కకావికలం

ABN , First Publish Date - 2021-05-21T06:17:33+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి జిల్లాను పట్టిపీడిస్తోంది. రోజులు గడుస్తున్నా వైరస్‌ జాడలు అంతకంతకూ విస్తరిస్తున్నాయే గానీ ఏమాత్రం కనికరించట్లేదు. ఒకపక్క ఇతర జిల్లాల్లో గణనీయంగా పాజిటివ్‌లు తగ్గుముఖం పడుతుంటే జిల్లాలో మాత్రం నిత్యం మూడు వేలకుపైగానే కేసులు నిర్ధారణ అవుతున్నాయి.

కకావికలం

  • అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్‌
  • 20 రోజుల్లో ఏకంగా 54,485 పాజిటివ్‌లు నమోదు
  • ప్రతీరోజూ మూడు వేలకు పైగా కేసులు
  • కొన్ని వారాలుగా పాజిటివ్‌ల్లో  రాష్ట్రంలో జిల్లాయే ఫస్ట్‌
  • ఆసుపత్రులకు రోజూ వేలల్లో పోటెత్తుతున్న బాధితులు
  • 59 ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో 8 ఐసీయూ, 29 ఆక్సిజన బెడ్లు మాత్రమే ఖాళీ
  • పగటి కర్ఫ్యూ అమలులో పూర్తిగా డొల్లతనం
  • దుకాణాల వద్ద యథేచ్ఛగా మూగుతున్న జనం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ మహమ్మారి జిల్లాను పట్టిపీడిస్తోంది. రోజులు గడుస్తున్నా వైరస్‌ జాడలు అంతకంతకూ విస్తరిస్తున్నాయే గానీ ఏమాత్రం కనికరించట్లేదు. ఒకపక్క ఇతర జిల్లాల్లో గణనీయంగా పాజిటివ్‌లు తగ్గుముఖం పడుతుంటే జిల్లాలో మాత్రం నిత్యం మూడు    వేలకుపైగానే కేసులు నిర్ధారణ అవుతున్నాయి. పగటి కర్ఫ్యూ అమల్లో ఉన్నా వైరస్‌ అదుపులోకి రావట్లేదు. ప్రతీరోజూ నమోదవుతున్న కేసుల్లో తూర్పు గోదావరి అత్యధిక పాజిటివ్‌లతో తొలి స్థానంలో ఉండడం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఉన్నతాధికారులకు కునుకుపట్టనీయడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈనెల ఒకటి నుంచి ఇరవై వరకు ఏకంగా ఎప్పుడూ లేని విధంగా 54,485 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయయంటే మహమ్మారి ఏ స్థాయిలో కల్లోలం సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అటు నిత్యం వస్తున్న మూడువేల కేసుల్లో దాదాపు వెయ్యిమంది వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్‌ల కోసం పోటెత్తుతుండడంతో అవన్నీ కిటకిటలాడుతున్నాయి. అత్యవసరమైన వారికి సకాలంలో పడకలు దొరక్క ఏకంగా ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్‌ల్లోనే చనిపోతున్న ఘోర దుర్ఘటనలు కళ్లకు కనిపిస్తున్నాయి. 

జిల్లా అధికారులు గురువారం విడుదల చేసిన లెక్కల ప్రకారం 59 ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో 543 ఐసీయూ పడకలకు గాను కేవలం 8 మాత్రమే ఖాళీగా ఉన్నట్టు వెల్లడైంది. ఇది కూడా ఊరుపేరు లేని ప్రైవేటు ఆసుపత్రుల్లో. 2,613 ఆక్సిజన్‌ బెడ్లకు 29 మాత్రమే అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే వాస్తవంలో ఈ లెక్కలు కూడా తప్పు. కానీ ఖాళీలు చూపించడం కోసమే ఈ సంఖ్యను బయటకు తీసుకు వచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌ తదితర కీలక కొవిడ్‌ ఆసుపత్రుల్లో అసలు ఏ తరహా పడక కూడా లేని దుస్థితి నెలకొంది. అనేకమంది అవసరానికి పడకలు దొరక్క కన్నుమూస్తున్నారు. నిత్యం వీరి సంఖ్య పదుల్లో ఉంటుంది. కానీ ఇవేవీ కొవిడ్‌ మరణాల్లోకి ఎక్కడం లేదు. రోజూ జిల్లావ్యాప్తంగా అనధికారికంగా 80మందికి పైగా కొవిడ్‌తో చనిపోతున్నట్టు ఆసుపత్రుల నుంచి బయటకు వెళ్తున్న మృతదేహాలు, శ్మశానంలో కాలుతున్న చితుల లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం తొమ్మిది లేదా పది సంఖ్య మాత్రమే చూపిస్తుంది. ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రభుత్వం పగటి కర్ఫ్యూ విధించగా కేసులు నియంత్రణలోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ దీనికి విరుద్ధంగా అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. వేలాదిమంది వైరస్‌ బారిన పడుతున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌ 30 నాటికి జిల్లాలో మొత్తం పాజిటివ్‌లు 1,41,782 కాగా... మే 20వ తేదీకి వచ్చేసరికి ఇరవై రోజుల వ్యవధిలో ఏకంగా 54,485 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్‌ ఏ స్థాయిలో పరుగులు తీస్తోందో తల్చుకుంటేనే భయమేస్తోంది. 

జిల్లాలో పగటి కర్ఫ్యూ మధ్యాహ్నం 12 తర్వాత అమల్లోకి వస్తోంది. ఈలోపు జనం ఎక్కడికక్కడ దుకాణాలు, మార్కెట్లు,మాల్స్‌, కిరాణా షాపుల వద్ద భారీగా గుమిగూడుతున్నారు. భౌతిక దూరం ఎక్కడా పాటించడం లేదు. కొందరు అక్కడక్కడా పాటిస్తుంటే ఆ మధ్యలోకి మరొకరు వచ్చి నిర్లక్ష్యంగా దూరిపోతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం మార్కెట్లు, దుకాణాల వద్ద ఇదే పరిస్థితి. దుకాణాల నిర్వాహకులు సైతం వినియోగదారులను భౌతిక దూరం పాటించాలనేది కూడా ఎక్కడ నిక్కచ్చిగా చెప్పడం లేదు. వ్యాపారం కోసం కొవిడ్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అయినా అధికారులు, పోలీసులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. 144 సెక్షన్‌ పేరుకే అన్నట్లు గాలికి వదిలేశారు. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 12లోపు అయితే జనసందోహం గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఈ గుంపులను నియంత్రించడకుండా పగటి కర్ఫ్యూ విధించినా ప్రయోజనం ఉండదని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అప్పటివరకు కేసులకు అడ్డుకట్ట ఉండదని చెప్తున్నారు.

Updated Date - 2021-05-21T06:17:33+05:30 IST