దివీస్‌ పార్మా కంపెనీ వల్ల మనుగడకు ముప్పు

ABN , First Publish Date - 2021-01-12T06:25:55+05:30 IST

దివీస్‌ కంపెనీ వల్ల ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు అన్నారు.

దివీస్‌ పార్మా కంపెనీ వల్ల మనుగడకు ముప్పు
తుని పట్టణంలో ర్యాలీ చేస్తున్న సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ నాయకులు

   తుని, జనవరి 11: దివీస్‌ కంపెనీ వల్ల ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని  సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు అన్నారు. దివీస్‌ వ్యతిరేక పోరాటంలో భాగంగా జైలుకెళ్లిన బంగార్రాజు, జనార్ధన్‌ సోమవారం విడుదలయ్యారు. ఈ  సందర్భంగా తుని పట్టణంలో సబ్‌ జైల్‌ నుంచి గొల్ల అప్పారావు సెంటర్‌ వరకు  ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రాణాలు తీసే మందుల పరిశ్రమను తొండంగి నుంచి తక్షణం తరలించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం దివీస్‌ను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం దివీస్‌కు సహకరించడం వల్లే ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణం పరిశ్రమను రద్దుచేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అర్జునరావు, మానుకొండ లచ్చబాబు, సింహాచలం, సామిరెడ్డి నారాయణమూర్తి, వాడబోయిన శివ, దడాల లోవరాజు, రాపాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-12T06:25:55+05:30 IST