కాకినాడ కార్పొరేషనలో పంచతంత్రం

ABN , First Publish Date - 2021-03-22T06:29:26+05:30 IST

ఏ ఉద్యోగికి అయినా ఉద్యోగ విరమణ వరకే ఆ సంస్థతో సంబంధముంటుంది. కానీ కాకినాడ కార్పొరేషన్‌లో మాత్రం అలా కాదు. కొందరు రిటైరైనా అవుట్‌ సోర్సింగ్‌ అవతారంలో మళ్లీ ఇక్కడే తిష్ఠ వేశారు.

కాకినాడ కార్పొరేషనలో పంచతంత్రం

  •  ఆ ఐదుగురు ఉద్యోగులదే హవా 
  • వారు చెప్పిందే వేదం... చేసిందే శాసనం

మొత్తం ఐదుగురు ఉద్యోగులు. అందులో కొందరు ఉద్యోగ విరమణ చేశారు. కానీ యూనియన్‌ పేరుతోనో, అవుట్‌ సోర్సింగ్‌ అవతారంలోనో రాజ్యమేలుతున్నారు. ప్రతీ పనినీ లాభసాటి వ్యవహారంగా మార్చేసుకుంటారు. నిత్యం లావాదేవీలు, పైరవీల మీద పైరవీలు. ఎలాంటి వ్యవహారంలోనైనా చక్రం తిప్పడంలో సిద్ధహస్తులు. వ్యూహరచనలో నేర్పరులు. అందుకనే వీరిని ‘పంచతంత్రం’ అని పిలుచుకుంటారు. వీరు లేకపోతే అసలు కార్పొరేషన్‌ నడవదు అనేంతగా ప్రభావం ఉంటుంది. ఆ కథాకమామీషు చదవండి మరి...

కార్పొరేషన్‌ (కాకినాడ)

ఏ ఉద్యోగికి అయినా ఉద్యోగ విరమణ వరకే ఆ సంస్థతో సంబంధముంటుంది. కానీ కాకినాడ కార్పొరేషన్‌లో మాత్రం అలా కాదు. కొందరు రిటైరైనా అవుట్‌ సోర్సింగ్‌ అవతారంలో మళ్లీ ఇక్కడే తిష్ఠ వేశారు. కొంతమంది కమిషనర్లుగా బయటకు వెళ్లినా తిరిగి ఇక్కడకే వచ్చి చేరారు. యువ నాయకత్వం ధాటికి బలహీనపడుతున్నామని అనుకున్నారో ఏమో గానీ వీరి బ్యాచ్‌ లోని కీలకమైన ఉద్యోగిని తిరిగి ఇక్కడ వేయించుకున్నారు. తద్వారా వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపకుండా మునిసిపల్‌ సుపీరియర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ను గుప్పెట్లో పెట్టుకుని కీలక పదవుల్లో కొనసాగుతుండడంతో  మిగిలిన ఉద్యోగులంతా వారి కనుసన్నల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ధిక్కార స్వరం వినిపిస్తే స్కెచ్‌ వేసి మరీ వారి అంతు చూస్తారు. వీరి బారిన పడి ఎంతోమంది ఉద్యోగులు శంకరగిరి మాన్యాలు పట్టారు. ‘పంచతంత్రం’ సభ్యులు అర్హత లేకపోయినా ఇన్‌చార్జిలుగా పెద్ద బాధ్యతలు దక్కించుకుంటారు. కార్పొరేషన్‌లోని కీలక బాధ్యతలు వీరి చేతుల్లో ఉండేలా ప్రణాళికలు  రచించుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారు. 

వీకెండ్‌ పార్టీలతో జల్సాలు... 

వీరంతా అజ్ఞాత ప్రదేశంలో వీకెండ్‌ పార్టీలతో జల్సాలు చేస్తారు. అయినా ఎవరూ నోరు మెదపరు. ఈ పార్టీల్లోనే ఎవరిని ఎక్కడ, ఎలా తొక్కాలా అని ప్లాన్లు వేస్తుంటారు. కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఎవరొచ్చినా వీరు బుట్టలో వేసుకుంటారు. అయితే ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా రావడంతో అందరూ ఎంతో సంతోషించారు. కానీ పంచతంత్రం కథలకు ఫుల్‌స్టాప్‌ పెట్టలేకపోయారు. ఇడియట్‌ సినిమాలో సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు... చంటిగాడు లోకల్‌ అనే డైలాగ్‌ను తలపించేటట్టు వీరంతా స్థానిక వ్యక్తులు కావడంతో ఇక్కడే ఉద్యోగంలో చేరి ఇక్కడే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. 

తర్వాత జనరేషన్‌కు తర్ఫీదు 

పంచతంత్రం సభ్యులు తమ చెప్పు చేతల్లో ఉండే మరో ఐదుగురిని ఎంపిక చేసి రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేషన్‌లో సర్వీసు రూల్స్‌ అమలు కాక ఇక్కడి నుంచి బదిలీలు లేకపోవడంతో, వీరంతా ఏకుమేకై పాతుకుపోయి మిగిలిన ఉద్యోగులతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఏ ఫైల్‌ కదలాలన్నా వీరి ప్రమేయం తప్పక ఉండాల్సిందే. లేకపోతే ఆ ఫైల్‌ కనిపించకుండా పోతుంది. 

