డొంకరాయి జలాశయంనుంచి 6500 క్యూసెక్కుల నీరు విడుదల

ABN , First Publish Date - 2021-09-05T07:00:43+05:30 IST

సీలేరు కాంప్లెక్సులోని డొంకరాయి జలాశయంనుంచి 6,500 క్యూసెక్కుల నీటిని శనివారంనుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. రెండురోజులుగా డొంకరాయి జలాశయం పరిసర ప్రాంతాల్లో కొండలపై విస్తారంగా వర్షాలు కురవడంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

డొంకరాయి జలాశయంనుంచి 6500 క్యూసెక్కుల నీరు విడుదల
డొంకరాయి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

మోతుగూడెం, సెప్టెంబరు 4: సీలేరు కాంప్లెక్సులోని డొంకరాయి జలాశయంనుంచి 6,500 క్యూసెక్కుల నీటిని శనివారంనుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. రెండురోజులుగా డొంకరాయి జలాశయం పరిసర ప్రాంతాల్లో కొండలపై విస్తారంగా వర్షాలు కురవడంతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా శనివారం ఉదయానికి 1036.5 అడుగులకు చేరుకున్నాయి. జెన్‌కో అధికారులు ముందస్తు చర్య ల్లో భాగంగా నీటి మట్టాలు ప్రమాదస్థాయికి చేరుకోకుండా రెండు గేట్ల ద్వారా 6500 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిపై ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ రామకోటిలింగేశ్వరరావు మాట్లాడుతూ రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వలసగెడ్డ, పాలగెడ్డ వాగులతో పాటు కొండ ప్రాంతాలనుంచి 10వేల క్యూసెక్కులకుపైగా వరదనీరు డొంకరాయి జలాశయంలో వచ్చి చేరుతుండడంతో 1036 అడుగుల నీటిమట్టం కొనసాగేలా జలాశయంనుంచి రెండు గేట్లు ద్వారా 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి విద్యుత్‌ ఉత్పత్తికోసం 4వేల క్యూసెక్కులు పవర్‌ కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేస్తూ డొంకరాయి జలాశయం నీటిమట్టం 1036 అడుగులవద్ద నిలకడగా కొనసాగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని  శనివారం పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో 2.2 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి జరిగిందని ఎస్‌ఈ రామకోటిలింగేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2021-09-05T07:00:43+05:30 IST