కొవిడ్‌ మూడో దశ నివారణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-07-24T06:38:09+05:30 IST

కరోనా మూడో దశలో చిన్న పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌రెడ్డి, జేసీ కీర్తి చేకూరితో కలసి శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు.

కొవిడ్‌ మూడో దశ నివారణకు పటిష్ట చర్యలు
ఎన్‌ఐసీయూ విభాగాన్ని పరిశీలించిన తర్వాత వైద్యసేవలపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

  • చిన్న పిల్లల వార్డుల్లో పడకలు
  • కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

జీజీహెచ్‌(కాకినాడ), జూలై 23: కరోనా మూడో దశలో చిన్న పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ డి. మురళీధర్‌రెడ్డి, జేసీ కీర్తి చేకూరితో కలసి శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల ప్రసూతి కేంద్రం, శిశు సంజీవని, ఐసీయూ, స్పెషల్‌ కేర్‌ జోన్‌, నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌, నవజాత శిశు చికిత్స కేంద్రం, పిడియాట్రిక్స్‌ విభాగాలతోపాటు ముందస్తు పడకల ఏర్పాట్లను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మితో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో పెద్దలు, పిల్లలకు వైద్యసేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం, వైద్యులు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ముందస్తు సన్నద్ధంగా భాగంగా జీజీహెచ్‌లో అదనంగా 200 పడకలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జీజీహెచ్‌లో వైద్యసేవలకోసం జిల్లాతోపాటూ ఇతర జిల్లాలనుంచి వేలసంఖ్యలో రోగులు వస్తూంటారని, వీరి వైద్యసేవలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామన్నారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్యపరికరాలు, మందులు, డాక్టర్లు, సిబ్బంది వంటి సేవలను ఆగస్ట్‌ ఒకటో తేదీ నాటికి సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కరోనా మొదటి, రెండో దశలను జిల్లాలో సమర్థవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. కొవిడ్‌ పాజిటివిటీ తగ్గుముఖం పట్టిందని, అలసత్వం ప్రదర్శించకుండా ప్రతీ ఒక్కరూ విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా మూడోదశలో తీసుకోవాల్సిన చర్యలు, వైద్యసేవలు, మౌలిక వసతులు, వైద్యపరికరాలపై వైద్యబృందాలతో కలెక్టర్‌ చర్చించారు.

Updated Date - 2021-07-24T06:38:09+05:30 IST