పిలిచినా రావట్లేదు..!
ABN , First Publish Date - 2021-10-29T06:48:32+05:30 IST
జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో కేవలం చిన్నచిన్న వైద్య సేవలు మినహా అంతకుమించి సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించి గర్బిణీలకు పరిస్థితి విషమించినప్పుడు హెచ్‌డీయూ యూనిట్లు, అప్పుడే పుట్టిన శిశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ఐసీయూ పడకలు లేనేలేవు.
- నమ్మకం పూర్తిగా పాయే
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త పడకల ఏర్పాటు టెండర్లపై సర్కారుకు షాక్
- రూ.1.15 కోట్లతో హెచ్‌డీయూ, ఎస్‌ఎన్‌సీయూ పడకలకు ఇప్పటికి ఆరు సార్లు టెండర్లు
- ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాని దయనీయ దుస్థితి
- రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో రూ.27.39 లక్షల పనికి తొమ్మిది సార్లు టెండర్ కాల్
- అయినా ఏ ఒక్కరు ముందుకు రాని వైనం.. తలపట్టుకుంటున్న ఏపీఎంఎస్‌ఐడీసీ
- ఒకపక్క సౌకర్యాలు అందుబాటులోకి రాక గర్బిణీ, నవజాత శిశువులకు నరకయాతన
ఒకప్పుడు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెండర్ పనులంటే కాంట్రాక్టర్లు రివ్వున వాలిపోయేవారు. పని దక్కించుకునేందుకు నువ్వానేనా అన్నట్లు పోటీపడేవారు. పని దక్కితే పండగే అన్నట్టు వ్యవహరించేవారు. పిలిచిన ఒక్క సారికే టెండర్లు ఖరారై పనులు ప్రారంభమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తిరగబడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల టెండర్లకు పోటీ పడే కాంట్రాక్టర్లే కరువయ్యారు. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదిసార్లు ఒకే పనికి టెండర్ పిలుస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. సర్కారు టెండర్‌పై అసలేమాత్రం ఆసక్తి చూపడం లేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం ఇప్పుడు అసలు ఏ బిల్లు కూడా చెల్లించే దుస్థితిలో లేకపోవడంతో కాంట్రాక్టర్లలో ప్రభుత్వంపై నమ్మకం సడలిపోయింది. దీంతో అసలెవ్వరూ ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే అయిదు ఏరియా, ఒక జిల్లా ఆసుపత్రిలో రూ.1.15 కోట్లతో అదనపు పడకల ఏర్పాటు కోసం పిలిచిన టెండర్ల కథ.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో కేవలం చిన్నచిన్న వైద్య సేవలు మినహా అంతకుమించి సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించి గర్బిణీలకు పరిస్థితి విషమించినప్పుడు హెచ్‌డీయూ యూనిట్లు, అప్పుడే పుట్టిన శిశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ఐసీయూ పడకలు లేనేలేవు. ఒకటీ రెండు చోట్ల అర కొరగా ఉన్నా అవీ పనిచేయడం లేదు. దీంతో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, లేదంటే ప్రైవేటు ఆసుపత్రులే జిల్లావాసులకు దిక్కు. ఇక ఏజెన్సీ ప్రాంతంలో గర్బిణీలు, శిశువులకు పరిస్థితి విషమిస్తే కాకినాడ వచ్చేలోపు ఎందరో ప్రాణాలు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో రంపడచోడవరం, రామచంద్రపురం, తుని, అమలాపురం ఏరియా ఆసుపత్రులతోపాటు రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రుల్లో హెచ్‌డీయూ, ఎస్‌ఎన్‌సీయూ పడకల ఏర్పాటుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కొన్ని నెలల