ప్రాణాలు పిండేసింది..!

ABN , First Publish Date - 2021-12-31T07:08:48+05:30 IST

2020లో కొవిడ్‌ తొలి వేవ్‌తో జిల్లా వణికిపోయింది. ఎక్కడా పెద్దగా ప్రాణనష్టం లేకున్నా వందలాది మంది కొద్దిపాటి అనారోగ్యానికి గురై ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు. నెలల తరబడి లాక్‌డౌన్‌లు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ గడ్డు రోజుల నుంచి 2021లో తేరుకున్నాం అనుకుని జీవన పయనం ప్రారంభించారు. అయినా మునుపటి మహమ్మారి భయం ఏదో మూల వెన్నాడుతుండడంతో బిక్కుబిక్కుమంటూనే రోజులు వెళ్లదీశారు.

ప్రాణాలు పిండేసింది..!

  • కొవిడ్‌ విలయతాండవంతో 2021లో జిల్లా విలవిల
  • జనవరి 1 నుంచి డిసెంబరు 30 వరకు ఏకంగా 1,71,366 పాజిటివ్‌లు
  • వేలల్లో కేసులు, వందల్లో మరణాలతో చిగురుటాకులా వణికిన జిల్లా
  • అత్యధికంగా మార్చి నుంచి జూన్‌ మధ్య కేసులు, మరణాల్లో విలయం
  • పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా మహమ్మారితో కకావికలం
  • సకాలంలో ఐసీయూ పడకలు దొరక్క, ఆక్సిజన్‌ అందక ఎన్నో  ప్రాణాలు బలి
  • కోట్లున్నా ఆక్సిజన్‌ సిలెండర్లు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు దొరక్క ఆర్తనాదాలు
  • పెద్దదిక్కు కోల్పోయి వీధిన పడిన వందలాది కుటుంబాలు
  • ఏప్రిల్‌ నుంచి వ్యాక్సిన్లు రావడంతో ఎక్కడికక్కడ తొక్కిసలాటలు, ఆందోళనలు
  • కేసుల తీవ్రతతో నెలల తరబడి నైట్‌ కర్ఫ్యూ.. కుదేలైన వ్యాపార రంగం
  • ఏడాది చివరాఖర్లో ఒమైక్రాన్‌ భయాందోళనలతో రేగుతున్న పాత గాయాలు 

ఎటుచూసినా మహమ్మారి విలయం.. ఆక్సిజన్‌ కోసం ఆర్తనాదాలు.. పడకల కోసం పడరాని పాట్లు.. కోట్లున్నా సమయానికి ఏమాత్రం అక్కరకురాని దీన పరిస్థితులు.. ఉన్నట్టుండి ఊపిరి బిగుసుకుపోవడం.. అంతలోనే అనాథల్లా కన్నుమూయడం.. అంబులెన్స్‌ నుంచి బయటకు దిగేలోపే కొనఊపిరి నిలవకపోవడం.. ఒక్కో ఆసుపత్రిలో వందల్లో శవాలు.. శ్మశానాలకు మృతదేహాల క్యూలు.. నిరంతరం కాలే కట్టెలు.. వైరస్‌ మహమ్మారి ఎవరిని ఎలా ఆవహిస్తోందో తెలియక బిక్కుబిక్కుమంటూ రోజులు యుగాల్లా గడిపిన క్షణాలు.. సంజీవిని తలపించేలా రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ దొరికితే చాలు దేవుడా అనేంతటి నిస్సహాయ రోజులు.. ఇలా ఒకటేంటీ 2021లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లాను కనివినీ ఎరుగని రీతిలో కకావికలం చేసింది. పల్లె, పట్టణం, నగరం తేడా లేకుండా చుట్టుముట్టేసింది. మార్చి నుంచి జూన్‌ మధ్యలో అయితే పెను ఉత్పాతమే..  ప్రతి ఒక్కరు కొవిడ్‌ భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతికిన పరిస్థితులు, వ్యాక్సిన్ల కోసం క్యూలు, కొట్లాటలు ఇంకా జనం కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

