లక్షన్నర దాటేశాయి!
ABN , First Publish Date - 2021-05-05T05:50:58+05:30 IST
జిల్లాలో కొవిడ్ మహమ్మారి పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీస్తోంది. వేలాది కేసులతో వేళ్లూనుకుపోయి జనాన్ని ప్రాణభయంతో విలవిల్లాడేలా చేస్తోంది. ఏరోజుకారోజు కేసులు పెరిగిపోతూ ఆసుపత్రులపాలు చేస్తోంది. చివరకు వేలల్లో ఆక్సిజన్ బెడ్లు, వందల్లోని ఐసీయూ పడకలు ఏమూలకూ చాలక ఆసుపత్రుల ఎదుట అనేకమంది పడిగాపులు కాస్తున్నారు. కొందరైతే డబ్బుకు వెనుకాడకుండా ఐసీయూ, వెంటిలేటర్ బెడ్ల కోసం ప్ర

జిల్లాలో పట్టపగ్గాల్లేకుండా వైరస్ ఉధృతి
మంగళవారం పాజిటివ్‌లతో కలిపి 1.50 లక్షలు దాటేసిన కేసులు
జిల్లాలో గడచిన 34 రోజుల్లో 24,945 పాజిటివ్‌లతో కల్లోలం
మహమ్మారి విలయం నేపథ్యంలో
నేటి నుంచి జిల్లాలో రెండు వారాలు పగటికర్ఫ్యూ
ఉదయం 12 తర్వాత నుంచి మరుసటి రోజు
ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్
వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ
ఉదయం 6 గంటల నుంచి 12 వరకే
ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ సేవలు,
మద్యం దుకాణాలకూ ఇదే సమయం
మధ్యాహ్నం 12 తర్వాత బయట తిరిగితే
భారీ జరిమానాలు.. కేసులు
జిల్లాకు 40 వేల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు రాక..
నేడు, రేపు సెకండ్ డోస్‌కే వినియోగం
జిల్లాలో కొవిడ్ మహమ్మారి పట్టపగ్గాల్లేకుండా పరుగులు తీస్తోంది. వేలాది కేసులతో వేళ్లూనుకుపోయి జనాన్ని ప్రాణభయంతో విలవిల్లాడేలా చేస్తోంది. ఏరోజుకారోజు కేసులు పెరిగిపోతూ ఆసుపత్రులపాలు చేస్తోంది. చివరకు వేలల్లో ఆక్సిజన్ బెడ్లు, వందల్లోని ఐసీయూ పడకలు ఏమూలకూ చాలక ఆసుపత్రుల ఎదుట అనేకమంది పడిగాపులు కాస్తున్నారు. కొందరైతే డబ్బుకు వెనుకాడకుండా ఐసీయూ, వెంటిలేటర్ బెడ్ల కోసం ప్రయత్నిస్తున్నా ఎక్కడా లభించక బోరున విలపిస్తున్నారు. కాగా మంగళవారం నాటి పాజిటివ్‌లతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఏకంగా లక్షన్నర దాటిపోయాయి. కేవలం 34 రోజుల్లో 24,945 పాజిటివ్‌లు కల్లోలం సృష్టించాయి. ఈ స్థాయిలో వైరస్ ఉధృతి నేపథ్యంలో నేటి నుంచి జిల్లాలో పగడ్బందీగా పగటిపూట కర్ఫ్యూ అమలుచేయడానికి రెవెన్యూ, పోలీసు శాఖలు ఏర్పాట్లు చేశాయి. అటు జిల్లాకు 40వేల కొవిషీల్డ్ వ్యాకిన్సు వచ్చాయి. బుధ, గురువారాల్లో సెకండ్ డోస్ కింద పంపిణీ చేయనున్నారు.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లావ్యాప్తంగా మంగళవారం 1,075 పాజిటివ్‌లు నమోదవగా, వీటితో కలిపి మొత్తం కేసులు 1,50,281కు చేరుకున్నాయి. ఇన్ని కేసు లు దాటిన జిల్లా రాష్ట్రంలో తూర్పు ఒక్కటే కావడం మహమ్మారి కబళింపు తీవ్రతను చాటుతోంది. అటు మంగళవారం నాటి కేసుల్లో అత్య ధికంగా కాకినాడలో 151, రామచంద్రపురంలో 121 నమోదయ్యాయి. అటు మొత్తం బాధితుల్లో 435 మందిని హోంఐసోలేషన్‌కు అనుమతిచారు. కొత్తగా ఎనిమిది ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. మరోపక్క