదువుకునేందుకు రూ.15లక్షల చొప్పున 4570 మంది విద్యార్థులకు రూ.700 కోట్లు ఖర్చుచేశారని, జగన్‌ అధికారం లోకి వచ్చాక ఏం చేశారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళు పేరుతో 357 ఏకరాల  భూసేకరణ చేసి నివాసయోగ్యం కాని భూములకు ఎకరానికి రూ.45 లక్షలు చొప్పున కొనుగోలు చేయించి రూ.171 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు. తెల్లరేషన్‌ కార్డు విషయంలో పేదలకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. సచివాలయాల కార్యదర్శులు, వలంటీర్లు పుణ్యమంటూ ఆన్‌లైన్‌లో పేదలకు ఎకరాలకు ఎకరాల భూములు, కార్లు ఉన్నట్టు చూపించడంతో వారంతా ధనికుల జాబితాల్లోకి వెళ్లిపోయారని, రేషన్‌ కార్డులు తొలగించారన్నారు. పేద విద్యార్థుల చదువుకు సహకరిస్తున్నానని చెప్పిన సీఎం తొలివిడిత అమ్మఒడి వేసి రెండో విడిత వచ్చేసరికి చాలామందిని అనర్హులుగా పరిగణించారని అన్నారు. డివిజన్లలో సచివాలయాల కార్యదర్శుల తీరు దారుణంగా వుందని, సచివాలయాలకు వచ్చే ప్రజలతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వీరు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో మార్కండేయ దేవస్థానం చైర్మన్‌ మజ్జి రాంబాబు, పార్లమెంట్‌ మహిళా కమిటి అధ్యక్ష, కార్యదర్శులు మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, తురకల నిర్మల, కానేటి కృపామణి,  మాజీ కార్పొరేటర్‌ ఇన్నమూరి రాంబాబు, కడలి రామకృష్ణ, పి.భద్రం, సింహ నాగమణి, నాయకులు దాస్యం ప్రసాద్‌, కుడిపూడి సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:06:43+05:30 IST