గండేపల్లిలో గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2021-03-24T06:43:18+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) కుంభకోణాలకు ఆలవాలంగా మారాయి. అవినీతిలేని సొసైటీలనేవి చాలా తక్కువే ఉండొచ్చు. కుంభకోణాల

గండేపల్లిలో గోల్‌మాల్‌!

గండేపల్లి సొసైటీలో రూ.22.70 కోట్ల కుంభకోణం

నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు 8 19 మందిపై కేసు

ఒక్కొక్కరూ రూ.3 లక్షల నుంచి 35 లక్షల వరకూ స్వాహా

అధికారులు.. రాజకీయ నాయకుల కుమ్మక్కుతోనే వ్యవహారం


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) కుంభకోణాలకు ఆలవాలంగా మారాయి. అవినీతిలేని సొసైటీలనేవి చాలా తక్కువే ఉండొచ్చు. కుంభకోణాలకు పాల్పడే సొసైటీలే ఎక్కువ. ఇందులో తాజా ఉదాహరణ గండేపల్లి సొసైటీ. ఈ సొసైటీలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి, ఏకంగా రూ.29.70 కోట్లు స్వాహాచేశారు. నెమ్మదిగా ఇది బయటపడడంతో దీనిపై దర్యాప్తు చేసి, అవినీతిని ధ్రువీకరిం చిన పెద్దాపురం డీఆర్‌ 19 మందిపై గండేపల్లి పోలీసుస్టేషన్‌లో ఈనెల 20న ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఇందులో ముఖ్యమైన నాయకులు, అఽధికారులు ఉండడం గమనార్హం.

గండేపల్లి సొసైటీలో సుమారు రూ.40 కోట్ల టర్నోవరు ఉంటుంది. సొసైటీ ద్వారా రైతులకు షార్ట్‌టెర్మ్‌, లాంగ్‌టెర్మ్‌ రుణాలు, భూమి అభివృద్ధి చేసుకోవడానికి రుణాలు ఇవ్వడం, వీలునుబట్టి ఇతర రుణాలు కూడా ఇస్తుంటారు. 2017-19 మధ్య ఇక్కడ కొందరు రాజకీయ నేతలు, అధికారులు కుమ్మక్కై పెద్ద పథకమే అల్లారు. శంఖవరం, రౌతులపూడి, తొండంగి మండలాలకు చెందిన రైతుల పేరిట ఇక్కడ కొందరు నకిలీ పాసు పుస్తకాలు సృష్టించారు. సొసైటీ మాజీ ప్రెసిడెంట్‌, అతని బంధువులు, సొసైటీ సభ్యులు, ఇతరులు, వివిధ స్థాయిల్లోని డీసీసీబీ అధికారులు అంతా ఒకటైపోయినట్టున్నారు. సీజనల్‌ అగ్రికల్చరల్‌ ఆపరేషన్‌ (ఎస్‌ఏవో) రుణాలు, అరటి పంట కోసం దీర్ఘకాలిక (ఎల్‌టీ) రుణాలు, భూమి అభివృద్ధి పేరిట దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. ఒక్కోసారి  82 ఫైళ్ల ద్వారా మూడు సార్లు లోన్లు పొందారు. దీర్ఘకాలిక రుణాల పేరిట ఇతర రుణాలు కూడా తీసుకున్నారు. అత్యధికంగా కొందరు రూ.35 లక్షల వరకూ తీసుకోగా, కొందరు మూడు లక్షలకే పరిమితమయ్యారు. వీటికి సంబంధించి భూములే లేవు. ఆ పేర్లుగల వ్యక్తులూ ఇక్కడ లేరు. పైగా ఫీల్డ్‌లో తిరిగి, ఈ భూములు ఉన్నట్టు స్వయంగా చూసి, ఎవరివో కూడా ధ్రువీకరించుకుని రుణాలకు సిఫార్స్‌ చేయవలసిన ఫీల్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా  స్వయంగా ఇవి రుణాలకు అర్హమైనవేనని ధ్రువీకరించేశారు. లీగల్‌ ఓపీనియన్‌ ఇచ్చే వ్యక్తి కూడా వీటిని ధ్రువీకరించినట్టు చెబుతున్నారు. అసలు సొసైటీ సెక్రటరీ రుణాలు ఇవ్వడానికి సిద్ధమై, వివరాలు సిద్ధం చేస్తే, అవి వివిధ స్థాయిలలో చివరకు బ్రాంచి మేనేజర్‌ ద్వారా కాకినాడ హెడ్‌ ఆఫీసుకు ఫైల్‌ పంపితే, అక్కడ స్ర్కూట్నీ చేసి, సీఈవో అనుమతితో రుణాలు మంజూరు చేస్తారు. 


16న రిపోర్ట్‌ ఇచ్చా.. 20న కేసు పెట్టా : పెద్దాపురం డీఆర్‌

 ఈ కుంభకోణంలో పకడ్బందీగా విచారణ జరిగింది. పెద్దాపురం డీఆర్‌ రాధాకృష్ణారావు విచారణాధికారిగా వ్యవహరించారు. డిసెంబరులో ఆయనకు బాధ్యతలు అప్పగిం చారు. ఈ రుణాలు పొందినట్టు ఉన్న వివరాలు ప్రకారం తాము  శంఖవరం, రౌతులపూడి, తొండంగి ప్రాంతాల్లో తిరిగి వివరాలు సేకరించామని డిఆర్‌ రాధాకృష్ణ తెలిపారు.  ఇక్కడ రుణాలను పొందిన పాసు పుస్తకాలు నకిలీవని, సంతకాలు కూడా ఫోర్జరీయేనని తేలిందన్నారు. ఏప్రిల్‌ వరకూ గడువు ఉండగా, ముందుగా ఈనెల 16నే తాను రిపోర్ట్‌ ఇచ్చేనన్నారు. అలాగే 20న గండేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అవినీతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గండేపల్లి ఎస్‌ఐ శోభనకుమార్‌ తెలిపారు. కాగా ఈ కేసులో అధికారులు, రాజకీయనేతలు కూడా ఉండడం గమనార్హం.  డీసీసీబీ గండేపల్లి బ్రాంచ్‌ మేనేజర్‌ శ్యామల, కొత్తపేట బ్రాంచి మేనేజర్‌  గణపతి, సీఈవో పి.సత్యనారాయణ, మాజీ ప్రెసిడెంట్లు సత్యనారాయణ;  కృష్ణ శ్రీనివాస్‌, ఓ నాయకుడి భార్య, కూతురు, బంధువు, కాకినాడ ఏజీఎం శ్రీనివాస్‌, డీజీఎంలు పట్టాభిరామయ్య, త్రినాథ్‌, శ్రీరామచంద్రరెడ్డి, సొసైటీ మెంబర్లు మొత్తం 19పై కేసు నమోదైంది.

Updated Date - 2021-03-24T06:43:18+05:30 IST