తలుచుకుంటే కొత్త పోస్టు సృష్టిస్తారు

సుదీర్ధకాలం పాటు కార్పొరేషన్‌లో డిఫ్యుటేషన్‌పై టీపీఆర్‌వోగా పనిచేసిన తర్వాత స్కూలుకు బదిలీ అయిన ఓ ఉపాధ్యాయుడిని తిరిగి టీపీఆర్‌వోకు అసిస్టెంట్‌గా వెనక్కి తీసుకున్నారు. ఈయన పోస్టింగ్‌ను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడంతో పాటు ఓ ఎమ్మెల్సీ కూడా అభ్యంతరం చెప్పారు. దీంతో సచివాలయాల అడ్వయిజర్‌గా టీచింగ్‌ పోస్టు సృష్టించి నియామకం చేపట్టారు. కార్పొరేషన్‌లో ఈ పోస్టు లేకపోయినా పంచతంత్రం సభ్యుల వ్యూహంలో పుట్టింది. టీపీఆర్‌వోగా నియమితులైన మహిళా అధికారి అనారోగ్యం రీత్యా సెలవు పెట్టి తిరిగి చేరేసరికి ఆమెను ఆ పోస్టు నుంచి తప్పించి సచివాలయాల కో-ఆర్డినేటర్‌గా ప్రాధాన్యం లేని పోస్టులో వేశారు. 

ఉదాహరణకు... 

కార్పొరేషన్‌కు అర్హత కలిగిన సెక్రటరీని ప్రభుత్వం నియమిస్తూ వచ్చింది. అయితే వచ్చిన వారిని వచ్చినట్టు వీరు వెళ్లగొడుతున్నారు. పంచతంత్రం సభ్యుల్లో అర్హత లేని ఓ ఉద్యోగికి సెక్రటరీ పోస్టు ఇన్‌చార్జిగా వేశారు. ఇంతలో మహిళా సెక్రటరీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఆ మహిళా సెక్రటరీని బెదరగొట్టి ఇక్కడ తప్ప అడవులోకి పంపినా పర్వాలేదంటూ గగ్గోలు పెట్టి వెళ్లిపోయేలా చేశారు. ఆమెకు కమిషనర్‌ సైతం భరోసా ఇచ్చినా ఇక్కడ చేయలేను అంటూ వెళ్లిపోయింది. 

కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారిలో కొందరిని కుల వివక్షతతో ఎటువంటి పదోన్నతులు రాకుండా గత 15-16 సంవత్సరాలుగా వేధిస్తున్నారు. 

డిగ్రీ, ఇంజనీరింగ్‌ అర్హత కలిగిన కింది స్థాయి సిబ్బందిని కూడా ఎటువంటి ఎదుగుదల లేకుండా కాలరాస్తున్నారు. దీంతో వారు అర్హత వున్న పదోన్నతి రాక, జీతాలు పెరగక సతమతమవుతున్నారు. గట్టిగా ప్రయత్నించి రిజర్వేషన్‌ పుణ్యమా అని మంచి స్థానంలోకి వస్తే కుట్ర పన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యేలా చేయిస్తున్నారు. 

ఎవరికైనా సెలవులు కావాలన్నా వారికి అనుకూలంగా ఉన్న వారికే మంజూరు చేస్తూ ఆధిపతాన్ని నిలబెట్టుకుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా మందస్తు అనుమతి లేకుండా సెలవులు పెడితే షోకాజ్‌  నోటీసులిప్పిస్తారు. 

మునిసిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ (ఎంఎస్‌సీ) పదవిలో ఓ న్యాయవాది కొనసాగుతున్నా కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పూర్తికాలం సర్వీసు పూర్తిచేసి ఎటువంటి ప్రాక్టీసు లేని పంచతంత్రం సభ్యుల్లోని ఒకరిని మరో లీగల్‌ అడ్వయిజర్‌గా నియమించారు. కార్పొరేషన్‌లో ఈ పోస్టు లేకపోయినా కొత్తగా సృష్టించారు. 

ఉద్యోగ విరమణ పొందినవారు కొనసాగకుండా ప్రభుత్వం 2019 అక్టోబరు 18న జీవో నెం. 2323 జారీ చేసినా కూడా రిటైర్డ్‌ ఉద్యోగులకు తిరిగి నియామకాలు చేపడుతున్నారు. అయితే ఈ జీవోను ఆధారంగా చేసుకుని స్మార్ట్‌ సిటీ కార్యాలయం, గుడా కార్యాలయంలో రిటైర్డ్‌ ఉద్యోగులను విధుల నుంచి తొలగించగా కాకినాడ కార్పొరేషన్‌లో మాత్రం  వీరిని కొనసాగిస్తున్నారు. వీరికి ఉన్నత స్థానాల్లో బాధ్యతలు అప్పగిస్తూ జీవోను బేఖాతరు చేస్తున్నారు. ఐఏఎస్‌ అఽధికారి కమిషనర్‌గా ఉన్నా కూడా కొంతమంది ఉద్యోగులు అనుకున్నదే శాసనంగా సాగుతోంది. 

లాబీయింగ్‌లో సిద్ధహస్తులు..

అంతే కాదండోయ్‌.. లాబీయింగ్‌లో సిద్ధహస్తులైన వీరు తమ జీతాలు అమాంతంగా రెట్టింపు చేసేలా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదం పొందారు. కమిషనర్‌, మేయర్‌ సమక్షంలో అజెండాలోని ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్వయంగా ఓ కార్పొరేటర్‌.... ‘వీరు లేకపోతే కార్పొరేషన్‌ లేదు’ అని చమత్కరించడం గమనార్హం.

Updated Date - 2021-03-22T06:29:26+05:30 IST