తొలి అడుగు

ABN , First Publish Date - 2021-07-12T05:49:52+05:30 IST

ఖరీఫ్‌ సేద్యం చేయడం కోసం అన్నదాతలు తొలి అడుగు వేస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను సైతం ప్రతిఘటిస్తూ తొలకరి సేద్యానికి రైతులు సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నారుమడులు సిద్ధం చేసుకునే అనువైన పరిస్థితులు ఏర్పడడంతో వారంతా దుక్కులు దున్నుతూ వరి విత్తనాలు చల్లుతున్నారు. రైతులు పొలంబాట పట్టడంతో పంట పొలాలు కళకళలాడుతున్నాయి. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు

తొలి అడుగు
వన్నెచింతలపూడిలో పొలంలో ట్రాక్టరుతో దుక్కు దున్నుతున్న దృశ్యం

జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సేద్యానికి శ్రీకారం 

పొలంబాట పట్టిన రైతులు 

నారుమడులు సిద్ధం


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సేద్యం చేయడం కోసం అన్నదాతలు తొలి అడుగు వేస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను సైతం ప్రతిఘటిస్తూ తొలకరి సేద్యానికి రైతులు సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నారుమడులు సిద్ధం చేసుకునే అనువైన పరిస్థితులు ఏర్పడడంతో వారంతా దుక్కులు దున్నుతూ వరి విత్తనాలు చల్లుతున్నారు. రైతులు పొలంబాట పట్టడంతో పంట పొలాలు  కళకళలాడుతున్నాయి. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయకపోవడం వల్ల కోనసీమలోని శివారు భూములకు ఇప్పటికీ సాగునీరు అందని పరిస్థితి. పంట కాల్వల్లో తూడు, గుర్రపుడెక్క, చెత్తాచెదారాలు పెరిగిపోవడంతో సాగునీటి సరఫరాలో అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రైతులు పలుచోట్ల పంట విరామానికి సైతం సిద్ధమవుతున్నారు.


ఖరీఫ్‌  సేద్యం ఆలస్యం కావడం వల్ల దిగుబడితో పాటు ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా కోనసీమలోని అనేక గ్రామాలకు చెందిన రైతులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో 5.50లక్షల ఎకరాల్లో సేద్యం చేయనున్నారు. ఇప్పటి వరకు ఇందుకోసం 4852 హెక్టార్లలో రైతులు వరినాట్లు వేశారు. వెదజల్లు విధానంలో ఇప్పటికే 12,848 హెక్టార్లలో విత్తనాలు చల్లడం పూర్తయింది. జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వెదజల్లు విధానాన్ని అవలంబించే అవకాశం ఉన్నట్టు వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు మాధవరావు తెలిపారు. ఖరీఫ్‌  సీజన్లో ఎంటీయూ-1064, 1061, 1140, 7029, 1075 వరి వంగడాలతో పాటు ముంపు, వర్షాలను తట్టుకునే విధంగా మెట్ట ప్రాంతంలో బీపీటీ-5204 వేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వర్షాలు, వరదలు వంటి వాటిని తట్టుకునే విత్తనాలు చల్లుకోవాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నారమడులు వేసుకునే రైతులు ముంపునీరు  దిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-07-12T05:49:52+05:30 IST