కేసులు పెరుగుతున్నందున ప్రజల్లో అవగాహన పెంచాలి

ABN , First Publish Date - 2021-03-24T06:49:44+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి23: జిల్లాలో క్రమేపీ పెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో వైరస్‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన, హెచ్చరిక కార్యక్రమాలతోపాటు, వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి ఆదేశించారు.

కేసులు పెరుగుతున్నందున ప్రజల్లో అవగాహన పెంచాలి
మండల, డివిజనల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశాలు 

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి23: జిల్లాలో క్రమేపీ పెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో వైరస్‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన, హెచ్చరిక కార్యక్రమాలతోపాటు, వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి మండల, డివిజనల్‌ అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వివిధ అత్యవసర, ప్రాధాన్యతాంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజుకు 8 స్థాయి నుంచి పెరుగుతూ ప్రస్తుతం రోజుకు 30కు చేరుకుందన్నారు. ఈ దశలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయకుంటే మళ్లీ ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. కొవిడ్‌ -19 నియంత్రణ జాగ్రత్తలను వ్యక్తిగతంగాను, సామాజికంగాను అందరూ ఖచ్చితంగా పాటించేలా చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అలాగే ఫేజ్‌-1, 2ల కింద మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారందరూ రెండవ డోస్‌ తప్పని సరిగా వేయించుకునేట్లు చూడాలన్నారు. ఫేజ్‌-3 పంపిణీ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన 236 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలతోపాటు, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాలుగు గ్రామ సచివాలయాల్లో సోమ, బుధ, శనివారాల్లో వైద్యాధికారులు వ్యాక్సినేషన్‌ నిర్వహించాలన్నారు. జేసీలు జి లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి రాజకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:49:44+05:30 IST