2020లో కొవిడ్‌ తొలి వేవ్‌తో జిల్లా వణికిపోయింది. ఎక్కడా పెద్దగా ప్రాణనష్టం లేకున్నా వందలాది మంది కొద్దిపాటి అనారోగ్యానికి గురై ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు. నెలల తరబడి లాక్‌డౌన్‌లు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ గడ్డు రోజుల నుంచి 2021లో తేరుకున్నాం అనుకుని జీవన పయనం ప్రారంభించారు. అయినా మునుపటి మహమ్మారి భయం ఏదో మూల వెన్నాడుతుండడంతో బిక్కుబిక్కుమంటూనే రోజులు వెళ్లదీశారు. అప్పటికి కొవిడ్‌ కేసులు రోజుకు పదిలోపే. దీంతో పీడ విరగడైపోయిందనే భావనతో పాతగాయాలను మర్చిపోతున్న జిల్లా ప్రజలపై కొవిడ్‌ రెండో వేవ్‌ ఒక్కసారిగా పంజా విసిరింది. మార్చి నెలాఖరు నుంచి జూన్‌ వరకు ఒక్కసారిగా ఉత్పాతంలా మీద పడి కనివినీ ఎరుగని విలయం సృష్టించింది. రోజూ రెండువేలకుపైగా పాజిటివ్‌లు నమోదై పల్లెలు, పట్టణాలు, నగరాలను చిగురుటాకులా వణికించింది. చిన్నాపెద్దా ముసలి, ముతకా ప్రతి ఒక్కరిని చుట్టేసింది. దీంతో వేలాదిమంది కొవిడ్‌తో అనారోగ్యం పాలయ్యారు. కొందరికి తీవ్ర జ్వరం, మరికొందరికి ఊపిరి ఆడకపోవడం, ఇంకొందరికి ఊపిరితిత్తుల్లో వైరస్‌ బలంగా వ్యాపించి ప్రాణాలకు చేటు చేసింది. ఫలితంగా మార్చి నెలాఖరు నుంచి జూన్‌ వరకు కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌, అమలాపురం కిమ్స్‌ ఇలా కొవిడ్‌ ఆసు పత్రులకు వేలాదిగా బాధితులు పోటెత్తారు. ఊపిరి ఆడక కొందరు, పరిస్థితి విషమించి మరికొందరు వేలాదిగా బాధితులు పోటెత్తడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌, సాధారణ పడకలన్నీ నిండిపోయాయి. కొత్తగా పాజిటివ్‌ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాలంటే బెడ్‌ దొరకని పరిస్థితి. దీంతో బాధితులు పడక కోసం రోజుల తరబడి పడిగాపులు కాశారు. కొవిడ్‌ చికిత్సకు అనుమతి పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇదే అదనుగా ఆక్సిజన్‌, ఐసీయూ పడకకు లక్షల్లో దోచేశారు. పలుకుబడి ఉన్నా అడిగినంత ముట్టచెబితేనే వైద్యం చేసిన పరిస్థితి. పోటెత్తుతున్న బాధితులకు తగ్గట్టుగా ప్రభుత్వం వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమవడంతో జిల్లాలో వేలాది మందికి సకాలంలో చికిత్స అందలేదు. దీంతో వందలాది మంది కొవి డ్‌ బాధితులు చనిపోయారు. వైరస్‌ తీవ్రతతో పరిస్థితి విషమించిన అనేకమందికి రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ అవసరం కావడంతో అవి బ్లాక్‌లో కొనలేక ఎందరో ప్రాణాలొదిలేశారు. ఒకనొకదశలో రూ.2,500 ఇంజక్షన్‌ను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దళారులతో కలిసి లక్షలకు విక్రయించాయి. ఆక్సిజన్‌ దొరక్క వందలాది మంది కొవిడ్‌ బాధితులు ఇళ్లలోనే ఆక్సిజన్‌ సిలెండర్లు ఏర్పాటు చేసుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీటికీ డిమాండ్‌ పెరిగిపోవడంతో ఒక్కో సిలెండర్‌ను వేలల్లో విక్రయించి దళారులు సొమ్ము చేసుకున్నారు. ఒక దశలో ఆక్సిజన్‌ సిలెండర్ల ను ఆస్తిలా కాపాడుకునే పరిస్థితులు తలెత్తాయి. ఇంతలా మహమ్మారి విలయతాండవం చేయడంతో సకాలంలో ఆసుపత్రిలో వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. 