మంగళవారం 1,009 మంది కొవిడ్ బాధితులు వివి ధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో 16,853 కొవిడ్ బాధితులు వివిధ ఆరోగ్యస్థాయిల్లో చికిత్స పొందుతున్నారు. అటు మంగళవారం కొవిడ్‌తో తొమ్మిదిమంది కన్నుమూసినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 727కు చేరుకుంది. ఇదంతా ఒకెత్తయితే జిల్లాలో కేవలం 34 రోజుల్లో కొవిడ్ విలయం సృష్టించింది. మార్చి 31వరకు పెద్దగా జిల్లాపై కొవిడ్ ప్రభావం లేదు. అప్పటివరకు జిల్లావ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 1,25,336. కానీ ఏప్రిల్ ఒకటి నుంచి మే 4 వరకు అంటే 34 రోజుల్లో ఏకంగా 24,945 పాజిటివ్‌లు వచ్చాయంటే వైరస్ వేగం ఏస్థాయిలో ఉందో తల్చుకుంటేనే భయమేస్తోం ది. మంగళవారం కేసులతో మొత్తం పాజిటివ్‌లు 1,50,281కు చేరుకోగా, ఇన్ని కేసులతో రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అనేకమంది విచ్చలవిడిగా బయ ట తిరగడం, జనసమూహాల్లో అజ్రాగత్తగా వ్యవహరించడం, మాస్కుధారన లేకపోవడం ఇలా అనేక కారణాలతో జిల్లాలో పాజిటివ్‌లు వేలల్లో పుట్టుకొస్తున్నాయి. అనేకమందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ తీవ్రతను కొంతవరకైనా అడ్డుకునేందుకు రాష్ట్రప్రభుత్వం బుధవారం నుంచి 14 రోజులపాటు పగటిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ ఉత్తర్వులను జిల్లావ్యాప్తంగా పక్కాగా అమలుచేయడానికి అధికారులు నిర్ణయించారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎక్కడా ఉల్లంఘనలు లేకుండా సీరియస్‌గా కర్ఫ్యూ అమలు చేయనున్నారు. వాస్తవానికి తొలిసారి కొవిడ్ వేవ్‌లో ఉదయం పూట కర్ఫ్యూ కొన్ని నెలలు కొనసాగింది. ఈ సమయంలో జనం ఒక్కసారే బయటకు వచ్చేయడం, పట్టణాలు, పల్లెల్లో అయితే కర్ఫ్యూ సమయం దాటినా దుకాణాలన్నీ యథేచ్చగా నడపడం, కొందరైతే చాటుగానూ వ్యాపారాలు నిర్వహించారు. ఈ అనుభవాల నేపథ్యంలో ఈసారి పగటిపూట కర్ఫ్యూ గట్టిగా అమలుచేయాలని ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. 12 గంటలకు అన్నీ మూతపడేలా గంట ముందు నుంచే పర్యవేక్షించాలని పేర్కొన్నారు. అటు ఉదయం ఆరు నుంచి పన్నెండులోపు ఒక్కసారిగా జనం రద్దీ పెరిగే ప్రమాదం ఉన్నందున 144 సెక్షన్‌ను సైతం పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కువ రద్దీ ఉన్నచోట బాధ్యులపై కేసులకు కూడా వెనుకాడకూడదని నిర్ణయించారు. అటు మద్యం దుకాణాలు 12 తర్వాత మూసివేయాలని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఇక్కడ కూడా నిఘా పెట్టనున్నారు. అయితే మధ్యాహ్నం 12 నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు కొనసాగనుంది. ముఖ్యంగా 12 తర్వాత అనేక మంది రోడ్లపైకి సరాదాగా, కొందరైతే ఏదొక కారణంతో బయటకు వస్తున్న సంఘటనలు తొలివిడత కొవిడ్ లాక్డౌన్లో గుర్తించారు. అటువంటివారిపై కేసులు, జరిమానాలు విధించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. మరోపక్క జిల్లాకు మంగళవారం సాయంత్రం 40వేల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని బుధ, గురువారాల్లో సెకండ్ డోస్ వారికి మాత్రమే అందించనున్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు ఇతర ఉద్యోగులు, 45 ఏళ్లు నిండిన ప్రజలకు ఇస్తారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ)గా డాక్టర్ వెంకటబుద్ధ