కిందట టెండర్లు పిలిచింది. వాస్తవానికి కొందరు గర్బిణీలకు ప్రసవం సమయంలో పరిస్థితి విషమి స్తుంది. అటువంటి వారికి ఐసీయూలో చికిత్స చేయాల్సి ఉంటుంది. అక్కడ చికిత్స అం దించి కొంతవరకు కోలుకున్న తర్వాత హైడిపెండన్సీ యూనిట్ (హెచ్‌డీయూ)కు తరలించాలి. అంటే మధ్యస్థ ఐసీయూ అన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజులకు సాధారణ వార్డుకు తరలిస్తారు. మరోపక్క అప్పుడే పుట్టిన శిశువులకు గుండె, ఊపిరితిత్తుల సమస్య, ఉమ్మనీరు తాగడం, పచ్చకామెర్లు, తక్కువ బరువులో జన్మించడం వంటి సమస్యలు తలెత్తితే చికిత్స కోసం స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్స్ (ఎస్‌ఎన్‌సీయూ)కు తరలించాలి. కానీ ఇవేవీ ఏరియా ఆసుపత్రుల్లో లేక బాలింతలు, శిశువులు నరకయాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ఆధు నికీకరణతోపాటు అక్కడ మొదటి అంతస్తులో పది పడకల ఎస్‌ఎన్‌సీయూ ఏర్పాటు కు కొన్ని నెలల కిందట రూ.27.39 లక్షల పనికి టెండర్ పిలిచారు. అలాగే నాలుగేసి ఒబెస్ట్రిక్ హెచ్‌డీయూ పడకల ఏర్పాటుకు అమలాపురం ఏరియా ఆసుపత్రికి రూ. 12.41 లక్షలు, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి రూ.12.40లక్షలు, తుని ఏరియా ఆసుపత్రికి రూ.11.63 లక్షలు, రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రూ.11.60 లక్షలు, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో ఎనిమిది పడకల హెచ్‌డీయూ యూనిట్లకు రూ.11.64 లక్షలు, అమలాపురం ఏరియా ఆసుపత్రిలో 10 పడకల ఎస్‌ఎన్‌సీయూ ఏర్పాటుకు రూ.28.13 లక్షలు కేటాయించి పనులకు టెండర్లు పిలిచారు. వీటన్నింటికి విడివిడిగా తొలి టెండర్ నోటిఫికేషన్ కొన్ని నెలల కిందట ఇచ్చారు. టెండరు ఖరారైన వెంటనే పనులు మొదలుపెట్టాలని షరతు విధించారు. తీరా ఒక్కటంటే ఒక్క టెండర్‌కు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో గడువు పూర్తవడంతో మళ్లీ రెండోసారి ఈ ఆసుపత్రుల్లో పనులకు టెండర్లు పిలిచారు. ఇలా ఒకటికాదు రెండు కాదు గడచిన మూడు నెలల్లో ఇప్పటివరకు ఆరుసార్లు టెండర్లు పిలిచారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒక్క కాంట్రాక్టర్ కూడా పని దక్కించుకోవడానికి ఆసక్తి చూపలేదు. రంపచోడవరం టెండర్ పరిస్థితి మరీ దారుణం. రూ.27.39 లక్షల పనికి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు టెండర్లు పిలిచారు. కానీ ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. దీంతో ఏపీఎంఎస్‌ఐడీసీ తలపట్టుకుంటోంది. ఇలాగైతే ఆసుపత్రిలో కొత్త పడకల ఏర్పాటుకు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అయోమయంలో ఉంది. చివరకు పని మొదలుపెడితే బిల్లులు ఇస్తామం టూ కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి అధికారులు బతిమాలుతున్నారు. కానీ ప్రభుత్వంపై నమ్మకం లేక ఎవరూ బిడ్ దాఖలుకు సాహసించడం లేదు. ఇప్పటికే వందల కోట్లు బాకీలు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందని, ఇప్పుడు అప్పులు చేసి పను లు చేయలేమని చెబుతున్నారు. దీంతో చేసేదిలేక మరోసారి ఇప్పుడు ఈ వర్కులన్నింటికి అధికారులు మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచారు. నవంబరు 2లోపు బిడ్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈసారి ఏమవుతుందో చూడాలి మరి.