కొవిడ్‌ కట్టడికి గ్రామస్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2021-05-18T06:16:22+05:30 IST

కొవిడ్‌ కట్టడికి ఆరోగ్య సేవలను గ్రామస్థాయికి వికేంద్రీకరిస్తూ కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇకపై ప్రతీ గ్రామంలోనూ 30 పడకలకు తక్కువ కాకుండా ఒకటికి మించి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.

కొవిడ్‌ కట్టడికి గ్రామస్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

  • ఇకపై డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌ సెంటర్లుగా పీహెచసీలు,  సీహెచసీలు
  • గిరిజన ప్రాంతాల్లో గ్రామసభల సమన్వయంతో నియంత్రణ చర్యలు
  • కేంద్రం తాజా మార్గదర్శకాలతో గ్రామాల్లో 30 బెడ్లతో ఐసోలేషన సెంటర్లు

రంపచోడవరం, మే 17: కొవిడ్‌ కట్టడికి ఆరోగ్య సేవలను గ్రామస్థాయికి వికేంద్రీకరిస్తూ కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. ఇందులో భాగంగా ఇకపై ప్రతీ గ్రామంలోనూ 30 పడకలకు తక్కువ కాకుండా ఒకటికి మించి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఆక్సిజన్‌ స్థాయి 94కు తక్కువ కాకుండా ఉన్న కొవిడ్‌ బాధితులకు,  తక్కువ ప్రభావంతో ఇంటి వద్ద ఐసోలేషన్‌కు వీలులేని వారి కోసం వీటిని నిర్వహించనున్నారు. సామాజిక ఆరోగ్య అధికారి/ ఏఎనఎం నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏదో ఒక డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌ సెంటర్‌కు గానీ, డెడికేటెడ్‌ కొవిడ్‌ ఆసుపత్రికి గానీ అనుసంధానంగా ఉండాలి. ఇక్కడ బాధితులకు ఇచ్చే మందులన్నీ అందుబాటులో ఉండాలి. జ్వరం, దగ్గు, రొంపలను అదుపు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయిని పరిశీలించే పరిస్థితి ఉండాలి. కొవిడ్‌ బాధితులను కాకుండా ఆయా లక్షణాలతో అనుమానంగా ఉన్న వారికి కూడా ఇక్కడ ఐసోలేషన్‌ కల్పించాలి. 

ఇకపై అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులను డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌ సెంటర్లు (డీసీహెచ్‌సీ)గా పిలుస్తారు. ఇక్కడ 30కి తక్కువ కాకుండా పడకలను ఆక్సిజన్‌ సదుపాయంతో ఏర్పాటు చేయాలి. 24/7 పద్ధతిలో పని చేయాలి. 94 కంటే తక్కువ స్థాయి ఆక్సిజన్‌ ఉన్న కొవిడ్‌ బాధితులు కచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి. ప్రమాద పరిస్థితుల్లో బాధితులు చేరుకుంటే డెడికేటెడ్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేర్చాలి. ఇక్కడ అత్యవసర మెరుగైన వైద్య సేవలను అందించే స్థాయిలో సౌకర్యాలు ఉండాలి. జిల్లా ఆసుపత్రులు, సాధారణ ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ప్రయివేటు రిఫరల్‌ ఆసుపత్రులు డెడికేటెడ్‌ కొవిడ్‌ ఆసుపత్రులుగా ఏర్పాటవుతాయి. 

ఇదిలా ఉండగా గిరిజన ప్రాంతాలకు మరింతగా కొవిడ్‌ ఆరోగ్య సేవలను అందించాలని, గ్రామసభల సమన్వయంతో ఆయా గ్రామాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ ఉండాలి. అంతే కాకుండా సంచార వైద్యశాలలను కూడా ప్రతీ డీసీహెచ్‌ఎస్‌కు అనుబంధంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఏర్పాటు చేయాలి. అయితే గిరిజనులకు ఆరోగ్యంపై అవగాహన తక్కువగా ఉంటుంది. అందుకే ఏజెన్సీలోని కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. ఈ తాజా కేంద్ర మార్గదర్శకాలు కొవిడ్‌ సేవలను ఎంతవరకు అమలు చేయగలవో, ఎందరి ప్రాణాలను కాపాడగలవో వేచి చూడాలి. 


Updated Date - 2021-05-18T06:16:22+05:30 IST