ప్రస్తుత సూపరింటెండెంట్ మహాలక్ష్మికి కరోనా
జీజీహెచ్ (కాకినాడ), మే 4: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ (ఎఫ్ఏసీ)గా డాక్టర్ పెనుమాల వెంకటబుద్ధ నియమితులయ్యా రు. ఈ మేరకు డీఎంఈ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ఆర్.మహాలక్ష్మి ఐదు రోజుల కిందట కరోనా బారినపడి హోంఐసోలేషన్లో ఉన్నారు. ఈమె స్థానం లో ఆసుపత్రి పరిపాలనా సౌలభ్యం కోసం డాక్టర్ వెంకటబుద్ధను నియమించారు. ఈయన గతంలో నాలుగేళ్లపైబడి జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. మంగళవారం వెంకటబుద్ధ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటబుద్ధను ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, మినిస్టీరియల్ సిబ్బంది శేఖర్, పేపకాయల కృష్ణ, కిషోర్ మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు.
జీజీహెచ్ ఉద్యోగిని కరోనాకు బలి
తొలి వేవ్‌లో తండ్రి.. రెండో వేవ్‌లో తల్లి కూడా మృతి
జీజీహెచ్ (కాకినాడ), మే 4: కాకినాడ ప్రభు త్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)లో ఔట్ సోర్సింగ్‌లో ఫార్మాసిస్ట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నందమూరి రేవతి (40) కొవిడ్‌తో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా రు. ఆసుపత్రిలో చికిత్సల కోసం వచ్చిన రోగుల కు మందులు పంపిణీ చేసే విభాగంలో గత 12 ఏళ్లుగా రేవతి విధులు నిర్వహిస్తోంది. కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరింది. ఆరోగ్య పరిస్థితి విషమించడం తో మంగళవారం రేవతి మృతి చెందింది.. ఈమె మృతితో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో విషాదం నిండుకుంది. మార్చురీ వద్ద రేవతి మృతదేహాన్ని సందర్శించి సిబ్బంది నివాళులర్పించారు. గతేడాది కరోనా బారినపడి తండ్రి మృతి చెందగా, వారం రోజుల కిందట రేవతి తల్లి కొవిడ్‌తో మృతి చెందడం, ఇప్పుడు వారి కుమార్తె రేవతి మృతి చెందడంతో వీరింట విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉంటూ కొవిడ్ బారిన పడి మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు డిమాండ్ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి జీజీహెచ్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, వారి శ్రేయస్సుపైనా దృష్టి పెట్టాలన్నారు.
గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో
కొవిడ్ కొత్త పాజిటివ్ కేసులు : 1,075
మొత్తం పాజిటివ్ కేసులు : 1,50,281
జిల్లావ్యాప్తంగా యాక్టివ్ కేసులు : 16,853
కోలుకున్న వారి సంఖ్య : 1,32,701
మొత్తం మరణాలు : 727