మాయచేసి ‘మేత’

ABN , First Publish Date - 2021-08-21T06:21:59+05:30 IST

మత్స్యశాఖలో నిధుల కుంభకోణం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. పలు పథకాల సొమ్ముపై వచ్చిన వడ్డీ డబ్బుతోపాటు లబ్ధిదారులు వాటాగా చెల్లించిన మొత్తం రూ.1.90 కోట్ల వరకు నొక్కేసిన ఇంటి దొంగలు అంతకుమించే అవినీతికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.

మాయచేసి ‘మేత’

  •  మత్స్యశాఖలో కుంభకోణంపై కొనసాగుతున్న విచారణ
  • వడ్డీ నిధులు, ఇతర చెక్కుల్లో బొక్కింది రూ.4 కోట్లు ఉండొచ్చని అనుమానాలు
  • తాజాగా జూనియర్‌ అసిస్టెంట్‌ అవినాష్‌ను సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు 
  • క్యాష్‌బుక్‌లో డ్రా వివరం నమోదుచేయకుండా తాత్సారం చేసినట్టు గుర్తింపు
  •  ఇటు మృతిచెందిన ఏడీ ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు ఎలా మింగేశారో దర్యాప్తు
  • బ్యాంకుల నుంచి లావాదేవీల వివరాల నివేదికలు బయటకు వస్తే కేసు కొలిక్కి

మత్స్యశాఖలో నిధుల కుంభకోణం ఒక్కొక్కటిగా బయట పడుతోంది. పలు పథకాల సొమ్ముపై వచ్చిన వడ్డీ డబ్బుతోపాటు లబ్ధిదారులు వాటాగా చెల్లించిన మొత్తం రూ.1.90 కోట్ల వరకు నొక్కేసిన ఇంటి దొంగలు అంతకుమించే అవినీతికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బాగోతంపై కాకినాడ పోలీసులు విచారణ చేపట్టగా, మరింత లోతుల్లోకి  వెళ్లి దర్యాప్తు చేపడుతున్నారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో పరిపాలన ఏడీగా పనిచేస్తూ జూన్‌ 21న కొవిడ్‌తో మృతిచెందిన పద్మనాభమూర్తితోపాటు మరికొందరు ఉద్యోగులు ఈ అవినీతిలో భాగస్వామ్యం పంచుకున్నట్టు తేలింది. ఇందుకు సంబంధించి తాజాగా కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ అవినాష్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. అటు మత్స్యశాఖ ఉన్నతాధికారులు రికార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం కాకినాడలోని మత్స్యశాఖ కార్యాలయానికి పరిపాలన విభాగం ఏడీగా పద్మనాభమూర్తి కొన్ని నెలల కిందట బదిలీపై వచ్చారు. అంతకుముందు పశ్చిమగోదావరిలో విధులు నిర్వహించారు. అక్కడ రూ.4.12 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డట్టు ఉన్నతాధికారులు విచారణలో తేల్చారు. ప్రధానంగా మత్స్యశాఖలో అమలవుతున్న పథకాలకు సంబంధించి విడుదలైన నిధులను బ్యాంకులో జమ చేస్తారు. వీటిపై వచ్చే వడ్డీ సొమ్ము కోట్లలో ఖాతాల్లో నిల్వ ఉంది. అయితే ఈ వడ్డీ డబ్బుతోపాటు లబ్ధిదారులు వివిధ స్కీంలకు సంబంధించి మత్స్యశాఖకు ఇచ్చిన చెక్కులను కూడా సదరు అధికారి డ్రా చేసుకుని దిగమింగేశారు. ఆలస్యంగా ఈ కుంభకోణాన్ని గుర్తించి అనుమానంతో జిల్లాలో కూడా రికార్డులు పరిశీలించారు. అదే ఉద్యోగి ఇక్కడ కూడా రూ.1.90 కోట్లు దిగమింగినట్టు ప్రాథమికంగా తేల్చారు. అయితే కుంభకోణానికి పాల్పడ్డ సదరు ఉద్యోగి కొవిడ్‌తో ఈ ఏడాది జూన్‌ 21న మృతిచెందారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి వివరాలు బయటకు పొక్కడంతో ఎక్కడెకక్కడ ఎలా డబ్బు దిగమింగారనే దానిపై జిల్లా అధికారులు పైఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఇటీవల ఇక్కడి కార్యాలయంలో సంబంధిత కుంభకోణానికి సంబంధించిన మొత్తం ఫైళ్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కుంభకోణం రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రికార్డులు పరిశీలించేకొద్ది పలు పథకాలకు సంబంధించిన కోట్ల రూపాయల నిధులను సదరు ఉద్యోగి, మరికొందరు కలిపి మింగేసినట్టు గుర్తించారు. ముఖ్యంగా పలు పాత పథకాలకు సంబంధించిన డబ్బు బ్యాంకు ఖాతాల్లో పేరుకుపోగా వాటిపై వడ్డీ నిల్వలు కూడా కోట్లలో ఉన్నాయి. ఇది గుర్తించిన సదరు అధికారి తెలివిగా నిధులను సొంతానికి దారిమళ్లించేసుకున్నారు. కాకినాడ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు సదరు పద్మనాభమూర్తికి సహకరించినట్టు తేల్చారు. ఈనేపథ్యంలో తాజాగా కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ను విధుల నుంచి తప్పించారు. వాస్తవానికి క్యాష్‌బుక్‌ను ఈయనే నిర్వహించాలి. ఎప్పటి లావాదేవీలు అప్పుడు నమోదు చేయాలి. కానీ రూ.1.90 కోట్ల నిధులు బ్యాంకు ఖాతా నుంచి డ్రాచేసిన తర్వాత కూడా ఆ ఉద్యోగి క్యాష్‌బుక్‌లో ఎక్కడా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బాధ్యుడిగా గుర్తించి జూనియర్‌ అసిస్టెంట్‌ను తొలగించారు. అయితే మరికొద్దిరోజుల్లో ఇంకొందరు బాధ్యులపైనా చర్య లకు ఉపక్రమించే అవకాశం ఉంది. మరోపక్క కుంభకోణానికి సంబంధించి కేసు నమోదుచేసిన కాకినాడ పోర్టు పోలీసులు దీనిపై విచారణ మొదలుపెట్టారు. చనిపోయిన వ్యక్తి, మరికొందరు ఉద్యోగులు కలిసి ఏఏ సమయాల్లో ఎంత మొత్తం డ్రాచేశారు? దారిమళ్లిన చెక్కులు ఎంత? తదితర వివరాలు కావాలని పలు బ్యాంకులను పోలీసు విచారణ బృందం కోరింది. 

Updated Date - 2021-08-21T06:21:59+05:30 IST