లెక్క..పక్కాగా ఉండాలి
ABN , First Publish Date - 2021-02-06T06:06:57+05:30 IST
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గరిష్ట పరిమితికి లోబడి మాత్రమే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు అనంత శంకర్ తెలిపారు.

జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు అనంతశంకర్
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), ఫిబ్రవరి 5: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గరిష్ట పరిమితికి లోబడి మాత్రమే ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు అనంత శంకర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వ్యయ పరిశీలకునిగా నియమితులైన ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్, జిల్లా సమాచార కేంద్రాన్ని సందర్శించి మండల వ్యయ పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ ఎన్నికల వ్యయాన్ని నిర్దేశించిన రేట్ల ప్రకారం సమర్పించాలన్నారు. లేని పక్షంలో తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారన్నారు. ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు చేసే ఖర్చు పరిశీలనకు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి వివరాలను పేజీకి ఒక్క రూపాయి చొప్పున సంబంఽధిత రిటర్నింగ్ అధికారికి చెల్లించి ఎవరైనా పొందవచ్చన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురిచేయకుండా, ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరిగేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. ఓటర్లకు బహుమతులు, ఇతర ప్రలోభాలకు గురి చేయకుండా కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలలో తనిఖీలు నిర్వహించాలన్నారు. అనుమతి, తగిన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తరలించరాదని, దీనిపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వ హిస్తున్నా మన్నారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారాలకు వాహనాలు వినియోగించరాదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్ రూమ్ నంబర్ 81061 49123, 81067 21345కు ఫోన్ చేసి తెలపాలన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిబంధనలు పాటిస్తూ జరిగేలా అభ్య ర్థులందరూ సహకరించాలని వ్యయ పరిశీలకుడు అనంత శంకర్ కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో కంట్రోల్ రూమ్ వ్యయ నోడల్ అధికారి బి.చంద్రరావు, కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జి కె.శ్రీరమణి పాల్గొన్నారు.