జిల్లాలో 190 కేంద్రాల్లో డ్రై రన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-01-13T07:08:39+05:30 IST

కరప, జనవరి 12: కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎవరికీ బలవంతంగా ఇవ్వొద్దని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మాత్రమే టీకా వేయాలని జిల్లా క

జిల్లాలో 190 కేంద్రాల్లో డ్రై రన్‌ విజయవంతం
కరప పీహెచ్‌సీలో నిర్వహించిన డ్రై రన్‌ ప్రక్రియను పరిశీలించి సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

16న 33 కేంద్రాల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు 

కొవిడ్‌ వ్యాక్సిన్‌: జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కరప, జనవరి 12: కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎవరికీ బలవంతంగా ఇవ్వొద్దని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మాత్రమే టీకా వేయాలని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. కరప ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం నిర్వహించిన డ్రై రన్‌ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన వెయిటింగ్‌, డేటా ఎంట్రీ, వ్యాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు 190 కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన డ్రై రన్‌ విజయవంతమయ్యిందన్నారు. కొవ్యాగ్జిన్‌, కొవిడ్‌షీల్డ్‌ వ్యాక్సిన్‌లు జిల్లాకు వచ్చాయని, ఈనెల 16న ఎంపిక చేసిన 33 సెంటర్లలో వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేస్తామన్నారు.


తొలిదశలో జిల్లాలో దాదాపుగా 34,500 మందికి ఈ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించామన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దుష్పరిణామాలు ఎదురైతే తక్షణ వైద్యసాయం అందేలా ఏర్పాట్లుచేశామన్నారు. విడుదలైన రెండు వ్యాక్సిన్‌లలో ఏదో ఒకదాన్ని మాత్రమే రెండు మోతాదుల్లో 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. టీకా వేసిన తర్వాత దుష్పరిణామాలు ఎదురైతే సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్లతో కూడిన కరపత్రాలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వచ్చేవారికి ముందుగా టెంపరేచర్‌ను తనిఖీచేయాలని, మాస్క్‌, శానిటైజర్‌లను తప్పనిసరిగా వాడేలా చూడాలన్నారు. ఎవరైనా పాజిటివ్‌ అని తేలితే వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించి వైద్యమందించాలని సూచించారు.కరప ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 141 మంది వైద్యఆరోగ్య, రెవెన్యూ, పోలీస్‌, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీలకు 16న ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని మండల వైద్యాధికారి రమావత్‌ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. డిప్యూటీ కలెక్టర్‌, మెప్మా పీడీ కె.శ్రీరమణి, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ప్రసన్నకుమార్‌, డాక్టర్‌ శ్రీనివాసనాయక్‌, తహశీల్దార్‌ సీహెచ్‌.ఉదయభాస్కర్‌, ఎస్‌ఐ రామారావు, ఈవోపీఆర్డీ బాలాజీ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T07:08:39+05:30 IST