బాట చార్జీల పేరిట బాదుడు!

ABN , First Publish Date - 2021-10-25T05:53:00+05:30 IST

జిల్లావ్యాప్తంగా 38 ఇసుక ర్యాంపులు నిర్వహణలో ఉండాల్సి ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని ర్యాంపులు ఇంకా నిర్వహణలోకి రాలేదు. ప్రస్తుతం బోట్స్‌మెన ర్యాంపులతో పాటు మరికొన్ని ఇతర ర్యాంపుల ద్వారా ఇసుకను తవ్వి విక్రయాలు చేస్తున్నారు.

బాట చార్జీల పేరిట బాదుడు!

  • ఇసుక రేవుల్లో ప్రైవేటు వ్యక్తుల దందా
  • పట్టించుకోని అధికారులు
  • డిమాండును బట్టి ఇసుక రేట్ల పెంపు

జిల్లాలో ఇసుక ధరలు భగ్గుమంటున్నాయు. ఇసుక రేవులు, స్టాక్‌ పాయింట్లు వద్ద వాహనాల యజమానుల నుంచి బాటచార్జీల పేరిట అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఇసుక రేట్లతో పాటు అనధికారిక వసూళ్లు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాహనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో పోలిస్తే వినియోగదారులు అధిక మొత్తాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ముసుగులో ఉన్న కొందరు నాయకుల ప్రమేయంతో అనధికారిక వసూళ్లు ఇష్టారాజ్యాంగా జరుగుతున్నా నిరోధించేవారే లేరు. చివరకు ప్రభుత్వం సరఫరా చేసే స్టాకు పాయింట్ల వద్ద సైతం బాట చార్జీల పేరిట సొమ్ము వసూలు చేస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లావ్యాప్తంగా 38 ఇసుక ర్యాంపులు నిర్వహణలో ఉండాల్సి ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని ర్యాంపులు ఇంకా నిర్వహణలోకి రాలేదు. ప్రస్తుతం బోట్స్‌మెన ర్యాంపులతో పాటు మరికొన్ని ఇతర ర్యాంపుల ద్వారా ఇసుకను తవ్వి విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కాంట్రాక్టు సంస్థకు చెల్లించే ధరలతో పాటు రేవుల వద్ద అనధికారిక వసూళ్లు దారుణంగా ఉంటున్నాయని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. పి.గన్నవరం ర్యాంపులో అధిక వసూళ్లు చేస్తున్నారు. బోట్స్‌మెన సొసైటీ ద్వారా సరఫరా చేసే ఇసుకకు బోటు యజమానులు రూ.300, మరికొంత దూరం వెళ్లిన తర్వాత ర్యాంపు బాట పేరిట రూ.200 వెరసి... వాహనానికి  రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే నిర్వాహకుల నుంచి తిరుగుబాటు ఎదురవుతోంది. పి.గన్నవరం మండలంలోని ముంజవరం, డీఎస్‌ పాలెం ర్యాంపుల వద్ద సైతం ఇదే విధంగా బాట పేరిట రూ.200 అదనంగా వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారాలపై టీడీపీ, జనసేన నాయకులు ఆందోళన చేసిన్పటికీ అధికారుల నుంచి స్పందన శూన్యం. కాగా ఇసుక డిమాండును బట్టి రేట్లు వసూలు చేస్తున్నారు. రావులపాలెంలోని మల్లాయిదొడ్డి వద్దనున్న ఇసుక స్టాక్‌ పాయింట్‌లో ధరలు విచిత్రంగా ఉంటాయి. డిమాండు ఎక్కువగా ఉంటే ధర పెరుగుతుంది. ఇక్కడ ఒక టన్ను ఇసుక రూ.700 నుంచి రూ.900 పలుకుతుంది. ఇసుక లోడింగ్‌కు వాహనాలు అధికంగా వస్తే ధర పెంచి టన్నుకు రూ.900 వసూలు చేస్తున్నారని వాహనాల యజమానులు వాపోతున్నారు. ఉదాహరణకు ఐదు యూనిట్ల లారీ ఇసుక డిమాండు లేని సమయంలో వస్తే టన్ను రూ.700 వంతున 18 యూనిట్ల లారీకి రూ.12,600 అవుతోంది. అదే అధిక లారీలు వస్తే టన్ను రూ.900 వసూలు చేస్తున్నారు.  అంటే 18 యూనిట్ల లారీ ఇసుక ధర రూ.16,200 పలుకుతోంది. దీనికి తోడు బాట చార్జీ పేరుతో లారీకి రూ.600 వసూలు చేస్తున్నారు. ఇలా కాంట్రాక్టు సంస్థ సైతం వినియోగదారుల డిమాండును బట్టి రేట్లు నిర్ణయించడంపై లారీల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల అనధికారికంగా తవ్వకాలు జరిగి భారీగా రవాణా అవుతోంది.  

Updated Date - 2021-10-25T05:53:00+05:30 IST