గుట్టలుగుట్టలుగా మృతదేహాలు...

వేలల్లో పాజిటివ్‌ల ధాటికి, సకాలంలో వైద్య సదుపాయాలు అందించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో కాకినాడ జీజీహెచ్‌ మొదలు రాజమహేంద్రవరం డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం వందలాది మంది కన్నుమూశారు. ఒకానొక దశలో వారం వ్యవధిలో కేవలం ఈ నాలుగు ఆసుపత్రుల్లో 600 మందికిపైగా చనిపోయారు. వీరిలో 250 మంది ఒక్క జీజీహెచ్‌లోనే. కోనసీమలోని కొన్ని అనధికారిక కొవిడ్‌ ఆసుపత్రుల్లో మృతదేహాలను గుట్టలుగా ఉంచేశారు. అయితే ఈ మరణాలన్నింటిని ప్రభుత్వం దాచిపెట్టేసింది. ఏరోజుకారోజు మృతుల సంఖ్యను తక్కువగా చూపించి వైఫల్యాలను కప్పిపుచ్చేసింది. కానీ ప్రతి రోజూ కాకినాడ రూరల్‌లోని తూరంగి, రాజమహేంద్రవరం కైలాసభూమి, గ్రామాలు, పట్టణాల్లోని అనేక స్మశాన వాటికల్లో నిత్యం వందలాది చితులు కాలేవి. మొత్తం కేసుల విషయానికి వస్తే 2020 మార్చిలో తొలి పాజిటివ్‌ నమోదైంది మొదలు ఇప్పటివరకు జిల్లాలో 2,95,106 పాజిటివ్‌లు నమోదవగా, కొవిడ్‌ మృతులు 1,290. ఇందులో ఈ ఏడాదిలో వచ్చిన మొత్తం పాజిటివ్‌లు 1,71,366. మరణాలు 656 మాత్రమేనని ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంటున్నా కొన్ని వేల మంది చనిపోయారు. ఇదిలాఉంటే ఈ ఏడాదిలో వచ్చిన మొత్తం 1,71,366 కేసుల్లో ఒక్క మార్చి నెలాఖరు నుంచి జూన్‌ మధ్యలో వచ్చినవి 1.25 లక్షలకుపైగానే ఉన్నాయి. మరోపక్క 2.95 లక్షల పాజిటివ్‌లతో తూర్పుగోదావరి రాష్ట్రం మొత్తం మీద తొలి స్థానంలో నిలిచింది. ఒకపక్క ఇతర జిల్లాల్లో కేసులు తగ్గగా ఇక్కడ మాత్రం అదుపులో లేకపోవడంతో రాష్ట్రంలో ఎక్కువ కాలం పగటి కర్ఫ్యూ జిల్లాలోనే అమలైంది. ఇదంతాఒకెత్తయితే కరాళనృత్యం చేసిన కొవిడ్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో జిల్లాలో ఏప్రిల్‌ నుంచి సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా టీకా కోసం జిల్లావ్యాప్తంగా జనం పోటెత్తారు. కొట్లాటలు, క్యూలతో కొన్నినెలలపాటు వ్యాక్సిన్‌ కోసం జనం పడిగాపులు కాశారు. అయితే ఈ ఏడాది చివర్లో కేసులు తగ్గాయనుకుంటే మళ్లీ ఒమైక్రాన్‌ వైరస్‌ జిల్లాను క్రమేపీ చుడుతోంది. గురువారం నాటికి నాలుగు కొత్త ఒమైక్రాన్‌ కేసులు నమోదవడంతో మళ్లీ నాటి భయానక రోజులు కలవరపెడుతున్నాయి.

Updated Date - 2021-12-31T07:08:48+05:30 IST